logo

గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?

రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే..

Updated : 26 Apr 2024 05:22 IST

పామర్రు సభలో.. పనిచేయని బటన్‌ నొక్కిన జగన్‌
కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అప్పులపాలైన తల్లిదండ్రులు
సగం మంది ఖాతాల్లోనూ పడని విద్యాదీవెన నిధులు

‘‘రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. విద్యార్థుల బోధన రుసుములు ఎంతైనా చెల్లిస్తున్నాం. అన్ని త్రైమాసికాలకు క్రమం తప్పకుండా.. తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తూ.. వాళ్లే కళాశాలకు వెళ్లి ఫీజులు కట్టుకునే సంప్రదాయానికి నాంది పలికాం.’’

పామర్రులో మార్చి 1న భారీ బహిరంగ సభలో ‘విద్యా దీవెన’ బటన్‌ నొక్కుడు కార్యక్రమం వేదికపై నుంచి జగన్‌ చెప్పిన తీపి మాటలివీ.

ఈనాడు, అమరావతి


పామర్రు సభలో..


మాతృమూర్తులకు నిరాశే..

మార్చి 01 నుంచి ఇప్పటికి 55 రోజులవుతోంది. కానీ.. ఇంతవరకూ జగన్‌ నొక్కిన బటన్‌ డబ్బులు చాలామంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడలేదు. పామర్రు సభలో బటన్‌ నొక్కి 9.44 లక్షల మంది విద్యార్థులకు.. రూ.708.68 కోట్లను 2023-24విద్యా ఏడాదిలో.. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని.. అబద్ధాలు చెప్పారు. కానీ.. ఆ డబ్బుల్లో సగం కూడా ఖాతాల్లో పడలేదు. కానీ.. వెంటనే వేదిక పైనుంచే బటన్‌ నొక్కి వేసేసినట్లు, అవి తల్లుల ఖాతాల్లో పడిపోయినట్లు.. ముఖ్యమంత్రిపై.. కృష్ణా జిల్లా అధికారులు పొగడ్తల వర్షం కురిపించారు.

ఒత్తిడి తాళలేక అప్పులు చేసి..

కళాశాలల నుంచి తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించాలని.. తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో ఏం చేయాలో తెలియక.. అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. గతంలో బోధన రుసుం నేరుగా కళాశాలలకే వచ్చేది. అందుకే.. తల్లిదండ్రులను కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేసేవి కావు. కానీ.. జగన్‌ వచ్చాక.. తల్లుల ఖాతాల్లో వేస్తాం, వాళ్లే వెళ్లి కట్టాలనే మెలిక పెట్టారు. వెరసి జగన్‌ తమ బిడ్డలకు డబ్బులిస్తున్నారని తల్లిదండ్రులకు తెలియాలి.. ప్రచారం జరగాలనేది వైకాపా సర్కారు ఆలోచన. కానీ.. ఇదే తల్లిదండ్రులకు శాపంగా మారింది. ఫీజులతో ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరే చెల్లించాలని.. యాజమాన్యాలు ఒత్తిడి మొదలెట్టాయి. ఒకవేళ ఎప్పుడో ప్రభుత్వం వేస్తే.. అవి మీ ఖాతాల్లోనే పడతాయి కదా.. మాకు సంబంధం ఏంటని.. ప్రశ్నించడం ఆరంభించాయి. వెరసి తల్లిదండ్రులు సైతం ఏం చేయాలో తెలియక.. అప్పు చేసి కట్టాల్సి వస్తోంది.

హాల్‌టికెట్లు ఆపేసి వేధింపులు..

చాలా కళాశాలలు విద్యార్థులకు హాల్‌టికెట్లను ఇవ్వకుండా ఆపేశాయి. పరీక్షలు రాయాలంటే.. కచ్చితంగా ఫీజు బకాయిలు కట్టాలని ఒత్తిడి పెట్టాయి. విజయవాడ శివార్లలో ఉన్న ఓ ప్రముఖ కళాశాలలో విద్యార్థులకు పరీక్షల సమయంలో అరగంట ఆలస్యంగా హాల్‌ టిక్కెట్లు ఇచ్చి వేధించాయి. ఫీజులు చెల్లించే వరకూ హాల్‌టికెట్లను సమయానికి ఇచ్చేది లేదని, ఎవరైతే చెల్లించరో వారికి అరగంట ఆలస్యంగానే ఇస్తామనడం గమనార్హం. ప్రతిరోజు పరీక్ష అయిపోగానే.. విద్యార్థుల నుంచి హాల్‌టిక్కెట్లు తీసుకోవడం, మళ్లీ మరుసటి రోజు పరీక్షకు అరగంట ఆలస్యంగా ఇవ్వడం చేశారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు ఒకటి రెండు పరీక్షలు అవ్వగానే.. అప్పులు చేసి తెచ్చి ఫీజులు మొత్తం కట్టేశారు. ఆ తర్వాతే.. హాల్‌టికెట్లను వారికి యాజమాన్యం ఇచ్చింది.

భారీగా కోత పెట్టారు..

ఏటా నాలుగుసార్లు చొప్పున జగనన్న విద్యాదీవెన నిధులు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ.. 2020-21లో ఇప్పటికే ఒక త్రైమాసికం డబ్బులు విడుదల చేయకుండా విద్యార్థులపై భారం మోపింది. 2023-24కు సంబంధించి కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని విద్యార్థులకు పూర్తిగా నాలుగు విడతల డబ్బులు పడాల్సి ఉంది. కానీ.. ఒక్క విడత డబ్బులు కూడా ఇప్పటికీ పడని విద్యార్థులే సగానికి పైగా ఉన్నారు. వీరి నుంచి ఇప్పటికే కళాశాలలు ముక్కుపిండి వసూలు చేశాయి. అప్పులు చేసి కట్టిన తల్లిదండ్రులు ఇప్పుడు వాటికి వడ్డీలు కడుతున్నారు.


కళాశాల నిర్వహణ ఎలా?

విద్యార్థులు సకాలంలో ఫీజులు కడితే ఉద్యోగులకు జీతాలివ్వడానికి, కళాశాల నిర్వహణకు ఇబ్బంది ఉండదు. కొంత మంది ప్రభుత్వం ఇచ్చే విద్యా దీవెనపై ఆధారపడి కళాశాలలో చేరారు. అలాంటి వారు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో నిర్వహణ ఇబ్బందుల్లో పడింది. అధ్యాపకులకు జీతాలివ్వడానికి మేము కూడా అప్పులు చేయడం, బ్యాంకులో రుణాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం.

ప్రైవేటు కళాశాల నిర్వాహకుడు, గుడివాడ


ధ్రువపత్రాలు లేకపోతే కొలువు ఎలా?

మేము భీమనవారిపేటలో ఉంటాం. నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మా కుమారుడు ఓ కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మార్చి నెలలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బటన్‌ నొక్కి వేశామని చెబుతున్నారు. మాకు మాత్రం రూపాయి కూడా బ్యాంకు ఖాతాలో ఇప్పటికీ జమ కాలేదు. బీటెక్‌ పూర్తి చేసి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలంటే ధ్రువపత్రాలు కావాలి. కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని స్పష్టం చేసింది. అవి లేకపోతే ఉద్యోగం ఎలా వెతుక్కోవాలి. ప్రభుత్వం నిధులు జమ చేయాలి.

 కె.జగదీష్‌, భీమనవారిపేట


బంగారం తనఖా పెట్టి ఫీజు కట్టా

మా అమ్మాయి ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఏడాది ఫీజు రూ.81వేలు. బోధనా రుసుములు చెల్లిస్తేనే హాల్‌ టిక్కెట్‌ ఇస్తామన్నారు. ఫీజు తర్వాత చెల్లిస్తానని కళాశాల యాజమాన్యాన్ని చాలా బతిమిలాడా. అయినా హాల్‌ టిక్కెట్‌ ఇవ్వలేదు. చివరకు ఏం చేయాలో తెలియక బంగారం తనఖా పెట్టి.. డబ్బులు తెచ్చి ఫీజు కట్టా. ఏ మాత్రం కట్టకపోయినా విద్యా సంవత్సరం వృథా అయ్యేది. మా అమ్మాయితో పాటు చదివే మరో యువతి ఫీజు కట్టకపోవడంతో హాల్‌ టికెట్‌ ఇవ్వలేదు. పరీక్ష రాయలేకపోయింది.

 ఓ గృహిణి, మధురానగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని