logo

YSRCP: తమ్ముడి అండ.. సోదరుల దందా!

రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ వైకాపా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated : 29 Jan 2023 09:40 IST

 రాప్తాడులో మితిమీరుతున్న భూఅక్రమాలు

 జోరుగా ఎర్రమట్టి, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ వైకాపా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోదరులను ముందు పెట్టి అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ప్రతి భూవివాదంలోకి తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. అమాయకులైన యజమానుల్ని బెదిరించి చౌకగా భూములు కొట్టేస్తున్నారు. ప్రకృతి సంపదను దోచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అవకాశం దొరికిన ప్రతి చోట, ప్రతి సందర్భంలో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ రూ.కోట్లలో సంపాదించారనే విషయాన్ని నియోజకవర్గమంతా మొత్తం కోడై కూస్తోంది. సోదరుల అక్రమాలపై సొంత పార్టీలోనే వ్యతిరేక స్వరాలు వినిపిస్తుండటం గమనార్హం.


చెన్నేకొత్తపల్లి మండలంలో గుట్టను తవ్వి అక్రమంగా ఎర్రమట్టి తరలింపు

అనంతపురం గ్రామీణం పరిధిలోని కురుగుంట ఎస్టీ కుటుంబానికి చెందిన 5 ఎకరాల అసైన్డ్‌ భూమిని ఆక్రమించుకోవడానికి రాప్తాడు నాయకుడి సోదరుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యజమానులు కొన్నేళ్లుగా అనుభవంలో లేరని.. భూమిని వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవలే ఆ భూమిలో బోరు వేయడానికి ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు.


వెంచర్లలో ఎకరాకు రూ.10 లక్షలు

రాప్తాడు పరిధిలో ఎవరు వెంచర్‌ అభివృద్ధి చేసినా ఆ ప్రజాప్రతినిధికి కమీషన్‌ సమర్పించుకోవాల్సిందే. భూమి ధరను బట్టి ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పాలి. దీంతో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లకు అనుమతులు తీసుకోవడం లేదు. నియోజకవర్గ పరిధిలో 500 వరకు వెంచర్లు ఉండగా 98 శాతం వాటికి అనుమతులు లేవు. ముఖ్యంగా అనంతపురం గ్రామీణం పరిధిలో అన్ని లేఅవుట్ల నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* తెదేపా హయాంలో బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఓ వ్యాపారి రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ ప్రారంభించారు. విలాసవంతమైన విల్లాలు నిర్మించి విక్రయాలు మొదలుపెట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వైకాపా నాయకుడి సోదరుడు సదరు వ్యాపారిని బెదిరించారు. అనుమతులు రద్దు చేయిస్తామని దౌర్జన్యం చేసి రూ.కోటి విలువ చేసే విల్లాను రాయించుకున్నట్లు తెలుస్తోంది.

* మరూర్‌ టోల్‌గేటు వద్ద అనంతపురానికి చెందిన వ్యక్తులు 7 ఎకరాల్లో వెంచర్‌ వేయాలనుకొని పొలం కొనుగోలు చేసి అనుమతులకు దరఖాస్తు చేశారు. ఆ సోదరులు ఎకరాకు రూ.10 లక్షలు డిమాండు చేశారు. దీనికి వారు నిరాకరించడంతో వెంచర్‌కు అనుమతులు రాకుండా అడ్డుకున్నట్లు సమాచారం.
ఉప్పరపల్లి పరిధిలో 10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నకిలీ డి.పట్టాలు సృష్టించి రైతుల పేరు మీద ఆన్‌లైన్‌ ఎక్కించారు. రైతులకు మాత్రం ఎకరాకు రూ.2.50 లక్షలు ఇచ్చి భూమిని బినామీల పేరుతో నమోదు రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ వ్యవహారంలో రాప్తాడు వైకాపా నాయకుడి సోదరుడి ముఖ్య అనుచరుడు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. మధ్యవర్తితో విభేదాలు రావడంతో అతడిని బెదిరించారు.

* చెన్నేకొత్తపల్లి సమీపంలో అనంతపురానికి చెందిన కొందరు జాతీయ రహదారికి ఆనుకుని వెంచర్‌ ఏర్పాటు చేశారు. ప్లాట్లు వేసి రోడ్లు నిర్మిస్తున్న సమయంలో వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఎకరాకు రూ.10 లక్షలు ఇస్తేనే పనులు జరగనిస్తామని బెదిరించారు. దీంతో కొన్ని రోజలపాటు పనులు నిలిపివేశారు. ఇటీవల సదరు వైకాపా నాయకుడికి డబ్బులు చెల్లించి పనులు ప్రారంభించారు.

భూఅక్రమాలు ఇలా..

నియోజకవర్గంలో ఎలాంటి భూక్రయ విక్రయాలు జరిగినా ఆ ప్రజాప్రతినిధి సోదరులకు తెలియాల్సిందే. భూవివాదాల విషయంలో ఓ వర్గం నుంచి డబ్బులు తీసుకుని మరో వర్గంపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అసైన్డ్‌ భూములకు సంబంధించి నకిలీ డి.పట్టాలు సృష్టించి పొలాలు కాజేస్తున్నారు. రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు. బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు.  

* చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని కోనక్రాస్‌ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని 20 ఏళ్ల కిందట ఓ వ్యక్తికి ప్రభుత్వం 4 ఎకరాలు కేటాయించింది. అయితే సదరు భూమిని తమకు 30 ఏళ్ల కిందటే అసైన్డ్‌ చేశారంటూ సదరు వైకాపా నాయకుడి సోదరుడి అనుచరులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. భూమిలో ఉన్న మామిడి తోటను నరికేశారు.

* రాప్తాడు పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో ఆటోనగర్‌ కోసం 58 ఎకరాలు కేటాయించారు. అందులో 5 ఎకరాలను కొట్టేయాలని సోదరులు ప్రణాళికలు వేశారు. గతంలో 27 ఎకరాలు మాత్రమే కేటాయించారని, మిగిలిన భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సదరు అధికారి సెలవు పెట్టి వెళ్లిపోయారు.

* చెన్నేకొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఓ వ్యక్తికి 5 ఎకరాల పొలం ఉంది. యజమానులకు తెలియకుండానే సంబంధం లేని వ్యక్తితో ఎకరా రూ.25 లక్షలు చొప్పున రూ.కోటిన్నర చెల్లించినట్లు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. భూమి తాము కొన్నామని యజమానిపై దౌర్జన్యం చేస్తున్నారు. దీంతో యజమాని హైకోర్టును ఆశ్రయించారు.

పేదల బియ్యాన్నీ బొక్కేస్తున్నారు

పేదల బియ్యాన్ని కూడా వదలడం లేదు. చెన్నేకొత్తపల్లిని కేంద్రంగా రేషన్‌ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బియ్యాన్ని సేకరించి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ ప్రైవేట్‌ దాబాలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి సమయాల్లో కర్ణాటకలోని రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ స్టిక్కర్లు ఉన్న బియ్యం బస్తాలను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు పట్టుకోగా.. ఒత్తిడి తీసుకొచ్చి విడిపించుకున్నారు. నెలకు రూ.30 లక్షల వరకు జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

* రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కొండలు, గుట్టలను కొల్లగొట్టి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అనుచరులకు పనుల్ని అప్పగించి రోజువారీ కమీషన్లు దండుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వందల టిప్పర్ల మట్టిని లేఅవుట్లకు సరఫరా చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
* ఆత్మకూరు మండలంలోని కొన్ని గ్రామాలను పేకాట స్థావరాలుగా మార్చి దందా చేస్తున్నారు. ముఖ్య అనుచరులు కొందరు వ్యవసాయ పొలాల్లో స్థావరాలు ఏర్పాటు చేసి జోరుగా జూదం ఆడిస్తున్నారు. నిత్యం రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ఇటీవల దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని