logo

పట్టుగొమ్మలపై.. గొడ్డలి వేటు

గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని పాతాళానికి తొక్కేసిన ఘనత సీఎం జగన్‌దే. వాటికి ఒక్కపైసా కూడా ఇవ్వకుండా, వివిధ గ్రాంట్లను దారి మళ్లించేసి పంచాయతీలను పీల్చి పిప్పి చేశారు.

Updated : 08 May 2024 05:49 IST

గ్రామ స్వరాజ్యానికి జగన్‌ ఉరి!
నిధులు, గ్రాంట్ల దారి మళ్లింపు
పల్లెల ప్రగతిని దారుణంగా దెబ్బతీసిన వైకాపా సర్కారు
ఈనాడు, అమరావతి

మైలవరం నియోజకవర్గంలో మేజర్‌ గ్రామ పంచాయతీకి చెందిన వైకాపా ఉప సర్పంచి స్థానికంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు చేయించారు. నాలుగేళ్లు గడిచినా ఒక్క పైసా కూడా బిల్లు రాలేదు. ప్రభుత్వం గ్రాంట్లూ ఇవ్వలేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ అందలేదు. పన్నుల రూపంలో వచ్చిందంతా సిబ్బంది జీతభత్యాలకు, పారిశుద్ధ్య పనులకు సరిపోక చేతులెత్తేసే పరిస్థితి. అభివృద్ధి మాట దేవుడెరుగు.. ప్రజలకు కనీసం తాగునీరందించలేని దైన్య స్థితి.


కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు పంచాయతీ జనాభా సుమారు 50 వేలు. మురుగు కాలువల్లేవు. వాడకం నీరంతా ఎక్కడబడితే అక్కడ ప్రవహిస్తోంది. సీసీ రోడ్లు కావాలని ప్రజలు అడుగుతున్నా నిధుల కొరత. కనీసం రక్షిత నీటి సరఫరా ట్యాంకును శుభ్రం చేసేందుకు బ్లీచింగ్‌ పౌడర్‌ కొనలేని దురవస్థ. వేరే దారి లేక ఇక్కడి వైకాపా సర్పంచి విజయభాస్కర్‌ అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి తెదేపాలో చేరిపోయారు. తెదేపా అధికారంలోకొచ్చాకైనా ప్రభుత్వ నిధులతో గ్రామంలో పనులు చేపట్టాలన్నది ఆయన ఆలోచన.

గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని పాతాళానికి తొక్కేసిన ఘనత సీఎం జగన్‌దే. వాటికి ఒక్కపైసా కూడా ఇవ్వకుండా, వివిధ గ్రాంట్లను దారి మళ్లించేసి పంచాయతీలను పీల్చి పిప్పి చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపడంలో మాత్రం ముందే ఉంది. సచివాలయాలను ఏర్పాటు చేసి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చానని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం వాటికి అందకుండా చేసి పీడీ ఖాతాలకు మళ్లించడం వివాదాస్పదమైంది. విద్యుత్తు బిల్లులకు సైతం నిధుల కోత పెట్టారు. అత్యధిక గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రభుత్వం ఆడంబరంగా చేపట్టిన భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. తమ ప్రభుత్వం అని నమ్మకంతో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేసిన పనులకు బిల్లులందక లబోదిబోమంటున్నారు. నాడు-నేడు పనులకూ డబ్బులివ్వలేదు. అప్పులు చేసి పనులు చేసినవారంతా.. ఉన్నదంతా అమ్ముకోవాల్సి వచ్చింది. మైలవరం నియోజకవర్గంలో ఓ సర్పంచి తన విలువైన వ్యవసాయ భూమిని విక్రయించి మరీ అప్పు తీర్చాల్సి వచ్చింది. బిల్లులు రాలేదని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాక.. విసిగిపోయి ఆయన చివరకు తెదేపాలోకి వచ్చిన విషయం తెలిసిందే.


  • గ్రామ స్వరాజ్యమంటే అర్థం తెలుసా జగన్‌?
  • స్థానిక సంస్థల స్వపరిపాలన గురించి ఎప్పుడైనా విన్నారా?
  • అసలు గ్రామాల్లో ఏం జరుగుతుందో ఏనాడైనా తెలుసుకున్నారా?
  • సంపద సృష్టి ఎలా చేస్తారో ఎవరూ చెప్పలేదా మీకు?
  • వ్యవస్థలను ధ్వంసం చేయడంలో అనుభవం ఉన్న మీకు.. పంచాయతీరాజ్‌ వ్యవస్థను తన కాళ్ల మీద ఎలా నిలబెట్టాలో ఏం తెలుస్తుందిలే?

మీ నిర్వాకాల ఫలితాలెలా ఉన్నాయో..?
గ్రామాలు ఎంతలా
తల్లడిల్లిపోతున్నాయో..?
మీ పార్టీ వారిని అడిగినా చెబుతారు కదా!


అన్నిటికీ అగచాట్లే

- చందర్లపాడు, న్యూస్‌టుడే

పంచాయతీలకు అందాల్సిన నిధులను వైకాపా ప్రభుత్వం భారీగా దారి మళ్లించింది. సంపద సృష్టించడం చేతకాని జగన్‌ అందినకాడికి ఇష్టానుసారం అప్పులు చేసేసి పంచాయతీల ప్రగతిని దెబ్బకొట్టారు.

  • 2020-21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి 70 శాతం నేరుగా పంచాయతీలకు, 15 శాతం మండల ప్రజాపరిషత్తులకు, 15 శాతం జిల్లా పరిషత్తులకు అందాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో గత నాలుగేళ్లలో దాదాపు రూ. 1,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించేసింది.
  • 14వ ఆర్థిక సంఘం నిధుల తర్వాత 2020-21 నుంచి రాష్ట్రానికి సగటున రూ. 2,600 కోట్లు వచ్చాయి. ఇవన్నీ పీడీ ఖాతాల్లోకి మళ్లించిన ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసింది.
  • రాష్ట్రం నుంచి ఎస్‌ఎఫ్‌సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులనూ విడుదల చేయలేదు. జనాభా ప్రకారం రావాల్సిన తలసరి గ్రాంటునూ ఇవ్వలేదు. 
  • కేంద్రం నుంచి నేరుగా అందాల్సిన అన్‌టైడ్‌ ఫండ్స్‌ సబ్‌ సెంటర్లకు అందివ్వలేదు. గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం వీటిని వినియోగించాల్సి ఉంది.
  • తాగునీటి సరఫరాకు అత్తెసరుగానే నిధులిచ్చింది.
  • గ్రామాల్లో బోర్ల మరమ్మతులకు సైతం ఎంపీ ల్యాడ్స్‌పై ఆధారపడిన దారుణ పరిస్థితి ఉందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • ఆర్‌బీకేలు, జీపీలు, డిజిటల్‌ లైబ్రరీలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు అంటూ భవనాల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం బిల్లులు చెల్లించలేక చేతులెత్తేసింది.
  • గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను పరిష్కరించలేని దుస్థితిలో ఉన్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల గురించి అడగాల్సిన అవసరం ఏముందని జగనన్నా అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు.

పది లక్షలు ఖర్చు చేశా.. రూపాయి రాలేదు..

- ఆల చినసైదమ్మ, సర్పంచి, గుడిమెట్ల, ఎన్టీఆర్‌ జిల్లా

వివిధ పనులకు సొంత నిధులు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేశాను.  నేను వైకాపా మద్దతుతో పోటీ చేసి సర్పంచిగా విజయం సాధించా. వైకాపా ప్రభుత్వ తీరుతో విసుగు చెంది తెదేపాలో చేరాను.


పన్నుల డబ్బు జీతాలకే సరిపోతోంది..

 - నిమ్మగడ్డ సుధాకర్‌, సర్పంచి, బల్లిపర్రు.

కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించడంతో పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి. నీటి, ఇంటి పన్ను నుంచి వచ్చిన సొమ్ము సిబ్బంది జీతాలకే సరిపోతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని