logo

మంత్రి పదవి నుంచి కొడాలిని బర్తరఫ్‌ చేయాలి

తెలుగు ఖ్యాతిని దేశ, విదేశాల్లో చాటిన ఎన్టీఆర్‌ సొంత గడ్డ గుడివాడ ప్రాంతంలో విదేశీ సంస్కృతితో కూడిన క్యాసినో తదితరాల నిర్వహణతో మన సంప్రదాయాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చేష్టలతో

Published : 23 Jan 2022 03:21 IST

మన సంప్రదాయాలకు మాయని మచ్చ క్యాసినో

తెదేపా నిజ నిర్ధారణ కమిటీ నేతలు

కలెక్టర్‌ను కలిసి బయటకు వస్తున్న తెదేపా నేతలు వర్గ రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు,

కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్య తదితరులు

సబ్‌కలెక్టరేట్‌ : తెలుగు ఖ్యాతిని దేశ, విదేశాల్లో చాటిన ఎన్టీఆర్‌ సొంత గడ్డ గుడివాడ ప్రాంతంలో విదేశీ సంస్కృతితో కూడిన క్యాసినో తదితరాల నిర్వహణతో మన సంప్రదాయాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చేష్టలతో మాయని మచ్చని మిగిల్చారని తెదేపా నిజ నిర్ధారణ కమిటీ నేతలు ధ్వజమెత్తారు. కొడాలిని తక్షణమే మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గుడివాడ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని, క్యాసినో, జూదం నిర్వాహకులను అరెస్టు చేయాలని కోరుతూ.. తెదేపా నిజ నిర్ధారణ బృందం శనివారం సాయంత్రం కలెక్టర్‌ జె.నివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. మంత్రి కొడాలి ఓ సంఘ విద్రోహక శక్తి.. గుడివాడలో ఏం జరిగిందనే విషయమై తాము పరిశీలనకు వెళ్లి, పోలీసు రక్షణ కావాలని కోరాం, తీరా తమనే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. డీఐజీ స్థాయి అధికారి కూడా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. మంత్రి కొడాలి నాని సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్‌ దగ్గర ఉండి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కారు అద్దాలను పగుల కొట్టించినట్టు పేర్కొన్నారు. దురాగతం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్టు వివరించారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకుంటానంటూ మంత్రి నాని విసిరిన సవాల్‌ నుంచి ఆయన పారిపోయారని ఆరోపించారు. నిజాలను బయట పెడతాం, న్యాయ స్థానాలను ఆశ్రయించి నిరూపిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. యువతను పెడదోవ పట్టించేలా జూదాలు, మహిళలతో నృత్యాలున్నాయి, దీనిపై ఫిర్యాదు చేయడానికి ఏలూరు వెళితే డీఐజీ అందుబాటులో లేరన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. సముద్రంలోని ఓడల్లో, గోవా, శ్రీలంక వంటి ప్రాంతాల్లో ఉండే క్యాసినో విష సంస్కృతిని గుడివాడ లాంటి పట్టణానికి తెచ్చారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని