logo

వైకాపా మార్క్‌ ’పీనల్‌ కోడ్‌’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?

వైకాపా సర్కారు కొలువుదీరింది మొదలు విపక్ష నేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఎత్తిచూపినా.. అధికార పార్టీ నేతల అక్రమాలపై గొంతెత్తినా.. సర్కారు అవినీతిపై ప్రశ్నించినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేశారు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, విపక్ష నేతల వరకు అంతా ఈ అయిదేళ్లలో జగన్‌ నిరంకుశత్వ బాధితులే.

Updated : 09 May 2024 07:30 IST

సామాన్యుల నుంచి నేతల వరకు అందరూ బాధితులే

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, నర్సీపట్నం, జి.మాడుగుల, మారేడుమిల్లి: వైకాపా సర్కారు కొలువుదీరింది మొదలు విపక్ష నేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఎత్తిచూపినా.. అధికార పార్టీ నేతల అక్రమాలపై గొంతెత్తినా.. సర్కారు అవినీతిపై ప్రశ్నించినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేశారు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, విపక్ష నేతల వరకు అంతా ఈ అయిదేళ్లలో జగన్‌ నిరంకుశత్వ బాధితులే. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నవారు కూడా బహిరంగంగా మాట్లాడటానికి అమ్మో అంటున్నారంటే ఎంతగా భయపెట్టారో అర్థమవుతుంది. పోలీసులు సైతం పాలకపక్షానికి ప్రైవేటు సైన్యంగా మారి ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపడంతో అయిదేళ్ల జగన్‌ పాలన హిట్లర్‌నే మరిపించేలా సాగింది.

తొలి బాధితుడు పీలా...

వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కిన తొలి రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణపైనే తొలిదాడి చేశారు. విశాఖ నగరంలోని ద్వారకానగర్‌లో అనుమతులన్నీ తీసుకుని నిర్మిస్తున్న నాలుగంతస్తుల భవనాన్ని అక్రమ నిర్మాణం అంటూ 2020లో కూలదోసేశారు. ఆయన మాదిరిగానే నిర్మించుకున్న ఇతర భవనాల జోలికి పోకుండా కేవలం పీలా ఆస్తులపైనే గురిపెట్టి వేధించారు. విశాఖ రూరల్‌, అనందపురం మండలాల్లో పీలా భూములను లిటిగేషన్‌లో చేర్చి ఎలాంటి లావాదేవీలు జరగకుండా అడ్డుకుని వైకాపా నేతలు ఆనందం పొందారు.


ప్రశ్నించినందుకు కేసులు

మారేడుమిల్లి మండలంలో ఎమ్మెల్సీ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మిని సమస్యలపై నిలదీసిన తెదేపా నాయకులపై కేసులు నమోదు చేశారు. 2023 ఆగస్టు 18న బోదులూరు నుంచి పొట్లవాడకు రోడ్డు శంకుస్థాపనకు వెళ్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కుట్రవాడ వద్ద తెదేపా నాయకులు అడ్డుకున్నారు. జీఓ నం. 3పై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. పోలీసులు వీరిని పక్కకు నెట్టి వీరిపై కేసులు నమోదు చేశారు. 2023 ఏప్రిల్‌ 10న  జీఓ నం 3పై ఆదివాసీ సంఘాల నేతలు ఎమ్మెల్యే ధనలక్ష్మిని ప్రశ్నించారు. పోలీసులు వీరిని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.


అయ్యన్నను అణిచేయాలనుకున్నారు

ప్రభుత్వ విధానాలు, అవినీతిని తనదైన శైలిలో ఎండగట్టే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై అధికార పార్టీ నేతలంతా గురిపెట్టారు. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 17 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే అరెస్టులు చేసేవారు. ఆయన ఇంటి స్థలంలో 0.2 సెంట్ల స్థలం జలవనరుల శాఖకు చెందినది ఉందని ఎవరో అనామకులు ఫిర్యాదు చేస్తే ముందూ, వెనుకా ఆలోచించకుండా గతేడాది జూన్‌లో బుల్డోజర్లతో ఇంటిని కూలగొట్టేయడానికి వచ్చారు. కొంతమేర కూలదోసేశారు. ఎక్కడో జగన్‌పై వ్యాఖ్యలు చేశారంటూ నవంబర్‌ 3న అర్ధరాత్రి వందల సంఖ్యలో పోలీసులతో ఇంటిపై దాడిచేశారు. గేట్లు విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. ఆయన దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పినా వినిపించుకోకుండా వాహనం ఎక్కించుకుని తీసుకుపోయారు.


అయ్యన్నపై దాడులతోనే అధికార పార్టీ నేతలు సరిపెట్టలేదు. ఆయన కుటుంబ సభ్యులనూ వేధించారు. ఆయన కుమారుడు, ఐ-టీడీపీ రాష్ట్ర కన్వీనర్‌ విజయ్‌పైనా సీఐడీ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఆయన లేనప్పుడు వెళ్లి హల్‌చల్‌ చేసి భయాందోళనకు గురిచేశారు. మరో కుమారుడు రాజేశ్‌పైనా కేసులు నమోదు చేశారు.


సూపర్‌ సిక్స్‌పై మాట్లాడానని దాడి

- బోళెం నాగేశ్వరరావు, ఆర్లి

నేను తెదేపా అభిమానిని. ఈ పార్టీ సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ఏప్రిల్‌ 30న కె.సంతపాలెంలో మాట్లాడుకుంటుంటే మా పక్కనే ఉన్న వైకాపా కార్యకర్త బీరు సీసాతో దాడిచేసి గాయపరిచాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాను. వ్యక్తిగత అభిప్రాయం పంచుకోవడం తప్పా? ఇలాంటి అరాచకం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు.


మునగపాక: ఉమ్మలాడలో వైకాపా నాయకుల భూదందాలు, ఇసుక అక్రమ తవ్వకాలపై దళిత నాయకుడు కంకణాల శ్రీను నిలదీస్తున్నారు. తమ అక్రమ వ్యాపారాలకు అడ్డు తగులుతుండటంతోపాటు జనసేన పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని మారణాయుధాలతో వైకాపా గూండాలు శ్రీనుపై దాడి చేశారు. తలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దళితుడిని గాయపరిచిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా, రివర్స్‌ కేసు పెట్టారు.


నిరసన హక్కు హరించి..

నకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ ఇటీవల జిల్లాకు వచ్చారు. దూకుడుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిలదీస్తుండడంతో ఆయనపై నెల రోజుల్లో రెండు కేసులు పెట్టారు. గతనెలలో చోడవరంలో కూటమి కార్యకర్తకు చెందిన టైల్స్‌ దుకాణంపై జీఎస్టీ అధికారులు దాడులు చేస్తే ఆయన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు అధికారుల తీరును తప్పు పట్టినందుకు కేసు నమోదు చేశారు. తాజాగా దేవరాపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంతూరు తారువలో భాజపా కార్యకర్తపై దాడి జరిగింది. ఆయన్ని పరామర్శించడానికి సీఎం రమేశ్‌ వెళితే ఊళ్లోకి వెళ్లకుండా అడ్డుకుని తిరిగి ఈయనపైనే కేసులు నమోదు చేశారు.


అడిగితే ఆగ్రహం

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గడపగడపకు కార్యక్రమంలో భాగంగా బొయితిలి పంచాయతీ పులుసుమామిడిలో పర్యటించినప్పుడు తోకగరువు వార్డు సభ్యుడు ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో కోపంతో ఊగిపోయారు. నీది ఏ పార్టీ, ఏ ఊరు?, నాకే ఓటు వేశావని గ్యారంటీ ఏంటీ? అంటూ విరుచుకుపడ్డారు. తాను వైకాపా వాడినేనని వార్డు సభ్యుడు చెప్పిన వినకుండా...ఎక్స్‌ట్రాలు మాట్లాడవద్దంటూ నీ సంగతి తెలుసంటూ సొంత పార్టీ వార్డు సభ్యుడిపైనే మండిపడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.


బుద్ధను భయపెట్టాలనుకున్నారు..

శాసనమండలిలో బిల్లులపై చర్చ సందర్భంగా నారా లోకేశ్‌పై అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగినప్పుడు బుద్ధ నాగజగదీశ్వరరావు ప్రతిఘటించి కొడాలి నాని, ఇతర నేతలకు సవాల్‌ విసిరారు. అంతే.. 2021లో అనకాపల్లిలో బుద్ధ ఇంటిపై అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మార్కెట్‌ యార్డులో ఆయన శీతల గిడ్డంగిని తప్పుడు ఆరోపణతో మూయించేశారు. కోర్టుకు వెళ్లి శీతల గిడ్డంగిని మరలా తెరిపించుకోవాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని