Virat Kohli: విరాట్ స్ట్రైక్‌రేట్‌ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్‌

స్టార్‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా స్ట్రైక్‌రేట్‌ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు.

Published : 02 May 2024 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే 500 పరుగులు రాబట్టాడు. బెంగళూరు భారీ స్కోరు సాధించడంలో అతడిదీ కీలక పాత్రే. మరోవైపు ప్లేఆఫ్స్‌ బెర్తుకు దాదాపు ఆర్సీబీ దూరమైంది. దీంతో విరాట్ తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం వల్లే ఇదంతా అని విమర్శకులు తమ నోళ్లకు పనిజెప్పారు. ఇలాంటివాటికి బెంగళూరు ఒకప్పటి సహచరుడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. 

‘‘ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ. రుతురాజ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోనంతవరకూ కోహ్లీ వద్దే ఉంది. అయినా, అతడి స్ట్రైక్‌రేట్‌పై తీవ్రంగా విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురి చేశాయి. టోర్నీ ఆరంభం నుంచీ ఇవే మాటలు విని విసిగిపోయా. ఈ విమర్శలపై ఘాటుగా స్పందించాలని అనుకుంటున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో కోహ్లీ ఒకరు. అతడి గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. కానీ, అతడి స్ట్రైక్‌రేట్‌ను విమర్శిస్తున్న చాలామంది క్రికెట్‌ పండితులు కనీసం కోహ్లీ ఆడిన మ్యాచుల్లో సగం కూడా ఆడి ఉండరు. ఆటపట్ల వారికి సరైన అవగాహన లేదనుకుంటా. అసలు ఎన్ని మ్యాచ్‌లు ఆడారు? ఐపీఎల్‌లో ఎన్ని సెంచరీలు చేశారు?’’ అని ఏబీడీ ప్రశ్నించాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన జట్టులో విరాట్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.

వారిద్దరికీ ఇదే చివరి ప్రపంచ కప్: కైఫ్‌

‘‘రోహిత్ శర్మ మరెంతో కాలం ఆడలేడు. మహా అయితే మూడేళ్లు మాత్రమే మైదానంలో ఉంటాడు. విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా ఇంతే. గతేడాది వన్డే ప్రపంచకప్‌ను నెగ్గే అవకాశం తృటిలో చేజారింది. పది మ్యాచ్‌లు వరుసగా గెలిచి.. చివరి పోరులో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్‌కు పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు. గ్రూప్‌ స్టేజ్‌ను సులువుగానే అధిగమిస్తుంది. సెమీస్‌, ఫైనల్‌ మాత్రమే కఠినం. ఐపీఎల్‌లో మాదిరిగా మరిన్ని అవకాశాలు అక్కడ రావు. కీలకమైన ఆ రెండు రోజుల కోసం సిద్ధంగా ఉండాలి. రోహిత్‌, విరాట్‌లకు అసలైన పరీక్ష అక్కడే ఎదురుకానుంది. పవర్‌ ప్లేలో రోహిత్ దూకుడైన ఆరంభం ఇస్తాడు. ఆ తర్వాత దానిని విరాట్ కొనసాగించాలి.   ఈ వరల్డ్‌ కప్‌ చివరిగా భావించి ఆడాలి. 2026 ఎడిషన్‌లో వీరిద్దరూ ఉండటం చాలా కష్టమే’’ అని కైఫ్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని