logo

72,516 ఓట్ల తొలగింపు

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఆధార్‌ అనుసంధానం చేస్తూనే.. చేర్పులు మార్పులు, చిరునామా మార్పు, కొత్త ఓటర్ల నమోదు బూత్‌ స్థాయిలోనే చేపట్టారు. ఒకే వ్యక్తి ఫొటో రెండుచోట్ల ఉన్నట్లు గుర్తించారు.

Published : 12 Aug 2022 04:47 IST

ఒకే వ్యక్తి ఫొటో రెండుచోట్ల ఉండటమే కారణం

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఆధార్‌ అనుసంధానం చేస్తూనే.. చేర్పులు మార్పులు, చిరునామా మార్పు, కొత్త ఓటర్ల నమోదు బూత్‌ స్థాయిలోనే చేపట్టారు. ఒకే వ్యక్తి ఫొటో రెండుచోట్ల ఉన్నట్లు గుర్తించారు. ఫొటో సిమిలర్‌ ఎంట్రీ (పీఎస్‌సీ) అనే సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తింపు ప్రక్రియ సాగుతోంది. అనంత జిల్లా వ్యాప్తంగా రాప్తాడు సహా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 72,516 ఓట్లను తొలగించారు. ఇప్పటిదాకా 3.18 లక్షల ఓట్లను నిశితంగా పరిశీలించారు. ఇందులో ఒకే వ్యక్తి ఫొటోతో రెండుచోట్ల ఓట్లు ఉన్నట్లు 1,58,397 మందిని గుర్తించారు. వీరందరికీ నోటీసులు జారీ చేశారు. ఒకేసారి 72,516 మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు. మరో 74,441 మంది వివరాలు పక్కాగా ఉండటంతో అలానే ఉంచారు. మిగిలిన 11,440 మంది ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. 9 వేల దాకా ఫొటోలు మ్యాచ్‌ కాలేదు.

నగరంలోనే అధికం
అనంతపురం జిల్లాలో 19.71 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాప్తాడు సహా ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. పురుషులు 9.83 లక్షలు, స్త్రీలు 9.88 లక్షలు, ఇతరులు 221 చొప్పున ఓటర్లు ఉన్నారు. 1,58,397 మందిలో అత్యధికంగా అనంత నగరంలోనే 21,689 మందిని తొలగించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని రాప్తాడు, శింగనమల, ఉరవకొండ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఓట్లు రెండు చోట్ల ఉన్నట్లు తేల్చారు. ఆ తర్వాత స్థానంలో రాప్తాడు ఉంది.

ఆధార్‌ అనుసంధానంపై దృష్టి
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఓటర్ల జాబితాతో ఆధార్‌ అనుసంధానం జరుగుతోంది. ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. బుధవారం రాత్రి వరకు 96వేల మంది ఓటర్లకు చెందిన ఆధార్‌ అనుసంధానం పూర్తయినట్లు కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం డీటీ భాస్కర్‌ తెలిపారు. ఆధార్‌ అనుసంధానం ఐచ్ఛికమే అని చెబుతున్నారు. ఫారం-6బీలో ఆధార్‌ సంఖ్య నమోదు చేయడం ఇష్టం లేకపోతే.. నిర్దేశిత పదకొండు అంశాల్లో ఏదో ఒకటి నమోదు చేయాలి. ఏది నమోదు చేసినా ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం ఉన్నవే ఉండటం విశేషం. పాన్‌, బ్యాంకు ఖాతా, ఉపాధి సంఖ్య, డ్రైవింగ్‌ లైసెన్సు, బీమా సంఖ్య, పాసుపోర్టు ఇలా 11 అంశాలకు సంబంధించి నమోదు చేస్తున్నారు.

వాలంటీర్లపై ఫిర్యాదులు
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో గ్రామ/వార్డు వాలంటీర్లు పాల్గొనవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల ఫిర్యాదులు అందాయి. తాజాగా ధర్మవరం పట్టణంలో బీఎల్‌ఓల స్థానంలో వాలంటీర్లు పని చేస్తున్నారంటూ అక్కడి ఆర్డీఓకు ఫిర్యాదు అందింది. అయినా వెనక్కి తగ్గడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని