logo

జగనా.. రద్దు తగునా?

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో వివిధ జాతులకు సంబంధించి పాడి ఆవులు, గేదెలు కొనుగోలు చేయడంతో పాటు మాగుడు గడ్డి, దాణామృతం తదితర పోషకాలను రాయితీతో అందించి ప్రోత్సహించారు.

Updated : 28 Apr 2024 04:46 IST

‘పాడి’పై పగపట్టి.. అమూల్‌కు కట్టబెట్టి
పాతవి మూసేసి.. కొత్తవి ఏర్పాటు
నాలుగేళ్లైనా మొదలుకాని పాలసేకరణ

 అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో వివిధ జాతులకు సంబంధించి పాడి ఆవులు, గేదెలు కొనుగోలు చేయడంతో పాటు మాగుడు గడ్డి, దాణామృతం తదితర పోషకాలను రాయితీతో అందించి ప్రోత్సహించారు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా  డెయిరీ, కేంద్రాలను కొనసాగించారు. ఉద్యోగులు, సిబ్బందికి జీతభత్యాలు సకాలంలో అందించారు. 2019లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అమూల్‌ సంస్థకు పాలసేకరణ బాధ్యతలు అప్పగించారు. 2021లో గ్రామాల వారీగా సర్వే చేపట్టారు. ఏయే గ్రామాల్లో ఎన్ని పశువులు ఉన్నాయి. ఎంతమంది పాలఉత్పత్తిదారులు ఉన్నారు. ఎన్ని లీటర్లు సేకరించవచ్చ వంటి అంశాలపై సర్వే చేశారు. ఇదంతా మూడేళ్ల కిత్రం మాట. మళ్లీ ఈ ఏడాది ఎన్నికల ముందు జగన్‌ సర్కారు హడావుడి చేసింది. పాత కేంద్రాలు, డెయిరీలు మూసేసి, కొత్తవి నిర్మించారు. పాల సేకరణ అరకొరగా ప్రారంభించారు. మూడేళ్లుగానిద్రపోయి. ఇప్పుడు ఎన్నికల ముందు హడావుడి చేయడంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ పాలడెయిరీని తొలుత అనంతపురంలో తర్వాత హిందూపురంలో ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో రోజుకు 20-30 లీటర్ల పాలు సేకరించేవారు. దాన్ని 1.10 లక్షల లీటర్లకు పెంచారు. తర్వాత క్రమంగా పాలసేకరణ తగ్గినా నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉండేది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలధర పెంచకపోవడం, సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వలేక డెయిరీలు మూతపడ్డాయి.. 2020లో అమూల్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని, సేకరణ బాధ్యతలు అప్పగించింది. అప్పట్లోనే యంత్రాలు, ఇతర సామగ్రి వైయస్‌ఆర్‌, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు తరలించి.. సిబ్బందిని తొలగించారు. ఉమ్మడి అనంత జిల్లాలో రెండు ప్రధాన డెయిరీలు రాష్ట్ర విభజన తర్వాత కూడా నష్టాల్లో ఉన్నప్పటికీ తెదేపా ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చింది. వైకాపా సర్కారు ఐదేళ్లు పూర్తి నిర్లక్ష్యం చేయడంతో అవి నిర్వీర్యం అయ్యాయి.

వైకాపా హామీ గాలికి..

ధర్మవరం: డెయిరీలు ఏర్పాటు చేసి పాలకు గిట్టుబాటు ధర కల్పించి పాడి రైతులను ఆదుకుంటామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. ఐదేళ్లు గడిచినా పాడిరైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఇది వరకు ఉన్న పాలశీతలీకరణ కేంద్రాలూ మూతపడ్డాయి. ధర్మవరం నియోజకవర్గంలో జగనన్న పాలవెల్లువ కింద మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పాలు కొనుగోలు చేసేందుకు బత్తలపల్లి మండలం అప్రాచెరువులో 17.67 లక్షలతో భవనం నిర్మించారు. కానీ డెయిరీ మాత్రం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం వద్ద ఉన్న పాలశీతలీకరణ కేంద్రం మూతపడింది. దీంతో పాడి రైతులు వ్యాపారులు అడిగిన ధరకే పాలు విక్రయం చేయాల్సి వస్తోంది. స్థానికంగా మండల కేంద్రాల్లోనూ డెయిరీలు ఏర్పాటు చేయకపోవడంతో పాడిరైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.

నిబంధనలు విధించి..

ఉమ్మడి జిల్లాలో 2021లో అమూల్‌ సంస్థకు పాల సేకరణ బాధ్యతలు అప్పగించారు. పాలు చిక్కగా ఉంటే కొంటామంటున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పశువులకు మేత అందుబాటులో లేదు. ఇక తాగునీరు దొరకడమే గగనమవుతోంది. పచ్చిమేత తింటేనే పాలు చిక్కగా ఉంటాయి. సేకరణకు మహిళా సంఘాలను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ముందు పశుపోషకుల ఓట్లు దండుకోడానికి తప్ప మరొకటి కాదని డివిజన్‌స్థాయి అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. అనంత జిల్లాలోని 98 గ్రామాల్లో 96,250 ఇళ్ల సర్వే చేశారు. ఒక్కో గ్రామం నుంచి 160 లీటర్ల చొప్పున రోజుకు 15,.680 లీటర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సేకరణలో నిబంధనలు అడ్డు తగులుతున్నాయి.

ఉద్యోగుల నోట్లో మట్టికొట్టి..

ఉమ్మడి జిల్లాలో డెయిరీలు, పాలశీతలీకరణ కేంద్రాల్లో పనిచేసిన 72 మంది ఉద్యోగులు, సిబ్బందికి 2019-21లో రూ.3.10 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. విశ్రాంత ఉద్యోగులకు రూ.2 కోట్లు, పది మంది ఉద్యోగులకు జీతాలు రూ.50 లక్షలు, పాల రవాణాకు రూ.40 లక్షలు, పాల బిల్లులు రూ.20 లక్షల బకాయిలు ఉన్నాయని ఉద్యోగులే పేర్కొంటున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఒక్క పైసా మంజూరు చేయలేదు. ఇంటి అద్దె, పిల్లలకు చదువులు, కుటుంబ పోషణ చేయలేకపోతున్నాయని విశ్రాంత ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగేళ్లుగా మూసివేత

రాయదుర్గం పట్టణం: రాయదుర్గంలో 2,500 లీటర్ల సామర్థ్యంతో పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటిని రోజూ రాత్రికి అనంతపురం డెయిరీకి తరలించేవారు. అధికారంలోకి వచ్చిన వైకాపా డెయిరీను పట్టించుకోకపోవడంతో సేకరణ 2,000 లీటర్లకు పడిపోయింది. దుర్గాదేవి మండల సమాఖ్య ఆధ్వర్యంలో నడుపుతూ 1,600 లీటర్ల పాలను సేకరించేవారు. రోజూ కేంద్రానికి 220 మంది రైతులు పాలు పోసేవారు. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.17.5 లక్షల కోసం నేటికీ కేంద్రం చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.

పునాదులకే పరిమితమై..

కుందుర్పి: పాల రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకునేందుకు వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట జగనన్న పాలవెల్లువ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించింది. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో పాలసేకరణ కేంద్రాలను నిర్మించేందుకు మండలంలో మొదటి విడతగా ఎనుములదొడ్డి, నిజవళ్లి, కుందుర్పిలలో భవనాల పనులు చేపట్టారు. ఒక్కో భవనాన్ని రూ.22 లక్షల వ్యయంతో నిర్మించేందుకు వైకాపా నాయకులే గుత్తేదారులుగా పనులు ప్రారంభించారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. చేసిన పనులకు ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని