logo

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో ఉద్యోగులకు తప్పని ఇక్కట్లు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. రెండో రోజు కూడా అస్తవ్యస్తం, గందరగోళం కనిపించింది. సంబంధిత ఆర్వోలు నిర్దేశిత వసతులు, సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధ చూపినట్లు తేలిపోయింది.

Published : 05 May 2024 03:54 IST

కొత్తూరు జూనియర్‌ కళాశాల వద్ద బారులు తీరిన ఉద్యోగులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. రెండో రోజు కూడా అస్తవ్యస్తం, గందరగోళం కనిపించింది. సంబంధిత ఆర్వోలు నిర్దేశిత వసతులు, సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధ చూపినట్లు తేలిపోయింది. ఎండలో సైతం ఎన్నికల సిబ్బంది గంటలకొద్దీ నిరీక్షించి ఓటు వేశారు. జిల్లాలోని చాలా ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో తాగునీరు, నీడ.. వంటి కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. అనంత నగరం ఫెసిలిటేషన్‌ కేంద్రంలో దాదాపు 6 వేల మందికిపైగా ఓటు వేస్తున్నారు. ఓటు వేసేందుకు రెండు మూడు గంటలు సమయం పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇరుకైన గదుల్లో బూత్‌లు ఉండటంతో ఉక్కపోతకు అల్లాడిపోయారు. అనంత, కళ్యాణదుర్గం, రాయదుర్గం, శింగనమల, వంటి ప్రాంతాల్లో గంట ఆలస్యంగా పోలింగ్‌ మొదలైంది.  

  • అనంత జిల్లాకు చెందిన వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు శ్రీసత్యసాయి జిల్లాలో గడువు మీరిన తర్వాత ఎన్నికల నియామక ఉత్తర్వులు అందాయి. ఈనెల ఒకటినే ఫాం-12 దరఖాస్తుకు గడువు ముగిసింది. 2న ఆ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలాంటి వారు వందల్లోనే ఉన్నారు. వీరికి ఓటు వేసే అవకాశం లేకుండా పోతోంది. అనంత జిల్లాలోనూ కొందరు ఉపాధ్యాయ, ఉద్యోగులు ఉన్నారు. అనంత ఎన్‌జీ రంగా వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న ఓ సీనియర్‌ సహాయకుడిని ఉద్యోగ రీత్యా కదిరికి కేటాయించారు. ఆయనకు మొన్నటి దాకా ఏ జిల్లాలోనూ ఎన్నికల విధులు కేటాయించలేదు. ఉన్నఫళంగా 2న కళ్యాణదుర్గానికి కేటాయిస్తూ ఉత్తర్వు వచ్చింది. ఈయన ఫాం-12 దరఖాస్తు చేసుకోలేదు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. కనీసం ఒక రోజు అవకాశం ఇస్తే దరఖాస్తు చేసుకునేవాళ్లమని అభిప్రాయపడ్డారు.
  • అనంత నగర కొత్తూరు జూనియర్‌ కళాశాల ఆవరణలో కొనసాగుతున్న ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని తెదేపా, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుపాటి ప్రసాద్‌, అనంత వెంకటరామిరెడ్డి వేర్వేరుగా పరిశీలించారు. కేంద్రంలో సౌకర్యాలు, ఇతరాత్ర సమస్యలపై ఆర్వో వెంకటేశు, తహసీల్దారు శివరామిరెడ్డితో మాట్లాడారు. గంటలకొద్దీ నిరీక్షించే పరిస్థితి లేకుండా అదనంగా మరో రెండు బూత్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

పేర్లు ఉన్నాయా లేవా.. అని ఆరా తీస్తున్న ఉద్యోగులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని