logo

క్షణికావేశం.. తీసింది ప్రాణం

ఏ సమస్యకైనా ఆలోచిస్తే తప్పక పరిష్కారం ఉంటుంది.. ప్రాణానికి మించింది ఏదీ లేదు.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల వారి నిండు జీవితం బలైపోవడమే కాకుండా.. కుటుంబీకుల్లోనూ తీవ్ర విషాదం మిగులుతుంది..

Published : 08 Jun 2023 05:58 IST

వేర్వేరు చోట్ల ముగ్గురి బలవన్మరణం

ఏ సమస్యకైనా ఆలోచిస్తే తప్పక పరిష్కారం ఉంటుంది.. ప్రాణానికి మించింది ఏదీ లేదు.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల వారి నిండు జీవితం బలైపోవడమే కాకుండా.. కుటుంబీకుల్లోనూ తీవ్ర విషాదం మిగులుతుంది.. అలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో  వేర్వేరుగా చోటుచేసుకున్నాయి. ముగ్గురు బలవన్మరణం చెందగా.. మరో ముగ్గురు ఆత్మాహత్యాయత్నం చేసుకొన్నారు..


జామీను ఉన్న పాపానికి..

లేపాక్షి: బ్యాంకు రుణం తీసుకున్న వ్యక్తి సొమ్ము చెల్లించకపోవడంతో జామీను ఉన్న వీఆర్వోపై ఆభారం పడింది.. ఈ బాధతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని చోళసముద్రానికి చెందిన శ్రీనివాసులు (57) రొద్దం మండలం నారనాగేపల్లి వీఆర్వోగా పనిచేస్తూ అక్కడే అద్దె ఇంట్లో ఉండేవారు. అయిదేళ్ల కిందట లేపాక్షి మండలానికి చెందిన పరిచయస్తుడికి రూ.10 లక్షల రుణం కోసం బ్యాంకులో జామీను ఉన్నారు. రుణం తీసుకున్న వ్యక్తి బ్యాంకుకు నెలనెలా కంతులు కట్టలేదు. దీంతో బ్యాంకు అధికారులు వేతనాన్ని జమ చేసుకునేవారు. నెలనెలా జీతం రాకపోవడంతో తినడానికి తిండి లేక, ఇంటి అద్దె చెల్లించేందుకు డబ్బులు లేక తీవ్ర మానసిక క్షోభకు గురై రెండు రోజుల కిందట భార్యతో కలిసి స్వగ్రామానికి వచ్చేశారు. జీవితంపై విరక్తి చెందిన ఆయన బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మునీర్‌అహ్మద్‌ తెలిపారు.


పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే భర్త..

మనోజ్‌కుమార్‌ (పాతచిత్రం)

మడకశిర, గుడిబండ, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే భార్త ఆత్మహత్య చేసుకోగా.. ఈ బాధతో భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుడిబండ మండల పరిధి బాలదిమ్మనపల్లికి చెందిన హనుమంతరాయప్ప కుమారుడు మనోజ్‌కుమార్‌ (24) అదే మండలం వీరజ్జనపల్లికి చెందిన కంబన్న కుమార్తె జ్యోతి 25 రోజుల కిందట ఇంట్లో వాళ్లను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల ఇరువురు కుటుంబ సభ్యులు కలుసుకుని వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. కొద్ది రోజుల నుంచి వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో మనస్తాపం చెందిన మనోజ్‌కుమార్‌ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి కలత చెందిన భార్య జ్యోతి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెను మడకశిర ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించి వైద్యులు బతికించారు. కడుపు నొప్పి తాళలేక మనోజ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ రామాంజనేయులు తెలిపారు.


గౌతమి (పాత చిత్రం)

కొడిగెనహళ్లి (పరిగి), న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల్లో మరలా తప్పుతానన్న బెంగతో  విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని కొడిగెనహళ్లి ఎస్సీకాలనీకి చెందిన విద్యార్థిని గౌతమి (16) పదో తరగతి పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేదు. మంగళవారం నాడు సప్లమెంటరీ పరీక్షలు రాసింది. మరోసారి పరీక్షల్లో తప్పుతానేమోనని భావించిన విద్యార్థిని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి బాబయ్య గతంలో మృతి చెందారు. తల్లి జయమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. వచ్చే అరకొర ఆదాయంతోనే పెద్దకుమార్తెకు వివాహం చేసింది. చిన్నకుమార్తె గౌతమిని చదివిస్తోంది. కుమార్తె మృతితో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను కంట తడిపెట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేంద్ర తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు