logo

శేఖర్‌ మాస్టర్‌ మెచ్చిన.. డీజే శేఖర్‌

శేఖర్‌ మాస్టర్‌ సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని వ్యక్తి. నృత్య దర్శకత్వంతో పాటు ఈటీవీ నిర్వహించే ‘ఢీ’ ప్రోగ్రాం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Published : 07 May 2024 03:44 IST

సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఇచ్చోడ యువకుడు

శేఖర్‌ మాస్టరుతో డీజే శేఖర్‌, గాయని స్నేహ

సారంగాపూర్‌, ఇచ్చోడ, న్యూస్‌టుడే: శేఖర్‌ మాస్టర్‌ సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని వ్యక్తి. నృత్య దర్శకత్వంతో పాటు ఈటీవీ నిర్వహించే ‘ఢీ’ ప్రోగ్రాం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆయన బిజీగా ఉన్నారు. కానీ ఆ మాస్టరే తనను కలవాలని ఓ యువకుడికి కబురు పంపారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన డీజే శేఖర్‌ (కల్లెపెల్లి చంద్రశేఖర్‌)కు మాస్టరును కలిసే అవకాశం తలుపుతట్టింది. ఈ యువకుడి సంగీత ప్రతిభ తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి పొందడం గొప్ప విశేషం.. శేఖర్‌ మాస్టరు, డీజే శేఖర్‌ల పరిచయం. కలిసి పనిచేసిన తీరు, వారి విజయ పరంపర వివరాలిలా..

చంద్రశేఖర్‌..డీజే శేఖర్‌ ఎలా అయ్యారు..

చంద్రశేఖర్‌ ఓ సాధారణ యువకుడే. డిగ్రీ చేస్తూనే కంప్యూటర్‌ నేర్చుకున్నారు. ఉపాధికోసం 2010 నుంచి డీజే మిక్సింగ్‌ చేయడం ప్రారంభించారు. సుమారు పదేళ్ల పాటు ఇదే వృత్తిలో కొనసాగడంతో ఆయన పేరు డీజే శేఖర్‌గా మారిపోయింది. డీజే సాంగ్స్‌ మిక్సింగ్‌లో అనుభవంతో మూడేళ్ల క్రితం పాటలకు సంగీత స్వరకల్పన ప్రారంభించారు. వందకుపైగా పాటలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. సంగీత విభాగంలో ఎలాంటి శిక్షణ లేకపోయినా డీజే మిక్సింగ్‌ అనుభవంతో మ్యూజిక్‌ చేయడంలో రాణిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లానే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన వద్దకు సంగీతం చేయించుకోవడానికి పలువురు వస్తుండడం విశేషం.  

శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆహ్వానం..

‘అల్లిబిల్లి సోకులాడి చిట్టమ్మ’ పాట పాపులర్‌ కావడంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌ డీజే శేఖర్‌, రచయిత్రి, గాయని కట్కూరి స్నేహను ఫిబ్రవరి చివరి వారంలో జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కు విశిష్ట అతిథులుగా ఆహ్వానించారు. స్నేహ ప్రత్యక్షంగా ‘అల్లిబిల్లి సోకులాడి చిట్టమ్మ’ పాడగా నృత్య దర్శకురాలు గ్రీస్మా, హీరోయిన్‌ భూమిక నృత్యం చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ వేదిక నుంచి శేఖర్‌ మాస్టరు..డీజే శేఖర్‌ పరిచయం, కలిసి పనిచేసిన తీరును, ఆయనలోని సంగీత ప్రతిభ, అంకితభావం వంటి విషయాలను అందరికీ వివరించారు. శేఖర్‌కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఆయనతో మరిన్ని పాటలను కలిసి చేస్తామని శేఖర్‌ మాస్టరు చెప్పడం విశేషం. దీంతో డీజే శేఖర్‌ తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు ఇలా పరిచయమయ్యారు. వెనకబడిన ప్రాంతాల్లోనూ ఆణిముత్యాలుంటాయని వీరి విజయాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సోదరి గాయని స్నేహతో సంగీత దర్శకుడు డీజే శేఖర్‌

ఎలా ఆకట్టుకున్నాడు..

డీజే శేఖర్‌ చేసిన పాటల్లో ‘సీమ దసరా చిన్నోడు’ అనే పాట చాలా పాపులర్‌. 2023 జూన్‌ 29న శేఖర్‌ వివాహం జరిగిన రోజే విడుదలైన ఆ పాట పది నెలల్లోనే 75 మిలియన్ల వీక్షణల(వ్యూస్‌)ను సొంతం చేసుకుంది. ఈ పాటను విన్న శేఖర్‌ మాస్టరు దీనికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరని ఆరా తీశారు. డీజే శేఖర్‌ చరవాణి నెంబరు తెలుసుకుని తన సహాయకుడితో మాట్లాడించారు. ఆ తరువాత మాస్టరే నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడారు. మీరు చేసిన సాంగ్‌ చాలా బాగుంది. నేను ఒక ఛానల్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్న. దానికోసం తొలిసాంగ్‌ మీదే కావాలని అడిగారు. దీనికి ఒప్పుకోవడంతో రెండు రోజుల్లోనే హైదరాబాద్‌కు పిలిపించారు. ‘అల్లిబిల్లి సోకులాడి చిట్టమ్మ’ పాట లిరిక్స్‌ విన్న మాస్టరు రాసిందెవరు పాడేదెవరు అని ఆరా తీశారు. మా పెద్దమ్మ కూతురు స్నేహ రాసింది, తానే పాడుతుందని డీజే శేఖర్‌ చెప్పడంతో వెంటనే ప్రారంభించండి అన్నారు మాస్టరు. ఆ తరువాత ఆ ఆల్బమ్‌ సాంగ్‌ చాలా పాపులర్‌ అయింది. ఆ పాటకు రెండు నెలల్లోనే 19 మిలియన్ల వీక్షణలు నమోదు కావడం విశేషం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని