logo

Benz circle: మళ్లీ మొదటికి.. వికటిస్తున్న కొత్త ప్రయోగం!

పెద్దగా రద్దీ లేదు.. సంక్రాంతి సెలవులతో విద్యా సంస్థలు మూతపడ్డాయి.. వాహనాల సందడి అంతంతమాత్రమే. వీవీఐపీల రాకపోకలు లేవు.. అయినా బెంజి సర్కిల్‌లో అన్ని వైపులా విపరీతమైన ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. రెండు వంతెనల నిర్మాణంతో ట్రాఫిక్‌

Updated : 14 Jan 2022 14:23 IST

సమస్యాత్మకంగా మారిన బెంజి సర్కిల్‌

మహాత్మాగాంధీ రోడ్డులో నిలిచిన ట్రాఫిక్‌

ఈనాడు, అమరావతి: పెద్దగా రద్దీ లేదు.. సంక్రాంతి సెలవులతో విద్యా సంస్థలు మూతపడ్డాయి.. వాహనాల సందడి అంతంతమాత్రమే. వీవీఐపీల రాకపోకలు లేవు.. అయినా బెంజి సర్కిల్‌లో అన్ని వైపులా విపరీతమైన ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. రెండు వంతెనల నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్య ఈ కూడలిలో చాలా వరకు పరిష్కారమైంది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో.. పోలీసులు తీసుకున్న ఒక్క నిర్ణయంతో మళ్లీ మొదటికి వచ్చింది. నగరంలో కీలక కూడలి బెంజి సర్కిల్‌. నడిబొడ్డున ఉండే దీనిని దాటాలంటే ఒకప్పుడు ప్రయాస పడాల్సి వచ్చేది. రెండు నెలల నుంచి ఇబ్బందులు తప్పాయి. పెద్దగా నిరీక్షించే సమయం లేకుండానే వాహనాలు కదులుతున్నాయి. బుధవారం నుంచి ఈ పరిస్థితి మారింది. పాత సర్కిల్‌ను తలపిస్తోంది. గురువారం నగరవాసులు నరకం చవిచూశారు.

నరకం కనిపిస్తోంది
ఈ నిర్ణయం నగరవాసుల సహనానికి పరీక్షగా మారింది. కూడలికి అటు నుంచి ఇటుకి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొత్త విధానం వల్ల దాటాలంటే నిరీక్షణ సమయం 20 నిముషాల వరకు ఉంటోంది. పటమట వైపు హైస్కూల్‌ రోడ్డు వరకు ఆగిపోతున్నాయి. బస్టాండు వైపు.. డీవీ మ్యానర్‌ వరకు నిలిచిపోతున్నాయి. జాతీయ రహదారిపై గుంటూరు వైపు.. స్క్యూ వంతెన వరకు, రామవరప్పాడు వైపు రమేష్‌ జంక్షన్‌ వరకు ఆగిపోతున్నాయి. బాగా వెనుక ఉన్న వాహనాలు కూడలి వద్దకు వచ్చే సరికి ఆపేస్తున్నారు. దీంతో రద్దీ సమయాలలో అర్ధగంట పైనే పడుతోంది.

పటమట వైపు నుంచి పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వైపు వెళ్లాల్సిన వాహనాలు బెంజి సర్కిల్‌కు వచ్చి ఆగిపోతే మళ్లీ ముందుకు కదలడానికి చాలా సమయం పడుతోంది. వారథి వైపు నుంచి పటమట, రామవరప్పాడు వైపు వెళ్లాలి. నిర్మలా జంక్షన్‌ నుంచి వచ్చే వాటిని, కంట్రోల్‌ రూమ్‌ నుంచి వచ్చేవి వెళ్లే వరకు ఆగాల్సి వస్తోంది. మూడు వైపులా వాహనాలను పంపించిన తర్వాతే.. వదులుతున్నారు. ఇదంతా అయ్యే సరికి వాహనదారులకు సహనం నశిస్తోంది. దీంతో ఆటోల్లో, సిటీ బస్సుల్లో ఉన్న వారు వాటి నుంచి దిగి కాలినడకన కూడలి దాటుతున్నారు.

పాత విధానమే మేలు
కొత్త పద్ధతి వల్ల తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని నగరవాసులు చెబుతున్నారు. సెలవుల సమయాల్లోనే ఇలా ఉంటే.. పనిదినాల్లో అయితే పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. చాంతాడంత ట్రాఫిక్‌ను సరిచేయడానికి పోలీసులు అవస్థలు పడుతున్నారు. అప్పుడు సమస్య మరింత జఠిలంగా మారుతుంది. ఎదురెదురు మార్గాల్లోని వాహనాలను ఒకేసారి వదలడం వల్ల ఎడమ, కుడి వైపు తిరిగే వాటికి ఇబ్బంది అవుతుందని మార్చినట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి వాటికి అదనంగా రెండు నిముషాలు ఇస్తే సరిపోతుంది. దీని వల్ల పెద్దగా సమయం కూడా వృథా కాదు. అలా కాకుండా ఒక వరుసలోని వాటినే పంపించడం వల్ల అన్ని మార్గాల్లోని వారు ఇబ్బంది పడుతున్నారు.

ఏమిటీ నిర్ణయం..?
ఇప్పటి వరకు.. నాలుగు వైపులా ఉండే వాహనాల్లో, వ్యతిరేక దిశలో ఉండే రెండు మార్గాల్లో ఒకేసారి ట్రాఫిక్‌ను వదిలే వారు. దీంతో పాటు ఒకవైపు నుంచి ఇంకో రోడ్డులోకి వెళ్లడానికి కొంత సమయం ఇస్తుండే వారు. దీని వల్ల పెద్దగా ఇబ్బందులు లేవు. వంతెనలు అందుబాటులోకి రావడంతో భారీ వాహనాలు పైనుంచే పోతున్నాయి. ఫలితంగా రెండు నిముషాలు కూడా ఆగే అవసరం కూడా ఉండడం లేదు. మెరుగైన విధానం పేరుతో కొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు. కేవలం ఒక్క మార్గంలోనే వాహనాలను వదులుతున్నారు. ఒకేసారి ఒక వరుసే కదులుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని