logo

తవ్వుకో.. దండుకో!

పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు.

Updated : 24 Apr 2024 06:56 IST

ఆగని ఇసుక దందా
అక్రమార్కులదే హవా
పెడన, న్యూస్‌టుడే

పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. వాల్టా చట్టం కింద చర్యలు చేపడతామన్న రెవెన్యూ అధికారుల హెచ్చరికలను బేఖాతర్‌ చేస్తూ తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు.

వ్వకాలు చేపట్టేందుకు భూగర్భ వనరుల శాఖ అనుమతులు  తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకుగాను క్యూబిక్‌ మీటరు వంతున రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పెడనలో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. దళారులు రాత్రికి రాత్రి లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.తద్వారా రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. టిప్పర్‌ ఇసుక దూరాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు ఉండగా, ట్రాక్టర్‌ ఇసుక రూ.1500 నుంచి రూ. 2000ల వరకు విక్రయిస్తున్నారు.

జోగి రమేష్‌ హయాంలో వేలం

జోగి రమేష్‌ ఇక్కడ ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రిగా పనిచేసిన కాలంలో మండలానికి ఒకరికి హక్కులు కల్పించారు. ఇందుకు దళారుల మధ్య ఆర్నెళ్లకు ఒకసారి వేలం నిర్వహించారు. అత్యధిక మొత్తంలో పాడుకున్న వ్యక్తికి ఆ మండలంలోని అన్ని రీచ్‌లను కట్టబెట్టారు. ఒక్కో మండలం నుంచి ఆర్నెళ్లకు రూ.కోటి వరకు దండుకున్నారు.ఆ సమయంలో పగలు, రాత్రి తారతమ్యం లేకుండా  టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలించారు. జగనన్న కాలనీల మెరక పేరిట కోట్లాది రూపాయలు దండుకున్నారు.


రాత్రి వేళల్లో: పెడన మండలం నందమూరు-జింజేరుల సరిహద్దున ఓఎన్‌జీసీ సైట్‌ నుంచి ఇసుకను రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. ఇదే మండలం కాకర్లమూడి, కట్లపల్లి గ్రామాల్లో రాత్రి 10 నుంచి ఉదయం 5గంటల వరకు ఇసుక దోపిడీ జరుగుతోంది.బందరు మండలం బుద్ధాలపాలెం నుంచి పెడన మీదుగా గుడ్లవల్లేరు, వడ్లమన్నాడు ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.


వీఆర్వోల కనుసన్నల్లో..

వీఆర్వోల కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతోందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మామూళ్లు తీసుకుని ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.ఇందులో కొందరు మండల స్థాయి అధికారుల ప్రోద్భలం కూడా ఉన్నట్లు సమాచారం.


ప్రభుత్వ ఆదాయానికి గండి

- బొల్లా నాగేశ్వరరావు, దిరిశివెల్లి

గత అయిదేళ్లుగా ఇసుక దోపిడీ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. పగలు, రాత్రి ఇసుకను తరలిస్తున్నారు. అక్రమార్కులకు  వైకాపా నేతల అండదండలు ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని