logo

పెడన నుంచి లక్ష్మీపురం వరకు

ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. పెడన నుంచి తిరువూరు మండలం లక్ష్మీపురం వరకు ఆరు వరుసలుగా 216 జాతీయ రహదారి విస్తరణకు అడుగు ముందుకు పడింది.

Published : 01 Feb 2023 05:04 IST

ఆరు వరుసల జాతీయ రహదారి విస్తరణ

తిరువూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. పెడన నుంచి తిరువూరు మండలం లక్ష్మీపురం వరకు ఆరు వరుసలుగా 216 జాతీయ రహదారి విస్తరణకు అడుగు ముందుకు పడింది. సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారు. పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్‌, నూజివీడు, విస్సన్నపేట, మల్లేల, లక్ష్మీపురం వరకు విస్తరించి, ఇబ్రహీంపట్నం- ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌హెచ్‌ 30కి అనుసంధానం చేయనున్నారు. ఇందులో భాగంగా డీపీఆర్‌లు తయారుచేసే పనిలో ఎన్‌హెచ్‌ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ పనిని పెడన-గుడివాడ, గుడివాడ-నూజివీడు, నూజివీడు-లక్ష్మీపురం వరకు మూడు ప్యాకేజీలుగా విభజించారు. ఇందుకోసం నియోజకవర్గంలోని తిరువూరు, విస్సన్నపేట మండలాల్లోని కొండపర్వ, వేమిరెడ్డిపల్లి, తాతకుంట్ల, విస్సన్నపేట, చండ్రుపట్ల, తెల్లదేవరపల్లి, పుట్రేల, మల్లేల, లక్ష్మీపురం, రామన్నపాలెం రెవెన్యూ పరిధి భూములను సేకరించనున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రహదారికి ఇరువైపులా రైతులకు చెందిన వ్యవసాయ భూముల వివరాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. కలెక్టర్‌ గెజిట్‌ పబ్లికేషన్‌ విడుదల చేసిన తర్వాత భూసేకరణ చేపడతారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. ఈ రహదారి విస్తరణతో తిరువూరు, పొరుగునున్న తెలంగాణ వాసులు గన్నవరం ఎయిర్‌పోర్టు, ఏలూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాలకు త్వరగా చేరడానికి మార్గం సుగమమవుతుంది. ఈ మార్గంలో శిథిలావస్థకు చేరుకున్న దశాబ్దాల నాటి వంతెనలు, చప్టాల స్థానంలో కొత్తవి నిర్మిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు