logo
Published : 13 Aug 2022 04:41 IST

అక్షరమే.. ఆయుధమై!

స్వాతంత్య్ర పోరాటంలో పత్రికల పాత్ర

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయి. జాతీయ నాయకుల ప్రసంగాలు, వారి సిద్ధాంతాలు దేశం నలుమూలలా తీసుకెళ్లడంలో వారధిగా పనిచేశాయి. బహిరంగ సభలు, సమావేశాలను బ్రిటీషు సైన్యం అణచివేసిన సందర్భాల్లో వాటి ద్వారానే తమ సందేశాలను అందించారు. ఉద్యమం వైపు సామాన్య ప్రజల్ని కార్యోన్ముఖులను చేయడంలో జర్నలిస్టుల కృషి ఎంతగానో ఉంది. ఉద్యమ నాయకుల్లో చాలామంది సొంతంగా పత్రికలను నడిపారు. అనంతపురం జిల్లాలో పి.ఆనందచార్యులు, పి.కేశవపిళ్లై, పప్పూరు రామాచార్యులు, విద్వాన్‌ విశ్వం, కల్లూరు సుబ్బారావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వంటి స్వాతంత్య్ర సమరయోధులు పత్రికలు నిర్వహించారు.

తాడిపత్రి నుంచి ‘మాతృసేవ’
1923లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు ‘మాతృసేవ’ అనే పత్రికను తాడిపత్రి నుంచి వెలువరించారు. జిల్లాలో చాలాకాలం నడిచిన పత్రికల్లో ఇదీ ఒకటి. ఇది స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించింది. అక్షరాస్యత ఉద్యమానికి దోహదపడింది. 1923లో ఇల్లూరు నుంచి కె.సుబ్రహ్మణ్యశర్మ ‘పినాకిని’ అనే వారపత్రికను ప్రారంభించారు. దీనికి రామాచార్యులు సంపాదకుడిగా వ్యవహరించారు.

పాలకుల దాడి
ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపిస్తున్న పత్రికలపై బ్రిటీషు పాలకులు నిరంకుశంగా ప్రవర్తించారు. పాత్రికేయులకు హెచ్చరికలు, జైలుకు పంపడం, ప్రకటనలు నిలిపివేయడం వంటివి చేశారు. దీంతో నీలం సంజీవరెడ్డి, విద్వాన్‌విశ్వం, టి.నాగిరెడ్డి, నీలం రాజశేఖర్‌రెడ్డి, సదాశివన్‌, నల్లప్ప తదితరులు గ్రూపులుగా ఏర్పడి ‘ఆకాశవాణి’ అనే రహస్య పత్రికను నిర్వహించారు. ఓ ఆంగ్లేయుడు మద్రాసులో ఇద్దరు భారతీయుల్ని కాల్చిచంపిన సందర్భంలో 26.3.1908న స్వరాజ్య పత్రికలో ‘విపరీతబుద్ధి’ అనే శీర్షికతో హరిసర్వోత్తమరావు వార్త రాయగా.. అరెస్టు చేశారు. జలియన్‌వాలాబాగ్‌ ఘటనను ఖండిస్తూ ‘నేషనలిస్టు’ అనే ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసాన్ని నిషేధించారు. ‘శ్రీసాధన’లో వ్యతిరేక వార్తలు రాసినందుకు రామాచార్యులును హెచ్చరించారు.


శ్రీసాధనతో ఊపిరి
సహచరులతో కొన్ని అభిప్రాయభేదాల కారణంగా పినాకిని పత్రిక నుంచి రామాచార్యులు బయటకు వచ్చారు. తర్వాత 1926లో ‘శ్రీసాధన’ అనే వారపత్రికను ప్రారంభించారు. 1932లో సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా ఇది కొంతకాలం ఆగిపోయింది. 1934 ఆగస్టు 18న పునఃప్రారంభించారు. 1940 మార్చిలో శ్రీసాధన పత్రిక, సాధన ముద్రణాలయాన్ని లిమిటెడ్‌ కంపెనీగా మార్చారు. దీనికి డైరెక్టర్లుగా రామాచార్యులు, కల్లూరు సుబ్బారావు, కె.ఎస్‌.రాఘవాచార్యులు పనిచేశారు. పత్రికలో ఎక్కువగా చర్చలు, తీర్మానాలు, రాజకీయ వృత్తాంతాలు ప్రచురించేవారు. సహాయ నిరాకరణోద్యమం, మద్యపాన నిషేధం, హరిజనోద్ధరణ వంటి వాటిని వార్తల ద్వారా జనాల్లోకి తీసుకెళ్లారు.

* 1923-38 మధ్యలో జిల్లాకు చెందిన పత్తిపాటి రంగన్ననాయుడు, మిడతల చెన్నబసప్ప, కల్లూరు సుబ్బారావు, ఆత్మరామప్ప, శ్రీమతి వి.సుందరమ్మ వంటివారు ‘ది తుంగభద్ర ప్రాజెక్టు’, లోకమాన్య ‘భారత మహిళ’ లాంటి వారపత్రికలను నడిపారు. మూల నారాయణస్వామి విజయవాణి అనే పత్రికను కొంతకాలం నడిపారు. ఇందులో గొట్టిపాటి సుబ్బారావు పలు వ్యాసాలు రాశారు. జిల్లాలో జస్టిస్‌ పార్టీ 1936-38 మధ్య ‘రాయలనాడు’ అనే వారపత్రికను నడిపించింది.

వందేళ్ల కిందటే..
1915-18 మధ్యలో అనంతపురంలో పప్పూరు రామాచార్యులు నాయకత్వంలో విద్యార్థుల బృందం ఒకటి ‘వదరబోతు’ అనే పత్రికను ప్రారంభించారు. ఇందులో ప్రచురితమైన కొన్ని వ్యాసాలు తర్వాత కాలంలో పాఠ్యాంశాలుగా చేర్చారు. విద్యార్థి దశలోనే రామాచార్యులు కలచవీడు వెంకటరమణాచార్యులతో కలిసి ‘వ్యాసమంజూష’ అనే పత్రికను అనంతపురం నుంచి నడిపేవారు. ఇదే కాలంలో ‘శ్రీశంకర విజయం’ పేరుతో మాసపత్రిక ఉండేది. సనప గ్రామానికి చెందిన పేరయ్య ‘బాలభారతి’ పేరుతో నడిపారు. పేరయ్య బాలకవిగా ప్రసిద్ధికెక్కారు.


పురం వాసుల ప్రాణత్యాగం

చౌళూరులోని అమరవీరుల స్మారక స్తూపం భాస్కర్‌ కేశవయ్య

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ప్రజల్లో చైతన్యం, స్ఫూర్తి నింపేందుకు ఊరూరా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని అప్పటి జాతీయ నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా 1938 ఏప్రిల్‌ 25న ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరు తాలూకాలోని విదురాశ్వత్తం గ్రామంలో భారీ సభ ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాల నుంచి వేలసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అక్కడికి 2 కిలోమీటరు దూరంలో హిందూపురం మండలం నుంచి ప్రజలు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బ్రిటీష్‌ పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి 90 రౌండ్లు కాల్పులు జరిపారు. తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో 32 మంది మృతి చెందారు. అందులో చౌళూరుకు చెందిన సూలుగిత్తి సంజీవప్ప, సూలుగిత్తి నరసప్ప, కారూడిపల్లికి చెందిన నాగమల్లారెడ్డి, కురుబ మల్లేశప్ప మృతి చెందారు.


పదునైన రచనలతో పోరు

స్వాతంత్య్ర ఉద్యమ నిర్వహణకు ‘ఆశ్రమం’లో ప్రత్యేక తర్ఫీదు పొందిన వ్యక్తి భాస్కర్‌ కేశవయ్య. ఈయన స్వగ్రామం అనంతపురం. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంతో జాతీయోద్యమంలో అడుగు పెట్టారు. బ్రిటీష్‌ పోలీసుల లాఠీదెబ్బలకు ఆయన కుడి చేతి ఉంగరపు వేలు విరిగింది. ఓవైపు పోరాటం చేస్తూనే అనంత సాయినగర్‌లో శ్రీకేశవ ఎయిడెడ్‌ పాఠశాలను స్థాపించారు. శిశువిద్య, భారతి వంటి మాసపత్రికల్లో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి. స్వాతంత్య్రం తర్వాత ఎయిడెడ్‌ పాఠశాలను 1969లో ప్రభుత్వంలో విలీనం చేశారు. రాష్ట్రంలోనే విలీనం చేసిన తొలి పాఠశాల ఇదే కావడం విశేషం.

- జిల్లా సచివాలయం


 

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని