logo

పెదపారుపూడిలో నకిలీ నోట్ల మార్పిడి గుట్టు రట్టు

నకిలీ నోట్ల మార్పిడి గుట్టును పెదపారుపూడి పోలీసులు రట్టుచేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. వారిని కోర్టుకు అప్పగించగా... రిమాండు విధించింది.

Updated : 08 Dec 2022 05:23 IST

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం

పామర్రుగ్రామీణం, న్యూస్‌టుడే : నకిలీ నోట్ల మార్పిడి గుట్టును పెదపారుపూడి పోలీసులు రట్టుచేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. వారిని కోర్టుకు అప్పగించగా... రిమాండు విధించింది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. బాపట్లకు చెందిన జ్యోతుల మధుబాబు కొన్నాళ్లుగా గుడివాడలో నివాసం ఉంటున్నారు. ఇతడితోపాటు గుడివాడ పరిధి, బేతవోలుకి చెందిన కర్రె లాజర్‌ మద్యానికి బానిసలయ్యారు. ఇద్దరూ సులువుగా డబ్బులు సంపాదించే దిశలో పయనిస్తున్నారు. వీరికి నకిలీనోట్లు మార్పిడి చేసే బాపట్ల జిల్లా జె.పంగలూరుకి చెందిన పాలేటి శ్రీనివాసరావు, పాలేటి కృష్ణబాబులు స్నేహితులు. ఒక రోజు ఫోన్‌చేసి, నకిలీనోట్లు తీసుకురావాలని కోరారు. ఈమేరకు వారు ఈ నెల 5న దొంగ నోట్లు తీసుకుని పెదపారుపూడి మండలానికి వచ్చారు. వీరు నలుగురు కలిసి నోట్లు మార్పిడి చేసుకుంటుంన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.29,500 విలువైన దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. పామర్రు సీఐ వెంకటనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండు విధించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. పోలీసుల దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పట్టుపడిన నలుగురిలో.. ఒక వ్యక్తి గతంలో నకిలీనోట్లు ముద్రిస్తూ ఉండేవాడని, ఈ వ్యవహారాల్లో ఒంగోలులో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ దొంగనోట్ల మార్పిడి వ్యవహారాన్ని పెదపారుపూడి పోలీస్‌ స్టేషన్‌కి సమీపంలో ఉండే ఓ మహిళపై.. ఆమె సమీప బంధువు, మరో ముద్దాయి రుద్దే ప్రయత్నం జరిగినట్లు తెలిసింది. పోలీసులు ఈ విషయాలను పూర్తి స్థాయిలో వెల్లడించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని