logo

కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి

అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని

Published : 25 Apr 2024 05:12 IST

ఐదేళ్లలో వైకాపా నాయకుల ధన దాహానికి ప్రకృతి వనరులు మాయం

కదిరి పట్టణం, కదిరి గ్రామీణం, గాండ్లపెంట, తనకల్లు, న్యూస్‌టుడే: అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని వందల ఎకరాల్లో విస్తరించిన కొండలపై కన్నేసిన నాయకులు వాటిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. మైనింగ్‌, రెవెన్యూ అధికారులపై ప్రజాప్రతినిధులతో ఒత్తిడి పెంచుతూ ప్రకృతిని అందవికారంగా మారుస్తూ వాతావరణ సమతౌల్యతను దెబ్బతీస్తున్నారు. మట్టి వ్యాపారంతో కోట్లాదిరూపాయలు దండుకున్నారు. మట్టి వ్యాపారుల ధనదాహానికి రూపుకోల్పోయిన కొండల్లో మచ్చుకు కొన్ని..

రహదారి మాటున వ్యాపారం

రూపుకోల్పోయిన భైరవుని కొండ

కదిరి మండలం ముత్యాలచెరువు, కదిరి రెవెన్యూ పొలం మధ్యలో 216 ఎకరాల్లో విస్తరించిన భైరవుని కొండను మట్టి కోసం తవ్వేశారు. కదిరి బాహ్యవలయ రహదారి పనులు చేస్తున్న గుత్తేదారు మొదట్లో రాయల్టీ చెల్లించి కొంతమట్టిని తవ్వుకున్నారు. దీనిని అదనుగా చేసుకున్న మట్టివ్యాపారులు రెచ్చిపోయారు. రేయింబవళ్లు తేడాలేకుండా కొండను తొలిచేశారు. పట్టణానికి సమీపంలో పచ్చనిచెట్లతో కనిపిస్తున్న ఈ కొండ ప్రస్తుతం గుంతలయమంగా మారింది. బైపాస్‌ రోడ్డు పేరుతో మరికొందరు అక్రమార్కులు మట్టిని కొల్లగొట్టి పట్టణంలో వివిధ నిర్మాణాలకు అమ్ముకున్నారు.

గుట్టుగా తవ్వేశారు..

గాండ్లపెంట మండలం పోరెడ్డివారిచెరువు సమీపంలోని గుట్టను గుట్టుగా చదును చేశారు. స్థిరాస్తి వ్యాపారుల లేఅవుట్ల ఎత్తుపెంచుకోవడానికి అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల కన్ను గుట్టపై పడింది. ఎకరాల మేర పొక్లెయిన్‌లతో గుట్టను తవ్వేసి టిప్పర్ల ద్వారా మట్టిని తరలించి జేబులు నింపుకొన్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ గోదాము నిర్మాణం కోసం గుట్టను చదును చేయించారు. ఇక్కడి మట్టి నాణ్యతగా ఉండటంతో వ్యాపారుల కన్నుపడింది. దీంతో గాండ్లపెంట, కదిరి పట్టణానికి తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి మట్టిని తరలించినవారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మట్టి వ్యాపారుల బరితెగింపు

భారీ ఎత్తున తవ్వేసిన పందికోన కొండ

కదిరి, నల్లచెరువు మండలాల మధ్య 715 ఎకరాల్లో విస్తరించింది కొండ పందికోన. నల్లచెరువు మండలం అల్లుగుండు రెవెన్యూ పొలంలోని సర్వేనంబరు-1లోని ఈకొండ 20 గ్రామాల పశువుల కాపరులకు అండగా ఉంటోంది. వందలాది గొర్రెలు, మేకల గ్రాసానికి ఇదే ఆధారం. ఇలాంటి కొండపై కదిరి మండలానికి చెందిన కొందరు వైకాపా నాయకుల కన్నుపడింది. రేయి, పగలు తేడా లేకుండా ఇటాచీలు, పొక్లెయిన్లతో వందల ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వేశారు. ఈ మట్టిని పట్టణంలోని లేఅవుట్లు, వివిధ భవన నిర్మాణానికి ఒక్కో టిప్పర్‌ రూ.3 వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన మైనింగ్‌శాఖ జిల్లా అధికారులనే దుర్భాషలాడుతూ ప్రజాప్రతినిధితో చీవాట్లు పెట్టించారు. మట్టివ్యాపారుల దాష్టీకం వల్ల కొండపైకి పశువులు వెళ్లే మార్గం కూడా లేకుండాపోయిందని కాపారులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని