logo
Published : 01/12/2021 05:44 IST

క్రైం వార్తలు

బంగారం దోపిడీ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే : బంగారు నగల తయారీ దుకాణంలో దోపిడీ చేసిన కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు, రూ.1200 జరిమానా విధిస్తూ విజయవాడ ఎనిమిదో అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఆంజనేయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. 2017, జులై 11వ తేదీ రాత్రి గవర్నర్‌పేట గోపాల్‌రెడ్డి నగర్‌, మహంకాళి మార్కెట్‌ సమీపంలో బంగారు వస్తువుల తయారీ దుకాణంలో 13 మంది అక్రమంగా కత్తులు, తుపాకులతో ప్రవేశించారు. సిబ్బందిని బెదిరించి బంగారు నగలను, బంగారు కడ్డీలు, రూ.2.5 లక్షలు చోరీ చేసి, పరారయ్యారు. దుకాణ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన సంతోష్‌ రతన్‌సింగ్‌ ఠాకూర్‌ అలియాస్‌ నేపాలి, మరికొంత మందిని నిందితులుగా గుర్తించారు. నాలుగో నిందితుడైన ఠాకూర్‌ను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడిపై నేరారోపణ రుజువు కావడంతో ఐదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో కొంత మంది నిందితులు పరారీలో ఉన్నారు.


ఘరానా దొంగ అరెస్టు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా పలు ద్విచక్ర వాహనాలు, వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తిని హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు కథనం ప్రకారం.. విజయవాడ వైఎస్సార్‌ కాలనీకు చెందిన షేక్‌ గౌస్‌ బాషా.. మంగళవారం తెల్లవారుజామున వేలేరు అడ్డరోడ్డు వద్ద రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ వాహనంతో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సీఐ సతీష్‌ ఆధ్వర్యంలో ఎస్సైలు గౌతమ్‌కుమార్‌, ఉషారాణి, దుర్గాప్రసాద్‌ల బృందం అదుపులోకి తీసుకుంది. అతడ్ని విచారించగా, హనుమాన్‌జంక్షన్‌ పరిధిలో అయిదు, వీరవల్లిలో ఒకటి, గుంటూరు జిల్లా లాలాగూడ పరిధిలో మరొక ద్విచక్ర వాహనం అపహరించినట్లు తేలింది. వీటితో పాటు బాపులపాడు మండలం అంపాపురం, మల్లవల్లి, ఎ.కొండూరు,  రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చరవాణులు, బంగారం, నగదు చోరీ చేసినట్లు నిర్ధరణ అయ్యింది. మొత్తంగా రూ.9,31,000 విలువ చేసే ఏడు ద్విచక్ర వాహనాలు, రూ.4,29,400 నగలు, నగదు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గౌస్‌పై విజయవాడలో పలు దొంగతనాల కేసులు నమోదయ్యాయని, టూటౌన్‌లో ఫోక్సో కేసు కూడా ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.


మూడు లారీల బియ్యం పట్టివేత

హనుమాన్‌జంక్షన్‌: రేషన్‌ బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మంగళవారం హనుమాన్‌జంక్షన్‌ వద్ద పోలీసులు ఏకకాలంలో రేషన్‌ బియ్యంతో వెళుతున్న మూడు లారీలను పట్టుకున్నారు. ఒక్కో లారీలో 500 బస్తాల్లో 25 టన్నుల బియ్యం ఉన్నట్లు సమాచారం. ఈ మూడు లారీలు ఒకేసారి ఖమ్మం పరిసర ప్రాంతాల నుంచి బయలుదేరి కాకినాడ పోర్టుకు వెళుతున్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశాలతో హనుమాన్‌జంక్షన్‌ సీఐ కె.సతీష్‌ తన సిబ్బందితో పక్కాగా నిఘా ఏర్పాటు చేసి ఈ లారీలను పట్టుకున్నారు. మూడు వాహనాల్లోనూ కేవలం చోదకులు మాత్రమే ఉన్నారు. రేషన్‌ బియ్యం మాఫియా వెనక సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


మరణంలోనూ వీడని బంధం

మంగళగిరి, న్యూస్‌టుడే: ఆ దంపతులది 40 ఏళ్ల వైవాహిక బంధం. జీవితంలో ఎన్నో కష్టసుఖాలు పంచుకున్న భార్యాభర్తలు మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా ప్రాణాలు వదిలిన విషాదం నగరంలోని యర్రబాలెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. యర్రబాలెంలోని విజయవాడ రహదారి పక్కన ఓ ఇంటిలో నివసిస్తున్న వీరరాఘవమ్మ (68), ఎ.వీర్రాజు (84), దంపతులు. కొంతకాలంగా వీరరాఘవమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో రాత్రి 10.30 గంటలకు ఆమె మరణించారు. తన జీవిత భాగస్వామి కళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వీర్రాజు గుండె తల్లడిల్లింది. బాధ భరించలేక గంట వ్యవధిలో ఒక్కసారిగా కుప్పకూలారు. స్పందించిన స్థానికులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో శ్వాస విడిచారు.


కిలాడీ పోలీసు కోసం గాలింపు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: తాను పోలీసునని.. తన చిరునామా ఎస్పీ కార్యాలయం అని చెప్పి పాన్‌బ్రోకర్‌ను బురిడీ కొట్టి రూ.50 వేలు కాజేశాడని అందిన ఫిర్యాదుపై మంగళవారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కిలాడీ పోలీసు ఎవరు? ఎక్కడ పని చేస్తున్నాడు? అతను అసలు పోలీసా? కాదా? అనే కోణాల్లో విచారిస్తున్నారు. అతని వివరాలను నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని