logo

ఎన్నికల సిబ్బందికి ముందే ఓటు

లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated : 01 May 2024 05:45 IST

 ఈ నెల 3 నుంచి 8 వరకు అవకాశం

న్యూస్‌టుడే, రాంనగర్‌, భీంపూర్‌ : లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మే 3 నుంచి 8 లోగా ఓటు వేసేందుకు అవకాశాన్ని కల్పించారు. ఎన్నికల సిబ్బంది తమ ఓటును పక్కాగా వినియోగించుకునేందుకు వీలుగా మొదటి విడత శిక్షణ సమయంలోనే ఎన్నికల సిబ్బంది నుంచి దరఖాస్తులు తీసుకొని ఓటు హక్కును కల్పించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు వేసే విషయంలో ఎన్నికల సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొంత మంది ఓట్లు తిరస్కరణకు గురవుతున్నాయి.  

పక్కాగా ఓటు  

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొత్తం 5,270 ఉద్యోగులు, సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం పార్లమెంట్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మొదటి విడత శిక్షణ కంటే ముందుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమాచారం సేకరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం గతంలో ఉద్యోగులు సొంతంగా దరఖాస్తు చేసుకునేవారు. కొంతమందికి అవగాహన లేక దరఖాస్తు చేసుకునేవారు కాదు. ఈ దఫా శిక్షణ ఉత్తర్వులతో పాటు ఫారం..12లో ఉద్యోగులకు సంబంధించిన ఓటు వివరాలను ముద్రించి ఇచ్చారు. శిక్షణకు వెళ్లిన సమయంలో ఆర్డర్‌తో పాటు ఫారం 12, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్‌ ప్రతిని జత చేసి, ఎక్కడ ఓటు వేస్తారనే విషయాన్ని ఫారంలో తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు. ఇలా చేయడంతో ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగికి ఓటు వేసే అవకాశం దక్కింది.

ఓటు వేసే కేంద్రాలు

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు మే 3 నుంచి 8వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు అధికారులు ఆయా ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో అందుబాటులో ఉంటారు. వీలును బట్టి ఆయా రోజుల్లో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఎన్నికల సిబ్బందిలో ఎవరికి ఎక్కడ ఓటు హక్కు ఉందో అదే నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లి ఓటు వేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని