logo

పేదింట విరిసిన విద్యాకుసుమాలు

తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు.

Published : 23 Apr 2024 06:13 IST

విద్యాధరపురం, భవానీపురం, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. తాము పెద్ద చదవులు చదవకపోయిన కుమార్తెలను ఉన్నత చదువులు చదివించాలన్న తల్లిదండ్రుల తపనను అర్థం చేసుకున్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌ ఫలితాలకు తీసిపోని విధంగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పలువురు తమ కృషిని, లక్ష్యాన్ని వివరించారు.

సీఏ అవుతా

మాది కామకోటినగర్‌. తండ్రి వెంకట నర్సింహారావు కారు డ్రైవర్‌. తల్లి విజయగౌరి గృహిణి. చిన్నతనం నుంచి చదువులో ప్రథమ స్థానంలో ఉండేందుకు కష్టపడి చదివాను. ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష రాసి ఉపకార వేతనం సాధించాను. ఆ సొమ్మును నా చదువు కోసం ఉపయోగించాను. పదో తరగతిలో 566 మార్కులు సాధించాను. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహించారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాసి మంచి ఫలితాలు సాధించాను. చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఉన్నత స్థాయికి ఎదగాలన్నది నా లక్ష్యం. అందుకు అవసరమైన సాధన చేస్తాను. 

వన్సిక

ట్రిపుల్‌ ఐటీలో చదవాలి

మాది గొల్లపూడి. తండ్రి శివ సత్యనారాయణ వడ్రంగి పనిచేస్తారు. తల్లి కనకదుర్గ దర్జీ. నాన్నకు నేను ట్రిపులో ఐటీలో చదివించాలనేది కోరిక. 561 మార్కులు వచ్చాయి. నా మార్కులతో వాటిలో సీటు వస్తుందని భావిస్తున్నా. తరగతిలో చెప్పిన విషయాలను ఎప్పటికప్పుడు చదివేదాన్ని. ఏవైనా అనుమానాలు ఉంటే ఉపాధ్యాయులు నివృత్తి చేసేవారు. ఉపాధ్యాయుల సూచనలు పాటించాను.

మహాలక్ష్మి

ఎంబీబీఎస్‌లో సీటు సాధించేందుకు కృషి

మాది గొల్లపూడి. తల్లిదండ్రులు రాజా రమణ, సుజాత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులు. తండ్రికి ఆరోగ్యం సరిగా లేదు. పదో తరగతిలో 559 మార్కులు సాధించాను. ఇదే పట్టుదలతో ఇంటరులో బైపీసీ గ్రూపు తీసుకొని నీట్‌లో సీటు సాధించడమే లక్ష్యం. అందుకు అవసరమైన కృషి చేస్తాను.

చరిష్మారాణి

డాక్టర్‌ కావడమే లక్ష్యం

నాన్న హెడ్‌కానిస్టేబుల్‌. అమ్మ గృహిణి. పాఠశాలలో చెప్పిన ప్రతి పాఠాన్ని అర్థం చేసుకుని చదివాను. ఆ విధంగా చేయడం వలన ఎక్కువ మార్కులు సాధించడం సాధ్యమైంది. ఏ రోజు చెప్పిన విషయాలను ఆ రోజే చదువుకునేదాన్ని. పరీక్షకు వెళ్లే సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్ష రాశాను. ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటించడంతో 592 మార్కులు సాధించడం సాధ్యమైంది. డాక్టర్‌ కావాలన్నదే నా లక్ష్యం.

జంపా విష్ణు ప్రియ

ఉపాధ్యాయుల సూచనలతో..

నాన్న ప్రైవేటు ఉద్యోగి. అమ్మ గృహిణి. పరీక్షలకు ముందు మూడు, నాలుగుసార్లు పాఠ్యపుస్తకాలను పూర్తిగా అర్థం చేసుకొని చదివాను. ప్రతి విషయంపై దృష్టి సారించాను. తరగతి గదిలో ఎప్పటికప్పుడు అనుమానాలను నివృత్తి చేసుకునేదాన్ని. పరీక్షలో ఏ ప్రశ్న వచ్చినా రాసేలా సిద్ధమయ్యాను. ప్రతి రోజూ ఉదయం, రాత్రి సాధన చేశాను. ఉపాధ్యాయుల సూచనలు పాటించాను. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయగలిగాను. ఫలితంగా 590 మార్కులు వచ్చారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం అందించారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి సమాజానికి సేవ చేయడమే నా ఆశయం.

ఎం.దుర్గానాగవైష్ణవి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని