logo

పల్లెల ప్రగతిపై ప్రభుత్వం నిర్లక్ష్యం

వైకాపా ఐదేళ్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉరవకొండ మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి గ్రామాలు పెద్దవి.

Published : 01 May 2024 04:09 IST

మౌలిక వసతులు లేక ప్రజల అవస్థలు

రాకెట్లలో ప్రధాన వీధిలో రహదారిపై పారుతున్న మురుగు

ఉరవకొండ, న్యూస్‌టుడే: వైకాపా ఐదేళ్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉరవకొండ మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి గ్రామాలు పెద్దవి. ఇక్కడ ఎక్కువ భాగం రైతులు, కూలీలే జీవిస్తున్నారు. ఆ గ్రామాల్లో కొన్నిచోట్ల సిమెంటు దారులు ఉన్నా, వాటికి ఇరువైపులా మురుగు కాలువలు కనిపించవు. ఇళ్లలోని వాడుక నీరు దారులపై పారుతుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మురుగు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తుంది. అందులో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మరిన్ని వీధుల్లో సిమెంటు దారులు లేవు. ఇళ్ల ముందర మట్టిదారులు గుంతలు పడి ఉన్నాయి. చిన్న వర్షం పడితే ఆ దారులు బురదగా మారుతుంటాయి. ప్రధానంగా తాగునీటి సమస్య వేధిస్తోంది. ఈ గ్రామాల్లో నీటి వనరులు అందుబాటులో ఉన్నా.. వాటి నిర్వహణలో లోపాల కారణంగా ప్రజలు తరచూ తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారం రోజులు గడిచినా కుళాయిలకు నీరు సరఫరా కాక పోవడంతో ఇక్కట్లకు గురవుతున్నారు.

గ్రామాలు: ఆమిద్యాల, రాకెట్ల, మోపిడి
వీధులు: 70
నివాసాలు: 4,100
జనాభా: 12వేలకు పైగా
ప్రధాన సమస్యలు: మురుగు కాలువలు, సిమెంటుదారులు, తాగునీరు


ఒక్క పని చేసింది లేదు
- శ్రీనివాసులు, వార్డు సభ్యుడు, రాకెట్ల

గ్రామంలో ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని చేసింది లేదు. మురుగు దారులపై పారుతుంది. నేటికీ చాలా వీధుల్లో మట్టిదారులే దర్శనమిస్తున్నాయి. పేరుకు మాత్రం అధికార పార్టీ నాయకులు ఏమేమో చేశామని చెప్పుకొంటున్నారు. అభివృద్ధి జరుగక ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.


మురుగు సమస్యకు పరిష్కారం చూపలేదు
- రామాంజనేయులు, ఆమిద్యాల

మండలంలోనే ఆమిద్యాల పెద్ద గ్రామం. ఇక్కడ చాలా వీధుల్లో సిమెంటు దారులపై మురుగు పారుతుంది. కొన్ని వీధుల్లో అడుగు తీసి వేయలేని పరిస్థితి. ఐదేళ్లలో కనీసం ఆ సమస్యకు పరిష్కారం చూపిన పాపాన పోలేదు. తాగునీటి సమస్య వేధిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని