logo

కొవిడ్‌ బారినబడి

‘కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. సంక్రాంతి సెలవుల తర్వాత గత మూడు రోజుల్లోనే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 48మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో

Published : 20 Jan 2022 03:29 IST

మూడు రోజుల్లో 48 మందికి కరోనా

బాధితుల్లో 47 మంది ఉపాధ్యాయులే

పాఠశాలల్లో కనీస నిబంధనలూ లేవు

ఈనాడు, అమరావతి

విజయవాడలోని రాణిగారితోటలోని ప్రాథమిక పాఠశాలలో కనీస దూరం పాటించకుండా

కూర్చున్న చిన్నారులు

‘కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. సంక్రాంతి సెలవుల తర్వాత గత మూడు రోజుల్లోనే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 48మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 47మంది ఉపాధ్యాయులు, ఒకే ఒక్క విద్యార్థి ఉన్నారు. బుధవారం ఒక్కరోజే 31 కేసులు బయటపడ్డాయి. వీరిలో 30మంది గురువులున్నారు. పాఠశాలల్లో కనీస కొవిడ్‌ నిబంధనలు కూడా పాటించకపోవడంతో కేసులు ఎక్కువవుతున్నాయి.’

విజయవాడ సహా చాలా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సరిపడా తరగతి గదులు లేవు. ఉన్నవి కూడా ఇరుకు గదులు కావడంతో ఉన్న వాటిలోనే విద్యార్థులను సర్దుకుని కూర్చోబెడుతున్నారు. ఒక్కో బెంచీకి ఒకరినే కూర్చోబెడతామంటూ అధికారులు ప్రకటిస్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంటోంది. ఒక్కో బెంచికీ ముగ్గురు తక్కువ కాకుండా కూర్చుంటున్నారు. విజయవాడలోని కొన్ని పాఠశాలల్లో ఒక్కో తరగతికి వంద మంది కూడా ఉన్నారు. ఈ పాఠశాలల్లో తరగతి గదులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. ఉన్నత పాఠశాలల కంటే తరగతి గదుల సమస్య ప్రాథమికలో ఎక్కువ ఉంది. కనీసం మరో 200 గదులకు పైనే ఒక్క విజయవాడ నగరంలోనే అవసరం.

కొవిడ్‌ కేసులు ఉద్ధృతంగా నమోదువుతున్నా.. కనీసం నిబంధనలు కూడా పాఠశాలల్లో పాటించడం లేదు. విద్యార్థుల మధ్య భౌతికదూరం అనే మాటే ఎక్కడా కనిపించడం లేదు. మాస్కులు కూడా సరిగా ధరించడం లేదు. శానిటైజర్లు, థర్మల్‌స్కానర్లతో తనిఖీలు ఒక్క పాఠశాలలోనూ అమలు జరగడం లేదు. మధ్యాహ్న భోజనాల సమయంలోనూ విద్యార్థులంతా కలిసే కూర్చుని తింటున్నారు. జనవరి, ఫిబ్రవరిలో కేసులు భారీగా పెరిగేందుకు అవకాశం ఉందంటూ నిపుణుల హెచ్చరికలు వస్తున్నా.. విద్యాశాఖ అధికారులకు మాత్రం పట్టడం లేదు.


ప్రైవేటు పాఠశాలల్లో...

విజయవాడలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను ఆరంభించాయి. మిగతావాళ్లు కూడా అదే ఆలోచనలో ఉన్నప్పటికీ.. ఒకవేళ మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులను ఆరంభిస్తే.. ఫీజుల వసూళ్లకు ఇబ్బంది అవుతుందనే ఆందోళన చాలామంది పాఠశాలల నిర్వాహకుల్లో ఉంది. అందుకే.. మరిన్ని కేసులు పెరిగాక.. నిర్ణయం తీసుకోవచ్చనే ధోరణిలో కొనసాగిస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం సంక్రాంతి తర్వాత బాగా తగ్గింది.


నిర్థరణ పరీక్షలు చేస్తే..

పాఠశాలల్లో వస్తున్న పాజిటివ్‌ కేసుల్లో అధికశాతం మంది ఉపాధ్యాయులే ఉన్నారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించుకుంటుండడంతో పాజిటివ్‌గా తేలుతోంది. విద్యార్థులకు పరీక్షలు చేయకపోవడంతో కేసుల విషయం బయటపడడం లేదు. పాజిటివ్‌లు వచ్చిన పాఠశాలల్లో.. కాంటాక్ట్‌ ఉన్న విద్యార్థులకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహించారు. ఆగిరిపల్లి మండలంలోని ఈదులగూడెం జిల్లాపరిషత్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో తాజాగా 65మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు. ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు మాత్రం జిల్లాలో గత మూడు రోజుల్లో ఒక్క విద్యార్థికి మాత్రమే బంటుమిల్లి పాఠశాలలో పాజిటివ్‌ వచ్చింది.


ప్రైవేటు కేంద్రాల అధిక వసూళ్లపై..

ప్రభుత్వం నిర్థరించిన ధరల మేరకే కరోనా నిర్థరణ పరీక్షలకు వసూలు చేయాలంటూ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ ఎం.సుహాసిని సూచించారు. అధికంగా వసూళ్లకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. వారిపై వెంటనే చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం ప్రైవేటు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకునే వారికి ఓ నిర్థష్టమైన ధరలు లేకుండా.. పరిస్థితిని బట్టి వసూళ్లు చేస్తున్నారు. ఇళ్లకు వచ్చి నమూనాలు సేకరిస్తే రూ.1200 వసూలు చేస్తున్నారు. ప్రయాణాల కోసం అత్యవసరంగా కావాలంటే రెట్టింపు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం సూచించిన ధరల పట్టికను ప్రతి ప్రైవేటు ల్యాబ్‌ వద్దా కనిపించేలా ఉంచాలని అధికారులు చెబుతున్నా.. చాలాచోట్ల కనిపించడం లేదు.


పరీక్షలకు బారులు

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో నిరీక్షిస్తూ ఇలా..

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు అమాంతం పెరగడంతో కరోనా నిర్థరణ పరీక్ష కేంద్రాల్లో రద్దీ ఎక్కువైంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇందిరాగాంధీ మైదానంలోని పరీక్ష కేంద్రాలకు బుధవారం ఉదయం నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. బుధవారం ఒక్కరోజే ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ఆరు వేల మందికి పైగా పరీక్షలు చేయించుకున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత చాలామందిలో జలుబు, తలనొప్పి, ఒంటినొప్పులు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తుండడం వల్లే పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నట్టు వెల్లడిస్తున్నారు. జిల్లాలో మంగళవారం ఉదయం 10గంటల నుంచి బుధవారం ఉదయం వరకు

జిల్లాలో కొత్తగా 332

పాజిటివ్‌లు వచ్చాయి. ప్రస్తుతం 2545మంది వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 1,23,425మంది వైరస్‌ బారినపడగా.. 1,19,398మంది ఆరోగ్యంగా బయటపడ్డారు. 1482మంది చనిపోయారు. పాజిటివ్‌ కేసుల్లో 60శాతానికి పైగా విజయవాడలోనే ఉంటున్నాయి. ఇటీవల ఈనాడులో వచ్చిన కథనాలపై స్పందించిన అధికారులు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు బుధవారం ప్రకటించారు.

పరీక్ష కేంద్రాలు ఇవీ..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: సింగ్‌నగర్‌, రామలింగేశ్వర్‌నగర్‌ 06, పటమట, బాప్టిస్ట్‌ పాలెం, కొత్తజోజినగర్‌, కృష్ణలంక, లంబాడిపేట, కొత్తరాజరాజేశ్వరిపేట, ప్రకాష్‌నగర్‌.

ప్రత్యేక కేంద్రాలు: తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇందిరాగాంధీమైదానం గేట్‌ నంబరు 06.

సమయాలు: ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని