logo
Published : 03/12/2021 04:57 IST

ఎవరన్నారు వైకల్యమని?

శారీరక ఇబ్బందులు అధిగమించిన చిన్నారులు
న్యూస్‌టుడే-విజయవాడ క్రీడలు

వీరంతా చిన్నతనం నుంచే వివిధ మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే. మాటలు రాక, కాళ్లు చేతులకు స్పర్శ తెలియక, నడిచేందుకు అడుగులు వేయలేని పరిస్థితి. తమ తల్లిదండ్రులు, శిక్షకుల ప్రోత్సాహంతో విధికి ఎదురీది.. వైకల్యాన్ని జయించారు. ఈత నేర్చుకుని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. నేడు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


మానసిక అనారోగ్యాన్ని జయించి..

త్యనారాయణపురం: సత్యనారాయణపురానికి చెందిన జయరామ్‌, రమా సావిత్రి దంపతులు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరి కుమార్తె ప్రియ(10)కు పుట్టుకతోనే మానసిక అనారోగ్యం ఉందనే విషయాన్ని త్వరగా గుర్తించలేకపోయారు. అయిదేళ్ల వయసులో.. అయోధ్యానగర్‌లోని మానసిక శిక్షణ కేంద్రంలో చేర్పించారు. అక్కడ పలు రకాల తర్ఫీదుతో ప్రస్తుతం బాలిక.. తన పనులు తాను చేసుకోగలుగుతోంది. ఇంట్లో పని చేయడం, తల్లికి సాయపడుతోంది. నృత్యం నేర్చుకుంది. సాధారణ పిల్లలతో సమానంగా నృత్యం చేస్తూ పలు ప్రదర్శనలు ఇచ్చింది. శ్రీరామనవమి, గణేష్‌ మహోత్సవాలు, పాఠశాల వార్షికోత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందుతోంది.


జాతీయ స్థాయిలో రాణిస్తా..

గరంలో నివసించే దేసిబోయిన వెంకటేశ్వర్లు, నాగజ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు. రెండో కుమార్తె మానసకు మూడేళ్ల వయసులోనే మాటలు రావడం లేదని గుర్తించి వైద్యులను సంప్రదించారు. శస్త్రచికిత్స చేసినా ఫలితం ఉండదని, స్పీచ్‌ థెరఫీ ద్వారానే మాటలు వస్తాయని చెప్పారు. కేఎల్‌ రావు పార్కులోని వీఎంసీ స్విమ్మింగ్‌ పూల్‌లో రఫీ పర్యవేక్షణలో ఈత నేర్పించారు. సాధన ప్రారంభించిన ఏడాదిలోనే మానస కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. గాంధీనగర్‌లోని సర్‌ విజ్జి నగరపాలక సంస్థ ఈత కొలనులో ఎం.తులసీచైతన్య పర్యవేక్షణలో సాధన ప్రారంభించింది. కడపలో జరిగిన సౌత్‌ జోన్‌ వింటర్‌ అక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి రెండు రజత, మూడు కాంస్య పతకాలు సాధించింది. కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బదిరుల అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని 100మీ. పరుగులో పసిడి, 200మీ. పరుగులో రజతం, లాంగ్‌జంప్‌లో పసిడి, షాట్‌పుట్‌లో కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. సాధారణ క్రీడాకారులతో పోటీపడి రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు కైవసం చేసుకుంటోంది. కోల్‌కతా, కర్ణాటక, బెల్గాం, రాజ్‌కోట్‌, దిల్లీలో జరిగిన జాతీయ స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించింది. జాతీయ స్థాయి స్విమ్మింగ్‌, అథ్లెటిక్స్‌ పోటీల్లో పసిడి పతకాలు సాధించేందుకు సాధన చేస్తున్నానని మానస చెబుతోంది. ప్రస్తుతం గుణదలలోని మధోన్న బదిరుల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.


పారా లింపిక్స్‌  లక్ష్యం

పుట్టుకతోనే నడుముపై నీటి బుడగతో జన్మించాడు బోయిన మోహిత్‌ (13). వైద్యులు శస్త్రచికిత్స అనివార్యమని చెప్పారు. దేవునిపై భారం వేసి పుట్టిన మూడో రోజే.. ఆపరేషన్‌ చేయించారు తల్లిదండ్రులు సుహాసిని, మన్మధరావు. కుడి కాలు పూర్తిగా, కుడి చేయి కొద్దిగా స్పర్శ లేకపోవడాన్ని గుర్తించారు. వైద్యులు ఏమీ చేయలేమని చెప్పారు. ఐదేళ్లకు కొద్దిగా నడక ప్రారంభించిన మోహిత్‌.. నాలుగు అడుగులు వేసి పడిపోయేవాడు. హైదరాబాద్‌లోని ఓ ఎముకల ఆసుపత్రిలో రోజువారీ సాధనకు చేర్పించారు. నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశించిన మోహిత్‌.. ఓ ఉపాధ్యాయుని సూచనలతో 2017లో గాంధీనగర్‌లోని వీఎంసీ స్విమ్మింగ్‌ పూల్‌లో సాధన చేయడం ప్రారంభించాడు. శిక్షకుడు లక్ష్మణరావు పర్యవేక్షణలో రోజూ రెండు గంటల పాటు సాధన చేసేవాడు. గత ఏడాది విశాఖలో జరిగిన విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 50మీ., 100మీ. ఫ్రీ స్టైల్‌, 50మీ. బ్యాక్‌ స్ట్రోక్‌లో పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడు. అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మూడు పసిడి పతకాలు సాధించాడు. రాష్ట్ర జట్టుకు ఎంపికై బెంగళూరులో జరిగిన జాతీయ పోటీల్లో ఎస్‌-7 కేటగిరీలో 100మీ. ఫ్రీ స్టైల్‌లో పసిడి, 50మీ. ఫ్రీ స్టైల్‌, 50మీ. బ్యాక్‌ స్ట్రోక్‌లో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న మోహిత్‌.. అంతర్జాతీయ పారా స్విమ్మింగ్‌లో రాణించి పారాలింపిక్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.


తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

గరంలోని శివ, భారతి దంపతుల ముగ్గురు సంతానంలో గొలగాని జితేంద్ర (13) రెండో కుమారుడు. చిన్నప్పటి నుంచి తనకు ఏది అవసరమైనా చెప్పలేని పరిస్థితి. బాలుడికి ఈత నేర్పిస్తే మానసిక స్థితి మెరుగుపడుతుందని సైకాలజిస్టు డాక్టర్‌ కృష్ణ కుమారి గుర్తించారు. శారీరక శ్రమ ద్వారా మానసిక వికాసం కలుగుతుందని ఈత సాధనకు పంపారు. జితేంద్ర రెండేళ్లకు నిలబడి, నాలుగు అడుగులు వేసి పడిపోయాడు. తల్లిదండ్రులకు కొంత ఉపశమనం కలిగింది. తండ్రి దగ్గరే ఉంటూ.. పరుగులు తీయడం సాధన చేయిస్తున్నారు. గత ఏడాది విశాఖలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో జితేంద్ర పాల్గొని రాణించాడు. జాతీయ పారా ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించినా.. కొవిడ్‌ కారణంగా రద్దయ్యాయి. గాంధీనగర్‌లోని సర్‌ విజ్జి ఈత కొలను మరమ్మతుల కారణంగా మూసివేయడంతో కృష్ణా నదిలో సాధన కొనగించాడు. అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 50మీ. ఫ్రీ స్టైల్‌లో పసిడి పతకం సాధించి, రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. బెంగళూరులో జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఎస్‌-14 కేటగిరీలో 200మీ. ఫ్రీ స్టైల్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. జితేంద్ర తన శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం, తన పనులు తాను చేసుకోవడం అలవరచుకోవాలనే దిశగా ప్రస్తుతం సాధన కొనసాగిస్తున్నాడు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని