logo

సామాజిక స్థలాలకు ఎసరు!

రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా బహుళ ప్రయోజన కేంద్రాలను(ఎంఎఫ్‌సీ) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఒక గోదాము, ఎరువులు, పురుగు మందుల కోసం ఒక దుకాణం, ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణీ చేసే సరకుల నిల్వ కోసం

Published : 17 Aug 2022 04:56 IST
పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం
లేఔట్లలో స్థల కేటాయింపులు
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

తిప్పనగుంట జగనన్న కాలనీలో ఎంఎఫ్‌సీకు కేటాయించిన స్థలం

గన్నవరం మండలం మర్లపాలెంలో ఓ ప్రైవేటు లేఔట్‌కు వెళ్లిన రెవెన్యూ అధికారులు 50 సెంట్ల స్థలంలో మార్కింగ్‌ పెట్టారు. ఇక్కడ ప్రభుత్వం గోదాము నిర్మిస్తుందని స్థలం ఇచ్చి తీరాలని నిర్వాహకులకు స్పష్టం చేసినట్లు సమాచారం.


ఉయ్యూరు మండలంలో ఓ ప్రముఖ స్థిరాస్తి సంస్థ యజమానులకు రెవెన్యూ అధికారులు ఫోన్‌ చేసి మీ లేఔట్‌లోని కామన్‌ స్థలం ప్రభుత్వ అవసరాలకు కావాల్సి ఉన్నందున సేకరించాల్సి ఉంటుందని సూచించారు.


బాపులపాడు మండలం తిప్పనగుంటలో జగనన్న కాలనీ కోసం సేకరించి, ఇంకా లబ్ధిదార్లకు ఫ్లాట్లు విడగొట్టని స్థలంలో 50 సెంట్లును రెవెన్యూ అధికారులు గోదాము కోసం కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా బహుళ ప్రయోజన కేంద్రాలను(ఎంఎఫ్‌సీ) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఒక గోదాము, ఎరువులు, పురుగు మందుల కోసం ఒక దుకాణం, ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణీ చేసే సరకుల నిల్వ కోసం ఒక దుకాణం, పంటల్ని ఆరబెట్టేందుకు డ్రయింగ్‌ యార్డు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. రూ.35 నుంచి రూ.50 లక్షల అంచనా వ్యయంతో దశల వారీగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 814 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో వీటిని నిర్మించడానికి కార్యాచరణ చేపట్టారు.  

తలనొప్పిగా స్థల సేకరణ: ప్రతి ఆర్బీకేకు ఒక ఎంఎఫ్‌సీ నిర్మించనుండటం ఇందుకు అరెకరం వరకు స్థలం అవసరమవడంతో భూ సేకరణ ఇబ్బందిగా మారింది. నిర్మాణ బాధ్యతలన్నీ మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షణలో సహకార సంఘాలకు అప్పగించారు. స్థల సేకరణ మాత్రం రెవెన్యూకు అప్పగించారు. జగనన్న లేఔట్ల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్థలాలన్నీ దాదాపుగా వాటికే కేటాయించారు. దీంతో చాలా మండలాల్లో ఎంఎఫ్‌సీలకు భూమి దొరకడం ఒకింత కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ స్థల సేకరణపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రైవేటు, ప్రభుత్వ లేఔట్లలో సామాజిక అవసరాల కోసం పంచాయతీలకు అప్పగించిన కామన్‌ స్థలాలపై దృష్టి సారించారు.

తీవ్ర విమర్శలు: లేఔట్లు వేసినపుడు విస్తీర్ణంలో పది శాతం భూమిని సామాజిక అవసరాలకు వదిలేయాల్సి ఉంటుంది. దీనిని సంబంధిత గ్రామ పంచాయతీకు బదలాయించి, అక్కడ ఉద్యానవనం(పార్కు), సామాజిక భవనాలు, నివాసితులకు ఇతరత్రా ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాంటి చోట గోదాములు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  జగనన్న లేఔట్లలో లబ్ధిదార్లకు ఉపయోగపడేలా కొత్తగా అంగన్‌వాడీ, ఆరోగ్య ఉపకేంద్రాల వంటివి నిర్మించాల్సి ఉండగా, గోదాములకు స్థలం కేటాయించడం ఇబ్బందికరంగా మారనుంది.

ఎక్కడికక్కడ లేఔట్లలో స్థల సేకరణకు ప్రయత్నిస్తున్నా రెవెన్యూ అధికారులు, పైకి మాత్రం అది చివరి ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు. వీలైనంతగా ప్రభుత్వ స్థలాలు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నామని, అవకాశం లేని చోట మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు లేఔట్లలో కామన్‌ స్థలాలను ఎంపిక చేస్తున్నామని ఓ రెవెన్యూ అధికారి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts