logo

సీఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త

సీˆఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అని భారాస పెద్దపల్లి ఎంపీˆ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

Published : 07 May 2024 03:47 IST

భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్‌

బెల్లపల్లిలో మాట్లాడుతున్న భారాస ఎంపీˆ అభ్యర్థి ఈశ్వర్‌

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: సీˆఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అని భారాస పెద్దపల్లి ఎంపీˆ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈశ్వర్‌ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీని గెలిపించాలని కోరారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కోటీశ్వరుల కుటుంబం గెలిస్తే ప్రజల కోసం చేసేది ఏమీ ఉండదన్నారు. ఒకే ఇంట్లో ముగ్గురికి పదవులు ఇవ్వడం సామాజిక న్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కుటుంబ పాలనంటూ కేసీˆఆర్‌ కుటుంబంపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే వివేక్‌ ఇప్పుడు చేస్తున్నది ఏమిటన్నారు. ప్రజలంతా కార్మికుడిగా పనిచేసిన వ్యక్తిని ఎంపీˆగా గెలిపించాలన్నారు. కార్పొరేట్‌ శక్తులను గెలిపిస్తే ప్రజలకు ఏమీ చేయలేరన్నారు. కాంటాచౌరస్తా, బజార్‌ఏరియాల్లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, తెబొగకాసం నాయకులు శ్రీనివాస్‌, సంపత్‌, రమేష్‌ పాల్గొన్నారు.


‘కుటుంబ పాలనే కొనసాగాలా?’

భీమారంలో మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌

భీమారం, న్యూస్‌టుడే: 40 ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం కుటుంబ హక్కుగా వారసుల పాలనే కొనసాగాలా? లేక స్థానికంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతను గెలిపించుకోవాలో ప్రజలు నిర్ణయించుకోవాలని పెద్దపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ ఓట్లు, సీట్లు ఈ ప్రాంతంలో గెలిచి ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు పెట్టి నియోజకవర్గాలకు సెలవు దినాల్లో మాత్రమే వచ్చిపోయే వివేక్‌ కుటుంబం వంటి నాయకులకు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన గుణపాఠం నేర్పించాలన్నారు. తాతల నుంచి పదవులు అనుభవిస్తున్న వారి కుటుంబాల స్థితులు మార్చుకున్నారే కానీ స్థానిక ప్రజల స్థితిగతులను ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. సింగరేణి సంస్థ, జైపూర్‌ పవర్‌ ప్లాంట్ను ఆదుకున్నామని చెప్పే నాయకులు స్థానికుల ఉద్యోగావకాశాలు, డిపెండెంట్ ఉద్యోగాల కోసం కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయంలో కనీసం ఒక్కసారైనా నియోజకవర్గంలో కనిపించారా వారికి ఎన్నికలు తప్ప ప్రజల బాగోగులు పట్టవన్నారు. భారాస పాలనలో ప్రజలు పడరాని పాట్లు పడ్డారని పేదలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్‌, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌, మండలాధ్యక్షుడు బోర్లకుంట శంకర్‌, ప్రధాన కార్యదర్శులు వెల్పుల రాజేష్‌, మాడెం శ్రీనివాస్‌, విజయ, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ పార్టీతో అన్ని వర్గాలకు న్యాయం

మందమర్రిలో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

రామకృష్ణాపూర్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ అన్నారు. సోమవారం మందమర్రి కేకే5 గనిపై ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఐఎన్‌టీయూసీ నాయకులు జనక్‌ప్రసాద్‌తో కలిసి ద్వార సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల భారాస పాలనలో ఇసుక దందాలు, భూకబ్జాలు చేశారని ఎంపీ అభ్యర్థి ఆరోపించారు. భారాస అధినేత కేసీఆర్‌, ఎంపీలు సింగరేణి కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. భారాస హయాంలో కొత్త గనులు, ప్రభుత్వ సంస్థలు ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు. మందమర్రిలో తోళ్ల పరిశ్రమ పునఃప్రారంభించి 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఉపాధిహామీ కూలీలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఉపాధిహామీ కూలి రూ.400 అందజేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని