logo

మంచం పడుతున్న ప్రజలు

మచిలీపట్నంలోని సుకర్లాబాదకు చెందిన ఓ వ్యక్తి దగ్గు, జలుబుతో జ్వరం బారిన పడటంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లి  చికిత్స తీసుకున్నారు. జ్వరం తగ్గి రెండు వారాలైనా జలుబు, దగ్గు, నీరసం తగ్గకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Published : 27 Mar 2023 05:06 IST

జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న జ్వర పీడితులు
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

బందరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

మచిలీపట్నంలోని సుకర్లాబాదకు చెందిన ఓ వ్యక్తి దగ్గు, జలుబుతో జ్వరం బారిన పడటంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లి  చికిత్స తీసుకున్నారు. జ్వరం తగ్గి రెండు వారాలైనా జలుబు, దగ్గు, నీరసం తగ్గకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పలు రకాల మందులు వాడినా తగ్గడంలేదని మళ్లీ వైద్యులవద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు.
రి పెడన మండలంలోని ఓ గ్రామానికి ఒడిశా నుంచి కొంతమంది వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చారు. వారిలో ఓ వ్యక్తికి జ్వరం, జలుబు వచ్చి స్థానిక వైద్యులవద్దకు చికిత్స తీసుకున్నాడు. వారం గడిచిపోయినా తగ్గక పోవడంతో అతని కుటుంబసభ్యులు వారి ఊరికి తీసుకెళ్లిపోయారు. వీరే కాదు జిల్లాలో అనేకమంది జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు.

4,396 కేసుల నమోదు

జిల్లా వ్యాప్తంగా గత మూడునెలలుగా పరిశీలిస్తే జ్వర కేసులు పెరుగుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఎక్కువగా జ్వరాల కేసులు నమోదవుతుంటాయి. ప్రస్తుతం వేసవి సమీపించినా...మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరాల కేసులు సాధారణంగా కంటే ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. మచిలీపట్నంతోపాటు జిల్లాలోని పలు ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు వస్తున్న రోగుల్లో ఎక్కువగా జ్వర పీడితులే  ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రితోపాటు ప్రాంతీయ, సామాజిక  ఆసుపత్రులతోపాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వచ్చేవారిలో కూడా ఎక్కువమంది ఈ తరహా బాధితులే ఉండటం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుంచి  ఇప్పటివరకు  మూడు నెలల్లోపే 4,396 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునేవారితోపాటు ఇళ్లవద్దే ఆర్‌ఎంపీల వద్ద మందులు వాడుకుంటున్న వారిని కూడా లెక్కిస్తే రెట్టింపు ఉంటుంది.

ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ..

ఇన్‌ఫ్లూయింజా వ్యాపిస్తుందని హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జ్వరం తగ్గినా జలుబు, దగ్గు వారాల తరబడి ఇబ్బంది పెట్టడంతో ఫ్లూ అని అనుమానంతో కొందరు కార్పొరేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల ఆధ్వర్యంలో ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో  వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని గురిస్తున్నా....వారిలో కూడా ఎక్కువగా జ్వరపీడితులే ఉంటున్నారు.  ఏ జ్వరమో తెలియక ప్రయివేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా కేంద్రాల నిర్వాహకులు వారినుంచి వివిధ రకాల పరీక్షల పేరుతో అయినకాడికి దండుకుంటున్నారు.  


ఆందోళన చెందవద్దు

జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్న మాట వాస్తవమే.అవి సాధారణ, వైరల్‌ జ్వరాలే ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదు. వాతావరణ పరిస్థితులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం కొంతమంది శరీరతత్వాన్ని బట్టి జలుబు, దగ్గు తగ్గడానికి సమయం పడుతోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 430మంది జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారిలో కొంత తీవ్రత ఎక్కువ ఉన్నవారినుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాం. ఎలాంటి ఫ్లూ కేసులు నమోదు కాలేదు. జిల్లా అంతటా జ్వరాలపై అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో ర్యాలీలు, సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం.

డా. గీతాబాయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని