logo

తెలుగు పుస్తకానికి ప్రపంచ రికార్డు

కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన పూలబాల వెంకటప్రసాద్‌ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. బహుభాషా కోవిదుడైన పూలబాల తెలుగులో 1265 పేజీల భరతవర్ష నవలను ఎనిమిది నెలల్లో రాసి వరల్డ్‌వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు.

Published : 01 Jul 2022 04:58 IST

1265 పేజీల భరతవర్షను 8 నెలల్లో రాసిన ప్రసాద్‌

వరల్డ్‌వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

వరల్డ్‌వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌తో పూలబాల

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన పూలబాల వెంకటప్రసాద్‌ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. బహుభాషా కోవిదుడైన పూలబాల తెలుగులో 1265 పేజీల భరతవర్ష నవలను ఎనిమిది నెలల్లో రాసి వరల్డ్‌వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు. వెంకటప్రసాద్‌ తెలుగుతో పాటు ఫ్రెంచ్‌, జర్మనీ, స్పానిష్‌, ఇటాలియన్‌, ఇంగ్లిష్‌ ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడడమే కాకుండా రచనలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మొదటి ఫ్రెంచ్‌ నవలా రచయితగానూ గుర్తింపు ఉంది. తాజాగా చాలా తక్కువ సమయంలో అతి పొడవైన భరతవర్ష నవల రాసిన రచయితగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భరతవర్ష నవలలో 200 వృత్త పద్యాలు, 2.5లక్షల పదాలున్నాయి. వెయ్యి పేజీల నవల రాయడానికి ఎంతోమంది రచయితలు పదేళ్లకు పైగా సమయం తీసుకోగా.. పూలబాల మాత్రం కేవలం ఎనిమిది నెలల్లో 1265 పేజీల భరతవర్షను రాయడం వల్లే ప్రపంచ రికార్డును నెలకొల్పగలిగారు. దీనికోసం ఆయన నెలల తరబడి ఎంతో శ్రమించారు. రాత్రివేళ కేవలం రెండు మూడు గంటలు మాత్రమే పడుకుని మిగతా సమయమంతా నవలను రాస్తూనే ఉన్నారు. తెలుగులో కష్టమైన 200 వృత్త పద్యాలతో కూడిన అతిపెద్ద గ్రాంధిక నవల రాయడం మామూలు విషయం కాదు. ట్రాన్స్‌ లిటరేషన్‌ టూల్‌ను ఉపయోగించి గూగుల్‌లో టైప్‌ చేస్టూ, మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో రెండు లక్షల యాభైవేల పదాలను వందలసార్లు సవరించి అమర్చి ప్రపంచంలోనే అతిపొడవైన నవలను తానే సొంతంగా ముద్రించుకోవడం మరో గొప్ప విషయం.

భాషకు దక్కిన గౌరవంగా భావిస్తా: వెంకట ప్రసాద్‌

ఈ ప్రపంచ రికార్డు తెలుగు భాషకు దక్కిన గౌరవంగా నేను భావిస్తాను. ప్రపంచ రికార్డు పుస్తకంలో తెలుగుకు స్థానం దక్కడం నాకు ఎక్కువ ఆనందం కలిగించింది. ఈ నవలను అతి తక్కువ సమయంలో రాసే క్రమంలో నిద్రలేమి, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్ల వాపులు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. కానీ.. అవన్నీ నా లక్ష్యం ముందు అతిచిన్న సవాళ్లుగానే భావించాను. ఒక్క ఇంగ్లిష్‌ పదం కూడా లేకుండా రెండు లక్షల తెలుగు పదాలను రాశాను.

భరతవర్ష నవల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని