logo
Published : 01/12/2021 05:44 IST

మళ్లీ అదే పొరపాటు!

నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పరిస్థితి
ఈనాడు, గుంటూరు

న్నదాతలకు అండగా పంటల సాగు పెట్టుబడికి రుణాలు ఇస్తూ వారి అభివృద్ధికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బాటలు వేయాలి. రైతుల మూలధనం, నాబార్డు అందించే ఆర్థిక సాయంతో పనిచేస్తున్న డీసీసీబీలో ఉద్యోగులకు ఏటా ప్రోత్సాహక బహుమతి పేరుతో ఒక నెల వేతనం ఇవ్వడం వివాదాలకు కారణమవుతోంది. బ్యాంకు బైలాలో ఉద్యోగులకు ప్రోత్సాహకాలు చెల్లించే నిబంధన లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది. దీనిని కొందరు పాలకవర్గ సభ్యులు వ్యతిరేకిస్తుండడంతో ప్రోత్సాహక బహుమానం ఇచ్చిన ప్రతిసారి ఈ అంశం తెరపైకి వస్తోంది. దీంతో మహాజనసభ తీర్మానంతో బ్యాంకు బైలాను సవరణ చేస్తూ తీర్మానం చేసిన పాలకవర్గం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌(ఆర్‌సీఎస్‌)కు పంపింది. దీనిపై ఆర్‌సీఎస్‌ ఒక విచారణాధికారిని నియమించి సహకార చట్టం, బ్యాంకు బైలాలో సవరణ చేస్తూ మహాజనసభ తీర్మానం చేస్తే చెల్లుబాటు అవుతుందా? అనే అంశంపై నివేదిక కోరింది. విచారణాధికారి మహాజనసభకు సహకార చట్టంలో మార్పులు చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. దీంతో రెండేళ్లుగా చెల్లిస్తున్న ఉద్యోగుల ప్రోత్సాహకాల సొమ్ము తిరిగి రాబడతారా? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? పాలకవర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

నిబంధనలకు నీళ్లు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 2004-05 నుంచి 2013 మధ్యకాలంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అనేక తప్పులు వెలుగులోకి వచ్చాయి. 2015లో విచారణకు ఆదేశించగా 2017నాటికి విచారణాధికారి నివేదిక సమర్పించారు. మొత్తం రూ.5.73కోట్ల సొమ్ము దుర్వినియోగమైనట్లు విచారణాధికారి గుర్తించి చర్యలకు సిఫార్సు చేశారు. ఇందులో ఉద్యోగులకు 2009లో రూ.15లక్షలు, 2012లో రూ.41లక్షలు, 2013లో రూ.65లక్షలు ప్రోత్సాహక బహుమతి కింద అందించారు. ఈ మొత్తాన్ని అప్పటి పాలకవర్గం నుంచి రికవరీ చేయడంతోపాటు బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. విచారణ నివేదిక వచ్చే నాటికే 2015 నుంచి 2017 వరకు పనిచేసిన పాలకవర్గం కూడా ప్రోత్సాహక బహుమతి అందించింది. అయితే 2018 నుంచి ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వలేదు. అనంతరం వచ్చిన పాలకవర్గం 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.2కోట్లకుపైగా ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతి అందించింది. మహాజన సభలో తీర్మానాన్ని కొందరు సభ్యులు వ్యతిరేకించినా మెజారిటీ ఆమోదించడంతో చెల్లించారు. ఈ విషయమై బ్యాంకు సీఈవో కృష్ణవేణిని వివరణ కోరగా మహాజనసభ తీర్మానం మేరకు ఉద్యోగులకు చెల్లింపులు చేశామన్నారు.


ఉన్నతాధికారులకు నివేదిక

సహకార బ్యాంకు ఉద్యోగులకు ప్రోత్సాహకాల రూపంలో సొమ్ము చెల్లించడానికి నిబంధనలు అనుమతించవని స్పష్టంగా చెప్పాం. అయిననా బ్యాంకు మహాజనసభ ద్వారా బ్యాంకు బైలాలో మార్పు చేస్తూ తీర్మానం చేసి ఉద్యోగులకు సొమ్ము చెల్లించారు. ఈ విషయాన్ని ఆర్‌సీఎస్‌ ఉన్నతాధికారులకు తెలియజేసి నివేదిక పంపాం. నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినందున ఎప్పటికైనా బాధ్యుల నుంచి రికవరీ తప్పదు. ఇప్పటికే గతంలో చెల్లింపులు చేసిన పాలకవర్గంపై కేసులు కొనసాగుతున్నాయి.

-రాజశేఖర్‌, జిల్లా సహకారశాఖ అధికారి, గుంటూరు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని