logo

వస్తామంటున్న నేతలు.. వద్దంటున్న శ్రేణులు

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో రాజకీయ పరిస్థితులు చిత్ర, విచిత్రంగా మారుతున్నాయి.

Published : 07 May 2024 03:52 IST

పార్టీల్లో చేరికల్లో ఇదో కోణం..

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో రాజకీయ పరిస్థితులు చిత్ర, విచిత్రంగా మారుతున్నాయి. ఆ ఎన్నికల్లో అవతలి వైపు ఉన్నవారు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఇవతలి వైపు వచ్చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు కిందిస్థాయి నాయకులు పార్టీ మారేందుకు తహతహలాడుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే వైపు వరుస కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలోపే తమకంటూ ఓ వేదిక చూసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పుడే పార్టీలో ప్రాధాన్యం పెంచుకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చనే భావనతో పార్టీ మారేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అలాంటి వారి రాకను పార్టీ కీలక నాయకులు, శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, వారు వద్దే వద్దంటున్నారు. దీంతో చేరికల విషయంలో ఎమ్మెల్యేలు ఆలోచనలో పడుతున్నారు. తమను వద్దంటే మరో పార్టీలోకి వెళ్తామనే లీకులు ఇస్తూ ప్రచారం చేయిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కథనం.

పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో..

జిల్లాలోని ఓ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు చిత్రవిచిత్రంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తదుపరి ఓ కీలక నేత చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపాయి. తన ఓటమికి పని చేసిన ప్రత్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోను. తన విజయం కోసం పని చేసినవారిని నాయకులు, ప్రజా ప్రతినిధులుగా తయారు చేసుకుంటానని ఆ దిశగా అడుగులు వేశారు. పార్టీలోకి వస్తామని పలువురు రాయబారం పంపినా ఎవరినీ తీసుకోలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. అధిష్ఠానమే వచ్చేవారందరినీ పార్టీలోకి తీసుకోవాలని చెప్పడంతో చేసేదేమీ లేక చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తమపై దాడులు, కేసులు బనాయించిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం ఓ పార్టీకి చెందినవారు పెద్దసంఖ్యలో చేరేందుకు తరలిరాగా చివరినిమిషంలో కీలకనేత రాకను అడ్డుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. చివరకు వచ్చినవారికి స్థానిక ఒకరిద్దరు నాయకులే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే సొంత పార్టీ నాయకులు మాత్రం పట్టణంతోపాటు గ్రామాల్లో మరింత జోష్‌తో ప్రచారం చేస్తున్నారు.

వద్దంటే అటువైపు వెళ్తాం

పార్టీలోకి వస్తామంటే అడ్డుకుంటున్నారు. ఇక తాము మరో పార్టీలోకి వెళ్తామని కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు లీకులు ఇస్తున్నారు. కండువాలు వేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. వారు గత కొన్ని రోజులుగా పార్టీలో చేరేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేదు. వారిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని, ప్రజల్లో వారికి మంచి పేరు లేదని కీలక నేతకు  చెప్పడంతో చేరికలకు బ్రేక్‌ పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదివరకే పార్టీలో చేరినవారంతా ఎన్నికల ప్రచారం చేయడం లేదని, కేవలం చేరికలకే పరిమితమయ్యారని కీలక నేత దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.  

చేరికపై రగడ

కాసిపేట, న్యూస్‌టుడే: ఓ ప్రధాన పార్టీలో చేరేందుకు మరో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు గత పక్షం రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాసిపేట మండలంలోని ఓ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు 200 మంది మరో ప్రధాన పార్టీలో చేరేందుకు గత పక్షం రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. వారు రాకుండా ఈ పార్టీలోని నాయకులు అడ్డుకుంటున్నారు. దీంతో వారం రోజులుగా ప్రధాన పార్టీ కీలక నేత నివాసానికి వెళ్లినా అక్కడి నుంచి సైతం సరైన పిలుపు రాలేదు. ఆదివారం నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలుసుకున్న ప్రధాన పార్టీ నేత నివాసానికి వెళ్లి ఆందోళన చేపట్టారు. నాయకులను చేర్చుకుంటే టవర్‌ ఎక్కుతామని, ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఏమీ చేయలేక పార్టీలో చేరేందుకు వెళ్లిన నాయకులు వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని