logo

వలస కూలీ దంపతులపై యువకుల దాడి

ఓ దళిత మహిళపై దాడి చేశారని తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే, పట్టించుకోకుండా దాడి చేసిన వారి పక్షాన నిలబడి కేసు నమోదు చేయని సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 29 Jan 2023 05:19 IST

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : ఓ దళిత మహిళపై దాడి చేశారని తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే, పట్టించుకోకుండా దాడి చేసిన వారి పక్షాన నిలబడి కేసు నమోదు చేయని సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాయాన్ని వలస కార్మికులైన బాధితులు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు శీలం ప్రకాష్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని ఆయన బాధితులతోపాటు శనివారం విలేకరులకు తెలియజేశారు. చెరకు నరికేందుకు పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన భూమన రాజు, అంజిలి తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామానికి వచ్చారు. రాజు హామితో వారితో పాటు వచ్చిన పిచ్చయ్యకు రూ.13 వేలు అడ్వాన్స్‌ ఇచ్చారు. అతడు సమాచారం లేకుండా ఊరు వదిలి వెళ్లి పోయాడు. దీంతో భరత్‌, ఈశ్వరరావులు రాజుని నిలదీయడంతో తనే డబ్బులు కడతాను, లేకుంటే మీ పొలంలో చెరకు నరుకుతామని తెలిపారు. భరత్‌, ఈశ్వరరావు ఈ నెల 26న మధ్యాహ్నం మద్యం మత్తులో రాజును కొట్టారు. అతడు దెబ్బలతో ఇంటికి రాగా ఏంజరిగిందని భార్య అంజిలి అడిగింది. అదే సమయంలో నిందితులిద్దరు మళ్లీ బైక్‌పై వచ్చి రాజును కొడుతుంటే అంజలి అడ్డం పడగా ఆమె చున్నీ లాగేసి చెంపపై బలంగా కొట్టాడు. స్థానికులు కలుగజేసుకోవడంతో వారు వెళ్లిపోయారు. అదే రోజు బాధిత దంపతులిద్దరు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా రాత్రి పది గంటల వరకు వేచి ఉంచి మరుసటి రోజు రండని పంపించేశారు. రెండో రోజు కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా దాడికి పాల్పడిన వారికి కొమ్ము కాశారని బాధితులు తెలిపారు. శుక్రవారం మళ్లీ ఆ యువకులిద్దరు తాగొచ్చి వలసొచ్చి మాపై ఫిర్యాదు చేస్తారా అంటూ దుర్భాషలాడి మీ సంగతి చూస్తామని బెదిరించారని వాపోయారు. తమకు ప్రాణహాని ఉందనే భయంతో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను ఆశ్రయించామన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించకుండా దాడికి పాల్పడిన వారికి కొమ్ము కాయడం తగదని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు శీలం ప్రకాష్‌రావు అన్నారు. దళిత మహిళపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలాని కోరారు. శనివారం వైకాపా నాయకులు కొందిరు కలుగజేసుకొని ఉభయులను పిలిపించి రాజీ కుదిర్చారు. దీంతో ఈ దాడి ఘటనలో అధికార పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు