logo

కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య

కన్నాయిగూడెం మండల పరిషత్‌ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు.

Updated : 20 Apr 2024 04:23 IST

ఎటపాక, న్యూస్‌టుడే: కన్నాయిగూడెం మండల పరిషత్‌ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. వైకాపాకు చెందిన కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడు వర్సా బాలకృష్ణ (43)కు, ఇదే గ్రామానికి చెందిన దారపునేని రమేశ్‌కు కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. గ్రామంలో గురువారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్న బాలకృష్ణ రాత్రి ఇంటికి వెళ్తున్నాడు. ఇదే  సమయంలో కన్నాయిగూడెం గ్రామానికి చెందిన రమేశ్‌, భద్రాచలంకు చెందిన సాయి గ్రామ శివార్లలో మద్యం తాగుతున్నారు. అటుగా వచ్చిన బాలకృష్ణ వీరికి ఎదురుపడ్డారు.

ఈయన కూడా మద్యం మత్తులో ఉన్నాడు. పాతకక్షల నేపథ్యంలో వారి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో వీరి మధ్య తోపులాటతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సమయంలో మద్యం మత్తులో రమేశ్‌ పక్కనే ఉన్న బండరాయితో బాలకృష్ణ తలపై మోదటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. హత్యానంతరం నిందితులు రమేశ్‌, సాయి అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహానికి భద్రాచలం ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించారు. బాలకృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని, మద్యం మత్తులో విచక్షణ కోల్పోవడమే హత్యకు దారితీసిందని ఎటపాక సీఐ రామారావు, ఎస్‌ఐ పార్థసారథి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని