logo

అందని బిల్లులు... పునాదుల్లోనే పనులు!

తాడిపత్రి పట్టణంలోని వైద్యవిధాన ఆసుపత్రిలో భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Updated : 02 Dec 2022 07:38 IST

వైద్యసేవలకు తీవ్ర ఆటంకం
తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో దయనీయం

పిల్లర్ల దశలోననే వైద్య విధాన ఆసుపత్రి నూతన భవనం

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి పట్టణంలోని వైద్యవిధాన ఆసుపత్రిలో భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ ఆసుపత్రికి నిత్యం వందల మంది పేద ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. సరైన వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అన్నీ సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వంద పడకల సామర్థ్యంతో నూతన భవనాలను మంజూరు చేసింది. గడువు సమీపిస్తున్నా.. బిల్లుల్లో జాప్యం కారణంగా పనులు పునాదులు కూడా దాటలేదు. ఫలితంగా రోగులు వైద్యం కోసం గంటల తరబడి ఎండలో, వానలో నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది.

తాడిపత్రి పురపాలికలోని వైద్య విధాన ఆరోగ్య కేంద్రానికి తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని 5 మండలాలు, కర్నూలు, కడప జిల్లాల్లోని పరివాహక ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. ఇక్కడ రోజూ 500 నుంచి 600 వరకు ఓపీ నమోదవుతుంది. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. వైద్యం అందించేందుకు గదులు లేకపోవడంతో రోగులను అనంతపురం, స్థానిక ప్రైవేటు ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 2020 సంవత్సరంలో నాడు-నేడు కింద రూ.17కోట్లతో జీ ప్లస్‌-3 భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగానే గతేడాది ప్రారంభంలో పాత భవనాలను కూల్చేశారు. గత ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. 2023 మార్చికి నిర్మాణం పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. ప్రస్తుతం పునాదుల దశలో ఉంది. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు పనులు చేయలేదని తెలిసింది. ప్రభుత్వం నుంచి రూ.5.6కోట్లు నిధులు మంజూరయ్యాయని, పనులు వేగవంతం చేస్తామని అధికారులు చెబుతున్నారు.

రేకుల షెడ్లే దిక్కు..

ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇక్కడ పాత భవనాలను కూల్చిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. రేకుల షెడ్లు, ఆరుబయట కుర్చీలు వేసి చేతులు దులుపుకొన్నారు. కనీసం నీడ కల్పించలేదు. ఆసుపత్రిలో 16 మంది వైద్యులు, 24 మంది నర్సులు ఉన్నారు. వీరు అరకొర వసతుల మధ్య రోగులకు పరీక్షలు చేయాల్సిన పరిస్థితి. రోగులు, వారి సహాయకులు ఎండలో నిల్చొని ఓపీ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని రోగులు కోరుతున్నారు.

ఎండలో ఇబ్బందులు పడ్డా

మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చాను. ఎండలో దాదాపు అరగంట సేపు నిల్చుని వైద్యం చేయించుకొని, మందులు తీసుకున్నా. నూతన భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలి. సాలమ్మ, అంబేడ్కర్‌నగర్‌

వేగవంతం చేస్తాం

వైద్యవిధాన ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని గుత్తేదారులకు సూచిస్తాం. నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు సాగలేదు. ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. రోగులకు ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. గ్రౌండ్‌ఫ్లోర్‌ నిర్మాణం పూర్తి చేసి తాత్కాలిక సౌకర్యాలు కల్పిస్తాం. త్వరితగతిన పనులు పూర్తి చేసి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. రాజగోపాల్‌, ఏపీఎంఎంఐడీసీ ఈఈపిల్లర్ల దశలోనే వైద్య విధాన ఆసుపత్రి నూతన భవనం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని