logo

అరచేతిలో వైకుంఠం

కోటప్పకొండకు చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణం.. కాలుష్యానికి పూర్తిగా దూరం.. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి నుంచి నిమిషాల వ్యవధిలో ప్రయాణం.. ఎలాంటి అనుమతులు లేకుండా లేఔట్‌

Published : 20 Jan 2022 03:15 IST

మాటల గారడీలతో అనధికార లేఔట్లలో ప్లాట్ల విక్రయాలు

వినుకొండ పట్టణంలోని కారంపూడి రహదారిలో అనధికార లేఔటు

కోటప్పకొండకు చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణం.. కాలుష్యానికి పూర్తిగా దూరం.. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి నుంచి నిమిషాల వ్యవధిలో ప్రయాణం.. ఎలాంటి అనుమతులు లేకుండా లేఔట్‌ వేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కల్పిస్తున్న ప్రచారం ఇదీ..

సూర్యలంక బీచ్‌కు సమీపంలోని రిసార్టులు పక్కనే ప్లాట్లు.. భవిష్యత్తులో పర్యాటకంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది.. పెట్టుబడి పెట్టాలనేకునేవారికి ఇది అద్భుత అవకాశం.. తీర ప్రాంతంలో మరో రియల్‌ సంస్థ ప్రచారం.. ఈ వెంచర్‌కు కూడా ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం.

కాసులే పరమావధిగా కొంతమంది మాటల గారడీలతో సామాన్య జనాన్ని నిలువునా ముంచుతున్నారు. పంట పొలాల్ని ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పట్టణ శివారు ప్రాంతాల్లో భూమికి డిమాండ్‌ పెరగడంతో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని కాసులు కొల్లగొడుతున్నారు.

ఈనాడు, అమరావతి

జిల్లాలో గుంటూరు నగరంతోపాటు మున్సిపల్‌ పట్టణాలు, మండల కేంద్రాల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములను రెవెన్యూశాఖకు పన్ను చెల్లించి వ్యవసాయేతర భూములుగా మార్చుకుంటున్నారు. వీటికి ఆయా పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అధికార పార్టీ నేతల సాయంతో యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చి పని చక్కబెట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు వెళ్లినపుడు అనుమతులు లేవని బోర్డు పెడుతున్నారు. దీనివల్ల సామాన్య జనం అప్పటికే తీవ్రంగా నష్టపోతున్నారు. చిలకలూరిపేట పట్టణానికి సమీపంలో అంటూ పది కిలోమీటర్ల దూరంలో ప్లాట్లు వేసి విక్రయించారు. విజయవాడకు చెందిన వైద్యుడు ఒకరు ప్లాట్ల గురించి వాకబు చేసి అవాక్కయ్యారు. బ్రోచర్‌లో చెప్పినదానికి, వాస్తవానికి ఎంత తేడా అంటూ నిట్టూర్చారు. కొనుగోలు సమయంలో ఇప్పుడే ఇల్లు కట్టుకోం కదా అని అనుమతులు, ఇతరత్రా అంశాలు పరిశీలించకుండానే స్నేహితులు చెప్పారని, ఏజెంట్లు సూచించారని కొనుగోలు చేస్తున్నారు. వీటిని అమ్ముకోవాలన్నా.. ఇల్లు కట్టుకోవాలని ప్లాన్‌కు వెళ్లినా అనుమతులు లేని విషయం తెలిసి పన్నుల భారం మోయలేక సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

600పైగా అనధికార లేఅవుట్‌లు

జిల్లాలోని సీఆర్‌డీఏ పరిధిలో 491 అనధికార లేఅవుట్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, ముప్పాళ్ల, రాజుపాలెం, దాచేపల్లి, పిడుగురాళ్ల, ఈపూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, గురజాల, వినుకొండ, బాపట్ల మండలాల పరిధిలో 133 అక్రమ లేఅవుట్‌లు ఉన్నట్లు గుర్తించారు. మండల కేంద్రాల్లో లెక్కకు మిక్కిలి ఉన్నాయి.

ఇవీ నిబంధనలు

* వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల నిమిత్తం పన్ను చెల్లించాలి. ● లేఔటుకు సంబంధించి ప్రతిపాదనలు ఇస్తే పంచాయతీ తీర్మానం చేసి తాత్కాలిక సాంకేతిక అనుమతుల కోసం టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ)కి పంపిస్తారు.

* తాత్కాలిక సాంకేతిక అనుమతులు వచ్చిన తర్వాత మురుగు కాలువలు, రహదారులు, అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. ● 10శాతం భూమిని సామాజిక అవసరాల కోసం పంచాయతీకి రిజిస్టర్‌ చేయాలి.

* తుది ఆమోదం కోసం పంచాయతీ నుంచి ప్రతిపాదనలు డీటీసీపీకి వెళతాయి. తీర్మానాన్ని ఆమోదించి లేఔట్‌ ప్లాన్‌ (ఎల్‌పీ) నంబరు కేటాయిస్తుంది.

అనుమతి లేనివి కొనుగోలు చేస్తే భారమే

సంబంధిత గ్రామపంచాయతీ లేదా మున్సిపాలిటీకి స్థలం రిజిస్ట్రేషన్‌ విలువలో 14 శాతం సొమ్మును చెల్లించాలి. బెటర్‌మెంట్‌ ఛార్జీలు, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పన్నులు, జరిమానాలు చెల్లించిన తర్వాతే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తారు. ఇంటిప్లాన్‌ ఉంటే తప్ప మిగిలిన అనుమతులు రావు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎల్‌పీ నంబరు ఉన్న వెంచర్లలోనే కొనుగోలు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని