Crime News: చెడ్డీ గ్యాంగ్ కోసం కొనసాగుతున్నవేట
ఇంకా పట్టుపడని సభ్యుల కోసం అన్వేషణ
మధ్యప్రదేశ్, గుజరాత్‌లో రెండు ప్రత్యేక బృందాలు
ఈనాడు, అమరావతి
చెడ్డీ గ్యాంగ్ (పాతచిత్రం)
ఇంకా పట్టుబడని చెడ్డీ గ్యాంగ్ సభ్యుల కోసం ముమ్మరంగా అన్వేషణ సాగుతోంది. విజయవాడ పోలీసులు మిగిలిన వారి కోసం రెండు రాష్ట్రాల్లో వేట కొనసాగిస్తున్నారు. గతేడాది ఆఖర్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరుస చోరీలతో చెడ్డీ గ్యాంగ్ హడలెత్తించింది. దీంతో రెండు జిల్లాల వాసుల్ని కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ ముఠా. ఆ తర్వాత పోలీసుల నిఘా పెరగడంతో తిరిగి గుజరాత్ వెళ్లిపోయారు. విజయవాడ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు గుజరాత్ రాష్ట్రం వెళ్లి అక్కడ ముగ్గురిని అరెస్టు చేయగలిగారు. మిగిలిన ఏడుగురు తప్పించుకున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామం, మధ్యప్రదేశ్‌లోని జుబువాకు చెందిన పది మంది దొంగలు రెండు ముఠాలుగా విడిపోయి తొమ్మిది రోజుల వ్యవధిలో ఐదు చోరీలకు పాల్పడ్డారు. గతేడాది నవంబరు 29న తెల్లవారుజామున విజయవాడలోని చిట్టినగర్‌లో, డిసెంబరు 2న నగర శివారు గుంటుపల్లి, 3న గుంటూరు జిల్లా తాడేపల్లి, 4న ఇదే మండలం కుంచనపల్లి, 7న విజయవాడ శివారు పెనమలూరు మండలం పోరంకిలో చోరీలు చేశారు. అనంతరం డిసెంబరు 4న ఓ ముఠా, 8న మరో ముఠా గుజరాత్ వెళ్లిపోయింది.
విజయవాడ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు గుజరాత్ వెళ్లి చోరీ చేసిన సొత్తుతో సహా మడియా కాంజీ మేడా, సక్ర మండోడ్, కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబువాలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.20వేలు నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గుజరాత్‌లోని వీరు నివసించే గ్రామాలకు ఆనుకుని అడవి ఉంది. ఇది వారికి అనువుగా మారింది. పోలీసుల రాక గురించి సమాచారం అందగానే దట్టమైన అడవుల్లోకి పారిపోతున్నారు.
గుజరాత్‌లో గత నెలలో స్థానిక సంస్థలు ముగిశాయి. దాహోద్ ప్రాంతంతో ఎన్నికల అనంతర హింసలో జంట హత్యలు జరిగాయి. ఇందులో ప్రధాన నిందితుడు సురేష్. ఇతను చెడ్డీ గ్యాంగులోని కీలక వ్యక్తి. స్థానిక పోలీసులు కూడా అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. మిగిలిన వారి జాడ కూడా లేదు. పొరుగునే మధ్యప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ఉన్నందున ఆ రాష్ట్రంలోకి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. దాహోద్ ప్రాంతంలోని ఓ తెగకు చెందిన చాలా కుటుంబాలకు చోరీలే ప్రధాన వృత్తి. అడపాదడపా మాత్రమే స్వస్థలాలకు వస్తుంటారు. దీంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారుతోంది. అయినా దాహోద్ జిల్లా పోలీసులతో కలిసి సమన్వయంగా ముందుకు సాగుతూ అన్వేషణ కొనసాగిస్తున్నారు. మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.