logo

పంట అమ్మాలంటే కర్ణాటక వెళ్లాల్సిందే..

ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు పంట దిగుబడులను అమ్ముకోవడానికి పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం.

Published : 28 Apr 2024 03:52 IST

రైతులకు మార్కెట్‌ సౌకర్యం కల్పించని వైకాపా ప్రభుత్వం 

నిరుపయోగంగా గోదాములు

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు పంట దిగుబడులను అమ్ముకోవడానికి పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. స్థానికంగా మార్కెట్‌ యార్డులు ఉన్నా.. అన్నదాతలకు ప్రయోజనం చేకూరడం లేదు. ఉరవకొండలో రెండున్నర దశాబ్దాల క్రితం వ్యవసాయ మార్కెట్‌యార్డు ఏర్పాటు చేశారు. దాని పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. మొత్తం 40వేల మందికిపైగా రైతులు ఉన్నారు. 50వేల హెక్టార్లకుపైగా పంటలు సాగవుతాయి. వాటిలో వేరుసెనగ, కంది, మిరప సాగు అధికం. యార్డులో విశాలమైన ప్రాంగణం, గోదాములు నిర్మించినా పంటల క్రయవిక్రయాలు సాగడం లేదు. ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను కర్ణాటకలోని బళ్లారితోపాటు వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఒకవేళ అక్కడి మార్కెట్లలో గిట్టుబాటు ధర లేకపోతే ఉత్పత్తులను వెనక్కి తీసుకురావాలన్నా.. అక్కడే నిల్వ ఉంచాలన్నా మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.

పట్టించుకోని పాలకవర్గం

ఉరవకొండ పరిసరాల్లో సాగైన పంటలను ఎక్కువ మంది రైతులు మార్కెట్‌ యార్డులో ఆరబెట్టుకోవడం, అక్కడే చెట్ల కింద నిల్వ ఉంచుకోవడం చేస్తుంటారు. యార్డు ప్రాంగణం మిరప నిల్వలతో నిండుగా కనిపిస్తుంది. పంటలకు బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. దీన్ని నిత్యం చూస్తున్న మార్కెట్‌ పాలకవర్గం, ప్రభుత్వ యంత్రాంగం యార్డును అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. కనీసం రైతుల ఇబ్బందులను ప్రస్తావించడానికి యార్డు పాలకవర్గం చొరవ చూపడం లేదు. విశాలమైన యార్డులో శీతల గిడ్డంగులు నిర్మిస్తే రైతులకు ఎంతో ఉపకరించనున్నాయి. ముఖ్యంగా మిరప రైతులకు అగచాట్లు తీరనున్నాయి. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని