logo

ఆసరా ఆశలు ఆవిరేనా?

ఆసరా పేరుతో ఆశలు రేపి ఇప్పటివరకు నాలుగో విడత నిధులు జమ చేయకపోవడంపై మహిళలు మండిపడుతున్నారు.

Published : 28 Apr 2024 02:04 IST

ఖాతాలకు జమకాని నాలుగో విడత సాయం

చింతపల్లి వెలుగు కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు

చింతపల్లి గ్రామీణం, పాడేరు న్యూస్‌టుడే: ఆసరా పేరుతో ఆశలు రేపి ఇప్పటివరకు నాలుగో విడత నిధులు జమ చేయకపోవడంపై మహిళలు మండిపడుతున్నారు. ఫిబ్రవరి మూడున సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. రెండు మాసాలు గడుస్తున్నా నిధులు జమ కాక అతివలు ఆవేదన చెందుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 8644 స్వయం సహాయక సంఘాలకు రూ.34.6 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో 50 శాతం మందికి కూడా నగదు జమ కాలేదు. చింతపల్లి మండలంలో మొత్తం 298 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటిలో 18 సంఘాల మహిళలకు రూ.40 లక్షల రుణమాఫీ జరగాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా బటన్‌ నొక్కి ఆసరా డబ్బులు జమ చేయకపోవడం తగదంటూ మహిళలు వాపోతున్నారు. 18 పొదుపు సంఘాల సభ్యులు ఇటీవల చింతపల్లి వెలుగు కార్యాలయం వద్దకు వచ్చి సంబంధిత అధికారులను నిలదీశారు. ఇంతవరకు ఎందుకు రుణమాఫీ జరగలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో డబ్బులు పడతాయా లేదా అని అంతా ఎదురుచూస్తున్నారు. తరచూ బ్యాంకులకు వెళ్లి డబ్బులు పడ్డాయా లేదా అని చూసుకుంటున్నారు.


ఎదురుచూస్తున్నాం: ప్రభుత్వం వెంటనే ఆసరా నిధులు విడుదల చేయాలి. బటన్‌ నొక్కి రెండు నెలలైనా ఇప్పటివరకు సొమ్ములు పడలేదు. ఈ డబ్బులు పడితే కొంతైనా అప్పులు తీరుతాయని ఆశగా ఎదురుచూస్తున్నాం.

బేతా నూకరత్నం, చింతపల్లి

కొన్ని సంఘాలకే నిధులు: మా ఊర్లో కొన్ని సంఘాల ఖాతాలకు నాలుగో విడత డబ్బులొచ్చాయి. మరికొన్ని సంఘాలకు నయాపైసా రాలేదు. సీఎం బటన్‌ నొక్కి రెండు నెలలవుతుంది. అయినా నగదు జమ కాలేదు. అసలు ఆసరా డబ్బులు విడుదల చేస్తారో చేయరో తెలియడంలేదు. ఇదే విషయం వెలుగు కార్యాలయంలో అడిగితే వస్తాయని చెబుతున్నారు.

రామలక్ష్మి, చింతపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని