logo

గోదాములకు సీల్‌.. వ్యాపారుల గోల్‌మాల్‌

రైస్‌ మిల్లు యజమాని లీజుకు తీసుకున్న గోదాములను బ్యాంకు అధికారులు సీజ్‌ చేయడంతో అందులోని ధాన్యం నిల్వల సంగతేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ గోదాములను అద్దెకిచ్చిన యజమాని బ్యాంకు అప్పు చెల్లించడం లేదని ఎస్‌బీఐ అధికారులు వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Published : 04 May 2024 06:27 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

పొచ్చర సమీపంలోని ఆయిల్‌ మిల్లు గోదాం వద్ద బ్యాంకు అధికారులు సీజ్‌ చేసినట్లు రాసిన వివరాలు

రైస్‌ మిల్లు యజమాని లీజుకు తీసుకున్న గోదాములను బ్యాంకు అధికారులు సీజ్‌ చేయడంతో అందులోని ధాన్యం నిల్వల సంగతేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ గోదాములను అద్దెకిచ్చిన యజమాని బ్యాంకు అప్పు చెల్లించడం లేదని ఎస్‌బీఐ అధికారులు వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఆదిలాబాద్‌ మండలం పొచ్చర గ్రామ శివారులో రెండు గోదాములను రైస్‌ మిల్లు వ్యాపారి అద్దెకు తీసుకున్నారు. రెండు గోదాముల్లో ప్రస్తుతం దాదాపు 30వేల క్వింటాళ్ల వరి ధాన్యం నిల్వలున్నట్లు సమాచారం. అయితే ఆ గోదాములను అద్దెకు ఇచ్చిన యజమాని రుణ బకాయి ఉన్నారని ఎస్‌బీఐ అధికారులు వాటికి సీల్‌ వేశారు. ఇది జరిగి దాదాపు నెల రోజులు కావొస్తోంది. ధాన్యం నిల్వలు అందులోనే మగ్గుతున్నాయి. రైస్‌మిల్లు వ్యాపారి పత్తా లేడు. మరి ఆ ధాన్యాన్ని బియ్యంగా ఎప్పుడు మారుస్తారు? ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)కి ఎప్పుడు అందిస్తారు? వంటి సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి పౌరసరఫరాల సంస్థ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా ధాన్యం నిల్వలను తనిఖీ చేస్తుండాలి. రైస్‌మిల్లు వ్యాపారి ధాన్యం ఎక్కడ నిల్వ చేస్తున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలపై అధికారులు పరిశీలన చేయాలి. ఇక్కడ మాత్రం మిల్లు యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. అసలు గోదాములు అద్దెకు తీసుకునే సమయంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలో అధికారులే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, సలహాలు సూచలను ఇవ్వాలి. ఇక్కడ అలాంటిదేమి జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ధాన్యం కాస్త గోదాంలలో మగ్గుతోందని తెలుస్తోంది.

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పొచ్చర సమీపంలోని గోదాముకు వేసిన బ్యాంకు సీల్‌

కొనసాగుతున్న విచారణ

పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ రైస్‌ మిల్లులో ఆదిలాబాద్‌లోని వినాయక ట్రేడర్స్‌ పేరిట ఎఫ్‌సీఐ ముద్రవేసి ఉన్న బియ్యం సంచులను పట్టుకున్న కేసులో పోలీసులు తమ విచారణ కొనసాగిస్తున్నారు. ఇదివరకే మిల్లులు, గోదాములు లీజుకిచ్చిన కొందరు యజమానులను సంగారెడ్డికి పిలిపించి వివరాలు రాబట్టారు. వారు తమకేం సంబంధం లేదని తాము కేవలం అద్దెకు మాత్రమే ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు. మరికొందరు కూలీలు, లారీల డ్రైవర్లను వంతుల వారీగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే కీలక సూత్రధారులైన రైస్‌ మిల్లు యజమానులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఆదిలాబాద్‌లోని అయిదు మిల్లులకు తాళాలు వేసి వెళ్లిపోయిన సదరు వ్యాపారులను విచారిస్తేగాని ఏ మేరకు అక్రమాలు జరిగాయనేది వెలుగుచూస్తుంది. మొత్తం 22 వేల టన్నులు ధాన్యం నిల్వలు కొన్ని నెలలుగా తొమ్మిది రైస్‌మిల్లు వ్యాపారుల వద్దే ఉండటం, వ్యాపారులు అందుబాటులో లేకపోవడంపై జిల్లా అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని