logo
Updated : 05 Dec 2021 04:58 IST

దుర్గగుడిలో అనధికార విక్రయాలు

విచ్చలవిడిగా పెరిగిపోతున్న హాకర్లు
కొంతమంది సిబ్బంది సహకారం
ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లేలా చర్యలు
అమరావతి, న్యూస్‌టుడే

విజయవాడ దుర్గగుడి ఆదాయానికి గండి కొట్టి.. సొంత జేబులు నింపుకోవడంలో కొంతమంది సిబ్బంది ఎప్పుడూ ముందుంటారు. తాజాగా దుర్గగుడి ప్రాంగణంలో సమోసాలు, ఐస్‌లు, రంగు తాళ్లను విక్రయించే హాకర్లు పెరిగిపోయారు. పవిత్రమైన ఆలయ పరిసర ప్రాంతాల్లో.. అదికూడా అమ్మవారి ప్రసాదం విక్రయించే కౌంటర్లకు ఎదురుగా సమోసాలు, పుల్ల ఐస్‌లు అమ్ముతున్నారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గగుడికి ఏటా కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది భక్తులు వస్తుంటారు. ఏటా రూ.వంద కోట్లకు పైనే ఆదాయం వస్తోంది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన దుర్గమ్మ ఆలయ పరిసరాలను చాలా పవిత్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ.. ఐస్‌.. ఐస్‌.. సమోసా.. ఎర్రతాళ్లు.. నల్ల తాళ్లు.. దిష్టిపూసలు.. అంటూ ఏదో జాతరలో ఉండే పరిస్థితి.. ఆలయ పరిసర ప్రాంతాల్లో నెలకొనడం ఇబ్బందికర పరిణామం.

ఆలయ పరిసరాల్లో అనధికారిక హాకర్లు

దుర్గగుడిలో ఇలాంటి అనధికార హాకర్ల గొడవ గతంలో చాలా ఎక్కువ ఉండేది. వీరి నుంచి దుర్గగుడికి చెందిన సూపరింటెండెంట్‌ స్థాయి అధికారులు, ఏఈవోలకు నెలవారీ మామూళ్లు వస్తుండడంతో ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఘాట్‌రోడ్డులో దుకాణాలతో సహా అన్నింటినీ తొలగించిన తర్వాత.. పూర్తిగా హాకర్లను ఆలయ పరిసరాలు, కనకదుర్గానగర్‌, దుర్గాఘాట్‌ పరిసర ప్రాంతాల్లో లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ప్రస్తుతం మళ్లీ అనధికార హాకర్ల గోల మొదలైంది. సమోసాలు, పుల్ల ఐస్‌లు లాంటి వాటిని దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో విక్రయించేందుకు ఎలా అనుమతిస్తున్నారనేది.. ప్రశ్నార్థకంగా మారింది. మంచినీళ్ల బాటిళ్లు, కూల్‌డ్రింక్‌లు లాంటి వాటికి.. దుర్గగుడి అధికారులు అనుమతి ఇస్తుండగా.. మిగతావి ఎక్కువ శాతం అనధికారికంగానే పుట్టుకొస్తున్నాయి. నెలవారీ రూ.లక్షల్లో ఆదాయం దండుకుంటుండడంతోనే ఏళ్ల తరబడి వీటికి వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా మహామండపానికి వెళ్లే మార్గంలోనికి సైతం వీటిని అనుమతించడమేంటో అధికారులకే తెలియాలి. ఒక వైపు ఇలాంటి చిల్లర దుకాణాలుండగా.. మరోవైపు అమ్మవారి ప్రసాదాలను విక్రయించే కౌంటర్లు ఉండడంతో.. భక్తుల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


అల్పాహారానికి ఇబ్బంది..

దుర్గగుడికి నిత్యం వేల సంఖ్యలో తెల్లవారుజాము నుంచే తరలివచ్చే భక్తులకు అల్పాహారం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా దొరకడం లేదు. తిరుపతి లాంటి ఆలయాల్లో దేవస్థానం ఆధ్వర్యంలోనే భక్తుల కోసం క్యాంటీన్లు నెలకొల్పారు. ఇక్కడా ఆలయం ఆధ్వర్యంలో క్యాంటీన్‌ను నెలకొల్పి, భక్తులకు ఎలాంటి ఆహారం విక్రయించాలనే సూచనలను చేయొచ్చు. దానివల్ల ఆలయానికి ఆదాయంతో పవిత్రతకు భంగం కలగకుండా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో కూర్చుని సమోసాలను కొనుక్కుని తినాల్సిన పరిస్థితి భక్తులకు ఉంటోందిప్పుడు. ఇంద్రకీలాద్రి చైనా వాల్‌ను ఆనుకుని కూడా హాకర్లు పెద్దసంఖ్యలో పుట్టుకొచ్చారు. వీరికి స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల అండదండలున్నాయి. నెలవారీ మామూళ్లను చోటామోటా నాయకులు దండుకుంటున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని