logo

నిధుల్లేని కార్పొరేషన్లతో ‘ఇదేం ఖర్మ బీసీలకు’

వైకాపా ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని,  ఒక్క దానికీ రూపాయి కూడా ఇవ్వకుండా బీసీలను ఆర్థికంగా అణిచివేసిందని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించారు.

Updated : 08 Dec 2022 04:57 IST

ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వస్తున్న తెదేపా నాయకులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని,  ఒక్క దానికీ రూపాయి కూడా ఇవ్వకుండా బీసీలను ఆర్థికంగా అణిచివేసిందని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించారు. ‘జగన్‌ పాలనలో ఇదేం ఖర్మ బీసీలకు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని గణేష్‌ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడ నిరసన తెలిపి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీకే, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జడ్పీ మాజీ ఛైర్మన్‌ నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర నాయకురాలు సబిత మాట్లాడుతూ వైకాపా మూడున్నరేళ్లలో బీసీకు ఒరిగిందేమీ లేదని, ఓటు బ్యాంకు కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేశారే తప్ప చిల్లిగవ్వ ఇవ్వలేదని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయంలో బీసీల సంక్షేమానికి ప్రవేశపెట్టిన అనేక పథకాలను వైకాపా రద్దు చేసిందని మండిపడ్డారు. పాలన వికేంద్రీకరణతో ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. బీసీ నాయకులు గట్టిగా మాట్లాడితే అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా జగన్‌ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ గర్జన పేరుతో  మభ్య పెట్టాలని చూస్తున్నారని, బీసీలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చేతగాని ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 2024 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్వో భాగ్యరేఖకు వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని