logo

చెప్పేది నా ఎస్టీ... చేసేది లూటీ

రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి.

Updated : 28 Apr 2024 04:18 IST

అండగా నిలిచిన ఆదివాసీలకు జగన్‌ అన్యాయం
గిరిజనుల హక్కులు, చట్టాలకు తూట్లు

మాట్లాడిన ప్రతి చోటా సీఎం జగన్‌ నా ఎస్సీ, ఎస్టీలు అంటూ వారిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తారు. ఆచరణకు వచ్చేసరికి గిరిజనులకు వైకాపా సర్కారు చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదు. వారి మూలాలను దెబ్బతీస్తూ మనుగడను ప్రమాదంలోకి నెట్టడానికి జగన్‌ ఎంత మాత్రం వెనుకాడలేదు. ప్రతి ఎన్నికల్లోనూ వైకాపాకు అండగా నిలిచిన ఆదివాసీలకే తీవ్ర అన్యాయం చేశారు. దీనిపై అడవి   బిడ్డలు చేసిన ఆందోళనలను అణిచేసి, ప్రశ్నించిన వారి గొంతులు నొక్కేశారు.


ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, గూడెంకొత్తవీధి, అనంతగిరి: రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 27.39 లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారు. (ఈ సంఖ్య మరో నాలుగు శాతం పెరిగిందని అంచనా). రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. వైకాపా ఆవిర్భావం తరవాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో గిరిజనులు ఆ పార్టీకి అండగా నిలిచారు. అలాంటి గిరిజనులకు రక్షణగా ఉన్న ఆదివాసీ చట్టాలు, హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పైగా హక్కులు, చట్టాల అమలులో మోకాలొడ్డుతూ పైశాచిక ఆనందం పొందుతోంది.

అనంతగిరిలో గిరిజన చట్టాలపై సంఘాల నేతల ఆందోళన (పాత చిత్రం)

వందశాతం ఉద్యోగాల జీఓపై నిర్లక్ష్యం

గిరిజన ప్రాంతంలో ఆదివాసీలకే వందశాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000లో తెదేపా ప్రభుత్వం జీఓ నం. 3 జారీచేసింది. దీంతో లక్షల మంది గిరిజన యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందారు. 2021 ఏప్రిల్‌ 22న ఈ జీఓను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై జగన్‌ ప్రభుత్వం స్పందించలేదు. రివ్యూ పిటిషన్‌ వేయాలని గిరిజన యువత వేడుకున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది 1998 డీఎస్సీ ఉపాధ్యాయల పోస్టుల నియామకాల్లో గిరిజన ప్రాంతాల్లో మైదాన ప్రాంత ఉపాధ్యాయులను నియమించారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పొరుగు సేవల విధానంలో అధ్యాపకుల భర్తీలో గిరిజనులకు ఒక్క పోస్టూ కేటాయించలేదు. గిరిజన గ్రామాల్లో ఉన్నత చదువులు చదివిన వారంతా ఉద్యోగాలు రాక వ్యవసాయ, ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పీసా పక్కనపెట్టి.. మైనింగ్‌ పట్టుపట్టి

పీసా చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గ్రామసభ ఆమోదం లేకుండా గనులు, ఖనిజాలు తవ్వేందుకు, గిరిజనేతరులు నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదు. దీంతో బాక్సైట్‌ తవ్వకాలకూ బ్రేక్‌ పడింది. అయితే వైకాపా ప్రభుత్వం మన్యంలో గనుల, ఖనిజాల తవ్వకాల కోసం పీసా చట్టాన్ని పక్కనపెట్టింది. దీంతో మన్యంలో లేట్‌రైట్‌, కాల్సైట్‌, తెల్లరాయి వంటి తవ్వకాలు జోరందుకున్నాయి. చింతపల్లి మండలం మడిగుంటలో గ్రానైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళనలు చేయడంతో ప్రస్తుతానికి తవ్వకాలు నిలిచిపోయాయి. అనంతగిరి మండలం నిమ్మలపాడు, సరియా ప్రాంతాల్లో కాల్సైట్‌, భీంపోలులో తెల్లరాయి క్వారీల్లో తవ్వకాలకు వైకాపా వర్గీయులకే అవకాశం కల్పించారు. నిమ్మలపాడు, భీంపోలులో తవ్వకాలు జరగ్గా గిరిజనులు అడ్డుకున్నారు. గూడెంకొత్తవీధి మండలం రింతాడలో నల్లరాయి క్వారీ తవ్వకాలకు వైకాపా అండతో వ్యాపారులు రంగంలోకి దిగారు.

రింతాడలో గనుల తవ్వకాలను అడ్డుకోవాలని గిరిజనుల వినతి (పాతచిత్రం)

అటవీ హక్కులకూ విఘాతం

రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన చట్టాల్లో 1/70, 1/59 చట్టాలు ప్రధానమైనవి. వీటి ప్రకారం గిరిజనేతరులు మన్యంలో భూములు కొనడానికి వీల్లేదు. వైకాపా ప్రభుత్వం ఈ చట్టాలను పక్కాగా అమలు చేయడం లేదు. పైగా గిరిజనేతరులకు ఒకటిన్నర సెంట్ల భూమి ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆదివాసీ ఎమ్మెల్యేలతో లేఖలు రాయించి ఈ హక్కులకు తూట్లు పొడిచింది. బాక్సైట్‌ నిల్వలున్న జర్రెల, మొండిగెడ్డ, అరకు, అనంతగిరి, గాలికొండ ప్రాంతాల గిరిజనులకు అటవీ పట్టాలు సక్రమంగా ఇవ్వకుండా సాకులతో కాలం వెళ్లదీస్తోంది.
గిరిజన సంక్షేమ నిధుల దారిమళ్లింపు: గిరిజనులఅభ్యున్నతికి  కేటాయించిన రూ. వేల కోట్ల గిరిజన ఉప ప్రణాళిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. పేరుకే ట్రైకార్‌ ఛైర్మన్‌ను నియమించింది. ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి భరించలేక సాక్షాత్తు ట్రైకార్‌ ఛైర్మన్‌ వైకాపాను వదిలి కాంగ్రెస్‌ గూటికి చేరారు.
వేరివారి చేర్పుతో అన్యాయం: బోయవాల్మీకి, బెంతు ఒరియాలను గిరిజన జాబితాలో కలిపేందుకు జగన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది గిరిజనులున్నారు. ఈ జాబితాలో 40 లక్షలకు పైగా ఉన్న బోయ వాల్మీకులు, బెంతు ఒరియాలను గిరిజన జాబితాలో కలిపేందుకు వైకాపా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. దీనిపై ఏకంగా అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. బోయ వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీల్లో కలిపితే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో పూర్తిగా వెనుకబడిపోవడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని