logo

పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్‌కు వెళ్లేది లేదు

విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు.

Published : 19 Apr 2024 02:07 IST

చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో విద్యార్థితో మాట్లాడుతున్న అధికారులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. జాజులపాలెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో కొర్ర సిద్ధు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం శరీరం పొంగిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉపాధ్యాయులు తాజంగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయగా వారు ఆసుపత్రికి వచ్చారు. స్థానిక సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో చికిత్స ప్రారంభించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. దీనికి తల్లిదండ్రులు నిరాకరించారు. ఉపాధ్యాయులు పలుమార్లు కౌన్సెలింగ్‌ చేసినా ఫలితం లేకపోయింది. గతంలో పసరమందుతో తగ్గిందని, ఇప్పుడూ ఇంటికి తీసుకెళ్లి అదే మందు పడతామన్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో వైద్యులు సహాయ గిరిజన సంక్షేమాధికారి జయనాగలక్ష్మి, స్థానిక ఎస్సై అరుణకిరణ్‌కు ఫోన్‌ చేశారు. వారు ఆసుపత్రికి వచ్చి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కేజీహెచ్‌కు వెళ్లకపోతే పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో విద్యార్థిని కేజీహెచ్‌కు తీసుకెళ్లేందుకు అంగీకరించారు. సాయంత్రం కేజీహెచ్‌కు అంబులెన్సులో తరలించారు. విద్యార్థులతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులను వెంట పంపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు