logo

అరకు వైకాపాకు తిరుగు‘పోటు’

ఆంధ్రాఊటీ అరకులోయలో రాజకీయం వేడెక్కుతోంది. అరకులోయ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైకాపాలోని తిరుగుబాటు అభ్యర్థులే అధికంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

Published : 01 May 2024 02:03 IST

పోటీలో ఐదుగురు రెబల్స్‌
అరకులోయ, న్యూస్‌టుడే

ఆంధ్రాఊటీ అరకులోయలో రాజకీయం వేడెక్కుతోంది. అరకులోయ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైకాపాలోని తిరుగుబాటు అభ్యర్థులే అధికంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. వైకాపా తిరుగుబాటు అభ్యర్థులంతా పోటీలో ఉండేందుకే మొగ్గు చూపడంతో అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. 9 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో అయిదుగురు వైకాపా రెబల్సే కావడం గమనార్హం. వైకాపా నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన వారంతా బరిలో ఉన్నారు. సమర్డి రఘునాథ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు వరకు వైకాపాలోనే ఉన్నారు. టికెట్‌ రాకపోవడంతో తన సత్తా చూపించాలని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అరకులోయ మండలానికి చెందిన ఈయన గతంలో సర్పంచిగా పనిచేశారు. పెదబయలు మండలానికి చెందిన వంతల రామన్న నోటిఫికేషన్‌ ముందు వరకు వైకాపాలో పనిచేశారు. పార్టీ టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఈయన సర్పంచిగా పనిచేశారు. అరకులోయకు చెందిన సమర్డి భవాని మొన్నటి వరకు వైకాపాలో ఉన్నారు. ఆమె సైతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈమె పెదలబుడు ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. డుంబ్రిగుడ మండలానికి చెందిన కమ్మిడి నిర్మల వైకాపాలో ఉంటూ గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈమె సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అనంతగిరి మండలానికి చెందిన నరాజి మధుబాబు వైకాపాలోనే ఉన్నారు. ఈయన స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. జై భారత్‌ ఆదివాసీ పార్టీ తరపున పోటీ చేస్తున్న అరకులోయ మండలం చినలబుడు సర్పంచి ఉపేంద్ర మొన్నటి వరకు వైకాపాలోనే ఉన్నారు. అధిక సంఖ్యలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉండటంతో వీరంతా ఏ మేర తమ ఓట్లను కొల్లగొడతారోనని అధికార పార్టీ అభ్యర్థికి ఆందోళన మొదలైంది. సామాజికవర్గాల పరంగా ఓటుబ్యాంకును స్వతంత్య్ర అభ్యర్థులు చీల్చే అవకాశాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని