logo

ఫ్లాటు అమ్మకుండా మోసం.. మహిళకు ఏడాది జైలు

ఫ్లాటును అమ్మడానికి అడ్వాన్స్‌ తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయకుండా వేరే వారికి రిజిస్ట్రేషన్‌ చేసి మోసం చేసిన కేసులో నిందితురాలికి ఏడాది జైలు, రూ.వెయ్యి జరిమానా

Published : 20 Jan 2022 03:15 IST

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఫ్లాటును అమ్మడానికి అడ్వాన్స్‌ తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయకుండా వేరే వారికి రిజిస్ట్రేషన్‌ చేసి మోసం చేసిన కేసులో నిందితురాలికి ఏడాది జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం న్యాయమూర్తి టాటా వెంకట శివ సూర్య ప్రకాష్‌ బుధవారం తీర్పు చెప్పారు. మాచవరం ప్రాంతానికి చెందిన బాధితురాలు అరవపల్లి లక్ష్మీకుమారికి ఒంగోలు టౌన్‌ రాజీవ్‌నగర్‌కు చెందిన నిందితురాలు అంజనీ శైలజకు గతంలో పరిచయముంది. నిందితురాలు అంజనీ శైలజకు ఒంగోలు టౌన్‌లో ఓ ఫ్లాట్‌ ఉంది. దీనిని బాధితురాలికి అమ్ముతానని మొత్తం రూ.22లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో 2011 ఏప్రిల్‌ 16న రూ.4.65 లక్షలు అడ్వాన్స్‌గా మరో రూ.7.35 లక్షలు పలు దఫాలుగా మొత్తం రూ.12 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని 2011 డిసెంబర్‌ 31న ఇచ్చిన అనంతరం రిజిస్ట్రేన్‌ చేసేటట్లు ఒప్పంద పత్రంలో రాసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నిసార్లు బాధితురాలు నిందితురాలిని అడగ్గా ఫ్లాటును వారికి రిజిస్ట్రేషన్‌ చేయకుండా కాలయాపన చేసింది. అనుమానం వచ్చిన బాధితురాలు సదరు ఫ్లాటు గురించి విచారించగా గతంలోనే ఓ వ్యక్తికి దానిని రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో నిందితురాలు అంజనీ శైలజపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో ఐదుగురు సాక్షుల సాక్ష్యాన్ని న్యాయస్థానం ఏపీపీ పద్మావతి లక్ష్మీ న్యాయస్థానంలో నమోదు చేయించారు. అనంతరం కేసులో నిందితురాలిపై నేరారోపణ రుజువు కావడంతో ఏడాది జైలు, జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని