logo

ఆ చెడ్డ ‘అంకుల్‌’కు జీవిత ఖైదు: తీర్పు ఇచ్చిన విజయవాడ పోక్సో కోర్టు

విజయవాడ న్యాయవిభాగం తన కుమార్తె వయసు ఉన్న బాలికను నిత్యం లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు కారకుడైన కామాంధుడికి న్యాయస్థానం శిక్ష విధించింది.

Updated : 27 Apr 2023 14:17 IST

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, విజయవాడ న్యాయ విభాగం: తన కుమార్తె వయసు ఉన్న బాలికను నిత్యం లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు కారకుడైన కామాంధుడికి న్యాయస్థానం శిక్ష విధించింది. రెండు నెలల పాటు నిత్యం అసభ్యకర మాటలతో ఇబ్బంది పెట్టడంతో భరించలేక అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి దూకి తనువు చాలించింది. ఈ కేసులో బాలికను లైంగిక వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నిందితుడు వినోద్‌ జైన్‌ (49)కు జీవిత ఖైదు, రూ.3లక్షల జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్‌.రజిని.. బుధవారం తీర్పు చెప్పారు. 2022, జనవరి 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు భవానీపురం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 306, 354, 354ఏ, 354డి, 509, 506, పోక్సో చట్టంలోని 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును భవానీపురం పీఎస్‌ ఎస్సై ప్రసాద్‌ దర్యాప్తు చేశారు. ఈ కేసులో 20 మంది సాక్షుల వాంగ్మూలాలను ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు జీవీ నారాయణరెడ్డి, గుజ్జల నాగిరెడ్డి న్యాయస్థానంలో నమోదు చేయించారు. ఈ కేసులో నిందితుడిపై నేరారోపణ రుజువు అయింది. నిందితుడు 2022, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రిమాండ్‌లోనే ఉన్నాడు.

ఐపీసీ సెక్షన్‌ 305 కింద జీవిత ఖైదు, రూ.లక్ష జరిమానా, పోక్సో సెక్షన్‌ 9 (ఎల్‌), 10 కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానా, పోక్సో చట్టం సెక్షన్‌ 12 కింద మూడేళ్ల శిక్ష, రూ.50వేల జరిమానా, ఐపీసీ సెక్షన్‌ 354 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానా, ఐపీసీ సెక్షన్‌ 509 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని, రూ.3లక్షల జరిమానాలో.. రూ. 2.4లక్షలు బాలిక తల్లికి ఇవ్వాలని తీర్పులో చెప్పారు. బాధిత కుటుంబానికి పరిహారం వచ్చేలా చూడాలని కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు. బాలికను లైంగికంగా వేధించి ఆమె మరణానికి కారణమై, ఆమె తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురి అవ్వడానికి కారణమైన ఈ కేసును క్రూరమైన నేరంగా పరిగణించాలని న్యాయమూర్తి తీర్పులో వ్యాఖ్యానించారు.

భరించలేని మాటలతో కలత చెంది..

విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని లోటస్‌ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ నెంబర్‌ 43లో నివసించే వినోద్‌కుమార్‌ అలియాస్‌ వినోద్‌ జైన్‌ అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే బాలిక (13) పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాడు. రెండు నెలల పాటు నిత్యం నరకం చూపించాడు. రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చే సమయంలో బాలిక శరీర భాగాలను తాకుతూ అసభ్యకరంగా మాట్లాడేవాడు. జీన్స్‌లో అందంగా ఉన్నావు, నీ కాళ్లు పొడవుగా ఉన్నాయంటూ వెకిలిగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేవాడు. మెట్లు, లిఫ్ట్‌ వద్ద నిందితుడు వెంబడిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని బాలిక ఆందోళనకు గురైంది. మరో వైపు వినోద్‌జైన్‌ వేధింపులు ఆగకపోవడంతో 2022 జనవరి 29న సాయంత్రం 5.15లకు అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ పై నుంచి బాలిక దూకి ఆత్మహత్య చేసుకుంది.

సొంత దస్తూరితో రాసిన లేఖతో...

బాలిక చనిపోయే ముందు మూడు పేజీల లేఖ రాసింది. వినోద్‌ జైన్‌ వేధింపులతోనే తనువు చాలిస్తున్నట్లు పేర్కొంది. ‘అమ్మా.. నేను ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పలేదు. నేను చాలా భయపడ్డాను. సిగ్గుగా భావించా. జీవితంలో ఇంకేదైనా సమస్య అయితే.. చనిపోయేదాన్ని కాదేమో. కానీ ఈ విషయంలో నేను ఏమీ చేయలేకపోయాను. దీనికి అంతటికీ కారణం వినోద్‌ జైన్‌. గత రెండు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తరచూ నా శరీరాన్ని తాకుతున్నాడు.’ అని బాలిక నోట్‌లో ఆంగ్లంలో రాసి ఆత్మహత్య చేసుకుంది. మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేకపోయినా, నాకు తప్పని పరిస్థితి వచ్చిందని.. ఇదే నా చివరి రోజు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రాసింది. దీంతో పాటు బాలిక సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లోనూ తన ఆవేదనను అక్షరబద్ధం చేసింది. ఘటన జరగడానికి రెండు రోజుల ముందు తన సెల్‌ఫోన్‌లో ‘నాకు చనిపోవాలని ఉంది’ అంటూ 19 సార్లు టైప్‌ చేసింది. బాలిక సొంత దస్తూరీతో రాసిన లేఖ ఈ కేసులో కీలక సాక్ష్యంగా అక్కరకొచ్చింది. బాలిక రాతను ఫోరెన్సిక్‌ నిపుణులు ధ్రువీకరించారు. ఇదే నిందితుడికి శిక్ష పడేందుకు ఉపయోగపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని