logo

ఏటా ఇదే తంతు..

కాకతీయ.. ఉన్నత విద్యాప్రమాణాల్లో న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ పొందిన విశ్వవిద్యాలయం. కానీ కొన్నేళ్లుగా తన పనితీరుతో అభాసుపాలవుతోంది. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ‘వ్యక్తిగత ప్రయోజనాల’కు ప్రాధాన్యమిస్తూ కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు దీని చరిత్రను మసకబారుస్తున్నాయి.

Updated : 08 May 2024 07:03 IST

దొడ్డిదారిన పరీక్ష కేంద్రాల కేటాయింపు

న్యూస్‌టుడే, నిర్మల్‌ పట్టణం: కాకతీయ.. ఉన్నత విద్యాప్రమాణాల్లో న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ పొందిన విశ్వవిద్యాలయం. కానీ కొన్నేళ్లుగా తన పనితీరుతో అభాసుపాలవుతోంది. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ‘వ్యక్తిగత ప్రయోజనాల’కు ప్రాధాన్యమిస్తూ కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు దీని చరిత్రను మసకబారుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా.. పనితీరు మారడం లేదు. ఎప్పటికప్పుడు వింత పోకడలతో నిబంధనలకు కొత్త అర్థం చెబుతున్నారు. ఇవన్నీ తెలిసినా.. గవర్నర్‌, ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖాధికారులు కళ్లు మూసుకున్న చందంగా వ్యవహరిస్తుండటంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా పరిస్థితి తయారైంది.

పట్టింపులేనట్లుగా..

డిగ్రీ పరీక్ష కేంద్రాల కేటాయింపులో కేయూ పనితీరు ఏటా విమర్శల పాలవుతోంది. విద్యార్థుల సౌలభ్యంతో పనిలేకుండా, కొందరి ప్రయోజనార్థం  కూర్చున్నచోట నుంచే కేంద్రాలను కేటాయిస్తున్నారనే వాదనలున్నాయి. సాకుల మాటున అనుయాయులకు ‘మేలు’ చేస్తూ, మెజార్టీ కళాశాలల విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే, ఫిర్యాదుచేస్తే వేధింపులు తప్పవన్న భయంతో చాలా యాజమాన్యాలు మిన్నకుండిపోతున్నాయి. ఇది అలుసుగా తీసుకొని అధికారులు కొన్ని యాజమాన్యాల స్వలాభం కోసం వారి నుంచి అందినంత దండుకుంటూ, ఏటా ఈ ప్రక్రియను పునరావృతం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

  • ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ మండలంలోని పరీక్ష కేంద్రంలో చూచిరాతలు ఎక్కువయ్యాయన్న ఫిర్యాదులతో గతంలో తొలగించిన పరీక్ష కేంద్రాన్ని ఈసారి తిరిగి అదే మండలంలో కేటాయించారు. ఇదేరీతిలో కడెం మండలంలోని ఓ కళాశాలను ఖానాపూర్‌ నుంచి తిరిగి అక్కడి కేజీబీవీకి కేటాయించారు.
  • నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌, సారంగాపూర్‌ మండలాల్లోని రెండు కళాశాలలకు ఆదిలాబాద్‌లోని బోథ్‌లో పరీక్ష కేంద్రం కేటాయించారు. ఇది దాదాపు 50 కి.మీ.పైగా దూరం. కుమురంభీం జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి. విద్యార్థులు అంతదూరం మండుటెండల్లో ఎలా ప్రయాణించాలో అధికారులకే తెలియాలి. యాజమాన్యాల ప్రయోజనం కోసమే ఇలా దూరభారాన్ని మోపారనే ఆరోపణలున్నాయి. చూచిరాతలతో విద్యార్థులకూ ప్రయోజనం కలుగుతుందన్న భావనతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు కూడా దీనిపై అంతగా అడ్డుచెప్పడం లేదనే విమర్శలు లేకపోలేదు.
  • పరీక్ష కేంద్రాల తుది జాబితా వెలువడిన తర్వాత కేంద్రాల మార్పు పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయిలో కొన్ని యాజమాన్యాలు ఎంత బలంగా వ్యవహరిస్తున్నాయో దీన్నిబట్టి అవగతమవుతోంది. తాజాగా.. సారంగాపూర్‌ మండలానికి చెందిన రెండు కళాశాలలకు తొలుత బోథ్‌లో కేటాయించగా, మరుసటి రోజు ఇందులో ఒక కళాశాలకు నిర్మల్‌లో కేంద్రం కేటాయించడం అధికారుల పనితీరుకు నిదర్శనం.

అడ్డుకట్టపడేదెలా..

దాదాపు ఏడాది క్రితం ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలోని ఓ పరీక్షకేంద్రంలో చూచిరాతలకు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను స్క్వాడ్‌ బృందం డిబార్‌చేసింది. దీంతో ఆగ్రహించిన బాధితులు, మరికొందరితో కలిసి వారిపై రాళ్లతో దాడికి యత్నించారు. వారి వాహనం దెబ్బతినగా, వారంతా జాగ్రత్తగా తప్పించుకున్నారు. చూచిరాతలను అడ్డుకున్న వారిపై విద్యార్థులు ఇలా ప్రతిస్పందించడం పరీక్షల నిర్వహణ తీరుకు అద్దంపడుతోంది.

  • కేవలం మాల్‌ప్రాక్టీస్‌పై ఆధారపడి మాత్రమే కొన్ని కళాశాలలు ప్రవేశాలను కొనసాగిస్తున్నాయనేది నిర్వివాదాంశం. అందుకే స్క్వాడ్‌ బృందాల సోదాలు, డిబార్‌లను విద్యార్థులు జీర్ణించుకోలేకనే ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతున్నారనేది కాదనలేనిది. పరీక్షకేంద్రాల కేటాయింపు విషయమై ఫిర్యాదులొస్తున్నా అధికారులు స్పందించడం లేదు. మార్చేందుకు అవకాశమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఏటా ఈ తతంగం పునరావృతమవుతోంది. ఉన్నతవిద్యను అభాసుపాలుచేస్తున్న ఈ చర్యలకు అడ్డుకట్ట పడేదెప్పుడు, బాధ్యులవుతున్న యూనివర్సిటీ అధికారులపై చర్యలెప్పుడనే ప్రశ్నలకు సమాధానం ఉన్నత విద్యాశాఖాధికారులకే తెలియాలి.

చట్టానికి కొత్త అర్థం..

ఏపీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ప్రాక్టీస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌మీన్స్‌ యాక్ట్‌ (1997).. ఉన్నత విద్యాసంస్థల్లో చూచిరాతలను నిరోధించే చట్టమిది. కానీ, ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే విశ్వవిద్యాలయ అధికారులే పరోక్షంగా మాల్‌ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తున్నారని అవగతమవుతోంది. జంబ్లింగ్‌ విధానం అమలుచేస్తున్నట్లు అనిపిస్తున్నా.. దొడ్డిదారిలో ఎవరికెలా ప్రయోజనం చేకూర్చాలో ఆ రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని యాజమాన్యాల ఇష్టాలకనుగుణంగా, చూచిరాతలు జరిగేలా కేంద్రాలు కేటాయిస్తూ, నామమాత్రపు తనిఖీలు చేపడుతూ పరీక్షలను అపహాస్యం చేస్తున్నారు. దీనివల్ల కష్టపడి చదివే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని