logo

ప్రాణాలకు లేదు పూచీ!

బెజవాడలో కాలినకడకన రోడ్డెక్కితే ప్రాణాలకు పూచీ లేకుండా పోతోంది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఫుట్‌పాత్‌లపై నడుద్దామన్నా అవకాశం లేకుండా పోతోంది.

Updated : 15 Jun 2023 05:36 IST

4 నెలలు... 36 మంది మృత్యువాత
నగరంలో నడకదారుల ఆక్రమణల ఫలితం
ఈనాడు - అమరావతి

నగరంలోని ఏలూరు రోడ్డులో

బెజవాడలో కాలినకడకన రోడ్డెక్కితే ప్రాణాలకు పూచీ లేకుండా పోతోంది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఫుట్‌పాత్‌లపై నడుద్దామన్నా అవకాశం లేకుండా పోతోంది. పాదచారుల కోసం ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య ప్రాంతాల్లో అయితే ఇది ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా పాదచారులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సి వస్తోంది. రాత్రుళ్లు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఆక్రమణలను తొలగించాల్సిన నగరపాలక అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎక్కువ జనసంచారం ఉండే బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో పరిస్థితి దారుణంగా ఉంది.

రోడ్లపై పాదచారులు నడిచేందుకు కచ్చితంగా ఫుట్‌పాత్‌లు నిర్మించాలి. నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి. ఎలా నిర్మించాలన్న విషయంపైనా ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. ఎత్తు 0.75 మీటర్లు, వెడల్పు 1.5 మీటర్లు ఉండాలి. విజయవాడలో అన్ని రోడ్ల నిడివి 53.4 కి.మీ. ఇందులో కేవలం 6.41 కి.మీలోనే ఫుట్‌పాత్‌ ఉంది. మిగిలిన 46.99 కి.మీ. లేదు. అంటే.. దాదాపు 88 శాతం రహదారులకు ఫుట్‌పాత్‌లే లేవు. ఉన్నవి కూడా ఆక్రమించేశారు. ఆక్రమణలు తొలగించాల్సిన వీఎంసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వాణిజ్య కేంద్రంగా ఎదిగిన విజయవాడ నగరానికి నిత్యం పలు జిల్లాల నుంచి ప్రజలు, వ్యాపారులు వివిధ అవసరాల నిమిత్తం వస్తుంటారు. ఫుట్‌పాత్‌లపై నడిచేందుకు అవకాశం లేక తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైనే నడుస్తున్నారు. దీంతో రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భద్రత కొరవడుతోంది. ఎటు వైపు నుంచి ఏ వాహనం ఢీకొంటుందో తెలియని పరిస్థితి. పద్మవ్యూహాన్ని చేధించిన చందంగా ఉంటోంది. వెరసి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మృతుల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. ఈ ఏడాది  జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 36 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. గాయాలపాలైన వారు ఇంతకు మూడింతల మంది ఉంటున్నారు.

వాణిజ్య ప్రాంతాల్లో దయనీయం...

* బందరు రోడ్డులో బెంజి సర్కిల్‌ నుంచి డీసీపీ బంగ్లా వరకు కాలు తీసి కాలు పెట్టేందుకు కూడా అవకాశం లేదు. ఈ ప్రాంతంలో హోటళ్లు, మాల్స్‌, రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్‌ దుకాణాలు ఉన్నాయి. చాలా మంది మెట్లు, ర్యాంపులు నిర్మించారు.రి ఏలూరు రోడ్డులో ఐఎంఏ హాలు నుంచి విజయాటాకీసు కూడలి వరకు ఇదే పరిస్థితి. ఫర్నిచరు, పుస్తకాలు, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ దుకాణాలు ఉన్నాయి. వీరందరూ బహిరంగంగానే ఆక్రమించి తమ ఉత్పత్తులను ఫుట్‌పాత్‌లపైనే ఉంచుతున్నారు.రి రాజగోపాలాచారి వీధి, గవర్నర్‌పేట, ఐదో నెంబరు రోడ్డు, వన్‌టౌన్‌లో కేఆర్‌ మార్కెట్‌ ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులు, బట్టల షాపులు, బంగారం దుకాణాల వారు ఆక్రమించేశారు.

ఫుట్‌పాత్‌ ఆక్రమణకు గురైన తీరిది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని