logo

నిషేధమన్నావు.. నిషాలో ముంచావు!

మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. మూడు దశల్లో మద్యం నిషేధిస్తాం. 2024 ఎన్నికల్లో ఓటడిగే సమయానికి మద్యం దుకాణాలే లేకుండా చేస్తాం.

Published : 08 May 2024 01:57 IST

పాన్‌షాపు నుంచి ఫలహారశాలల వరకు మద్యం అమ్మకాలే
అయిదేళ్లలో సర్కారు ఆదాయం రెట్టింపు
నాసిరకం బ్రాండ్లతో మందుబాబుల ఒళ్లు, ఇళ్లు గుల్లే..
ఈనాడు పాడేరు, న్యూస్‌టుడే, అనకాపల్లి, పాడేరు, చింతపల్లి

మద్య నిషేధం అమలుపై మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. మూడు దశల్లో మద్యం నిషేధిస్తాం. 2024 ఎన్నికల్లో ఓటడిగే సమయానికి మద్యం దుకాణాలే లేకుండా చేస్తాం. స్టార్‌ హోటళ్లకే మద్యం అమ్మకాలు పరిమితం చేస్తాం..’

పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి.

మాటతప్పను.. మడమ తిప్పను అన్న జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని పక్కనపెట్టేశారు. అనకాపల్లి జిల్లాలో 151 మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా ఏటా అమ్మకాలు పెంచుకుంటూ పోయారు. ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం రాగా వాటిని తాగినవారు మాత్రం ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఊరూ, పేరూ లేని నాసిరకం బ్రాండ్లు అమ్మి మందుబాబుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సర్కారీ మద్యం తాగి ఆసపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం.

మత్తులో ముంచుతున్నారు...

ఉమ్మడి జిల్లాలో ఓ వైపు నాటుసారా ఏరులై పారుతోంది.. మరోవైపు గంజాయి గుప్పుమంటోంది.. ఇంకోవైపు ఎక్కడపడితే అక్కడ గొలుసు దుకాణాల్లో ‘జె’ బ్రాండ్‌ మందు దొరుకుతోంది. అధికార పార్టీ నేతల అండతో వీధికి మూడు నాలుగు గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందిలో కొందరు సహకరిస్తున్నారు. ఒకరికి మూడు సీసాల కంటే ఎక్కువ ఇవ్వకూడదన్న నిబంధన పక్కన పట్టేశారు.

ఎన్నికల సమయంలో నేతల ఒత్తిళ్లతో కేసుల కొద్దీ మద్యం అందిస్తున్నారు. తమ రాజకీయ అవసరాల కోసం వ్యసనపరులు, యువతను మద్యం మత్తులో ముంచెత్తుతున్నారు.


ఆసుపత్రులపాలు...

ప్రభుత్వ మద్యం దుకాణంలో బ్రాండ్‌ పేరుచెప్పి మందు కొనే పరిస్థితి లేదు. రూ. 130, 150, 200, 300 సీసాలు ఇవ్వండి అడగడమే కనిపిస్తుంది. అన్నీ జగనన్న బ్రాండ్లే. వీటిని తాగడం వల్ల చాలామంది ఆరోగ్యం దెబ్బతింటోంది. గతంలో తాగిన మందుకు ఇప్పుడు తాగుతున్న మందుకు చాలా వ్యత్యాసం ఉందని మందుబాబులు అంటున్నారు. మందు తాగిన వెంటనే నిషా నషాళానికి ఎక్కేస్తుంది. గుండెలు మండిపోతున్నాయి. తలనొప్పి, కాళ్లు చేతులు పీకుళ్లు వచ్చేస్తున్నాయి. చేతులు వణికిపోతున్నాయని ఆసుపత్రులకు వచ్చి తమ బాధలు చెప్పుకొంటున్నవారు వందల సంఖ్యలో ఉన్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాలోని వ్యసన విముక్తి కేంద్రాలకు వచ్చే బాధితుల్లో 90 శాతం జగనన్న మందు బాధితులే ఉంటున్నారు.


అయిదేళ్లు.. రూ. 4,716 కోట్ల మద్యం అమ్మకాలు

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మద్యం అమ్మకాల ఆదాయం రూ.765 కోట్లు ఉంటే.. 2023-24కు వచ్చేసరికి రూ. 1,135 కోట్లకు ఆ ఆదాయం పెరిగిపోయింది. మరి జగన్‌ దృష్టిలో మద్యనిషేధం అంటే అమ్మకాలు పెంచి ఆదాయం రెట్టింపు చేసుకోవడమేమో..? ఈ అయిదేళ్లలో ఒక్క అనకాపల్లి  జిల్లాలోనే రూ. 4,716 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయంటే ఎంత మంది శ్రమజీవుల నుంచి పిండుకున్నారో అర్థమవుతోంది. ప్రభుత్వ మద్యం దుకాణాలతోనే అయితే ఇంత ఆదాయం వచ్చేది కాదు.. ప్రతి ఊరిలోనూ అధికారిక, అనధికార గొలుసు దుకాణాలు పెట్టి 365 రోజులు 24 గంటలూ మందు అందుబాటులోనే ఉంచారు. మరోవైపు పట్టణాల్లో బార్లు ఉదయాన్నే అర్థరాత్రి వరకు అమ్మకాలు సాగిస్తూ వచ్చారు. దీంతోనే సర్కారు ఆదాయం రెట్టింపు అవ్వడమే కాదు.. గొలుసు దుకాణాలతో అధికార పార్టీ నేతల జేబులు దండిగా నిండిపోయాయి.


ఆరోగ్యం హరించేసింది: నేను గతంలో కువైట్‌లో ఉద్యోగం చేసేవాడిని  అక్కడి నుంచి అనకాపల్లి వచ్చాను. మూడేళ్లుగా ఇక్కడ మద్యం తాగుతున్నాను గతంలో 95 కేజీలు ఉండేవాడిని. ఇప్పుడు 42 కేజీలకు వచ్చాను. నాసిరకం మద్యం తాగడం వల్ల లివర్‌ బాగా దెబ్బతింది. ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్‌ మద్యం మానకపోతే చనిపోతావని చెప్పారు. భయపడి మద్యం తాగడం మానేశాను. ప్రభుత్వం అమ్ముతున్న నాసిరకం మద్యం నాలాగే చాలామంది ఆరోగ్యాలను హరించేసి ఆసుపత్రుల పాలు చేస్తోంది.

బండి హరిప్రసాద్‌, అనకాపల్లి


 పక్షవాతానికి గురయ్యాను: మద్యం తాగే అలవాటు ఉంది. ఈ ఐదేళ్లలో నాసిరకం మద్యం తాగడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవల రక్తపోటు పెరిగిపోయి పక్షవాతంలోకి దింపింది. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొంది ప్రమాదం నుంచి బయటపడ్డాను. నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలకు ప్రమాదం అని తెలిసీ అదే విక్రయిస్తుండటం శోచనీయం. ఇప్పుడు అమ్ముతున్న మద్యం అసలు బాగుండటం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేదికాదు.

ఎస్‌.సూర్యనారాయణ, అనకాపల్లి


చింతపల్లికి చెందిన చిట్టిబాబు 35 ఏళ్ల యువకుడు (పేరు మార్చాం). స్నేహితులతో కలసి సరదాగా మద్యం తాగడం మొదలుపెట్టాడు. ఇది కాస్తా అలవాటుగా మారింది. రోజూ మద్యం తాగడం మొదలెట్టాడు. అతనికి ఇద్దరు పిల్లలు. పాఠశాలకు వెళ్లేవారు. జె బ్రాండ్ల మద్యం కారణంగా ఆరోగ్యం స్వల్పకాలంలోనే క్షీణించింది. ఆసుపత్రికి వెళితే అవయవాలన్నీ పాడయ్యాయని వైద్యులు చెప్పారు. ఆఖరికి చికిత్స పొందుతూ అతను మరణించడంతో ఆ కుటుంబం వీధినపడింది. దగ్గర బంధువులు పిల్లలను చేరదీసి చదివించాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని