logo

మళ్లీ అధికారంలోకి వస్తే అంతుచూస్తాం

మా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీఅంతు చూస్తాం.. అంటూ తెదేపా నాయకుడు, కుప్పం పురపాలిక ఐదోవార్డు తంబిగానిపల్లెకు చెందిన కౌన్సిలర్‌ సెల్వం, మరొకరిపై వైకాపా కార్యకర్తలు దాడిచేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 23 May 2024 02:09 IST

తెదేపా కౌన్సిలర్‌పై వైకాపా శ్రేణుల దాడి

దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నాయకుడు, 5వ వార్డు కౌన్సిలర్‌ సెల్వం, కార్యకర్త అశోక్‌

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: మా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీఅంతు చూస్తాం.. అంటూ తెదేపా నాయకుడు, కుప్పం పురపాలిక ఐదోవార్డు తంబిగానిపల్లెకు చెందిన కౌన్సిలర్‌ సెల్వం, మరొకరిపై వైకాపా కార్యకర్తలు దాడిచేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం చోటుచేసుకుంది. ఎంపీటీసీ మాజీ సభ్యుడు నరేంద్ర దుకాణం వద్ద కూర్చుని ఉండగా వైకాపా గూండాలు ప్రణాళికాబద్ధంగా వచ్చి దాడి చేసినట్లు కౌన్సిలర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్వంను రక్షించేందుకు  వెళ్లిన తెదేపా కార్యకర్త అశోక్‌పై రాడ్డు, తూకం త్రాసుతో దాడిచేసి రక్తం వచ్చేలా కొట్టారు. మళ్లీ వైకాపా ప్రభుత్వమే వస్తుందని.. అప్పుడు మీఅంతు చూస్తామంటూ వైకాపా కార్యకర్తలు సాయికిరణ్, యమరాజ్, నాగరత్నంలు దుర్భాషలాడుతూ, బెదిరింపులకు గురిచేసినట్లు బాధితులు వాపోయారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ తమను ఇబ్బంది పెట్టేందుకు యత్నించారన్నారు. గాయపడిన వారిద్దరినీ కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్‌ తలపై మూడు కుట్లు పడ్డాయి. సెల్వం చేతికి, నడుముకు గాయం కావడంతో చికిత్స పొందుతున్నారు. తమకు రక్షణ కరవైందని, ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారని కౌన్సిలర్‌ ఆరోపించారు. కుప్పం అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

బీసీవై పార్టీ కార్యకర్త భార్యపై కత్తితో..

పుంగనూరు గ్రామీణ : భారత చైతన్య యువజన పార్టీ కార్యకర్త శంకర భార్య అంజమ్మపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు.  మాగాండ్లపల్లి పంచాయతీ బరినేపల్లికి చెందిన బీసీవై కార్యకర్త శంకర, సదుం అల్లర్లలో ఉన్నారని ఈనెల 19న పోలీసులుË అరెస్టు చేశారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్‌ చేయించారని అంజమ్మ గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు చంద్రశేఖర్, పురుషోత్తములను నిలదీశారు. దీంతో వారు ఆగ్రహించి కత్తితో తీవ్రంగా గాయపరిచారు. గ్రామస్థులు అంజమ్మను ఆసుపత్రికి తరలించారు. ఏఎస్‌ఐ దామోదరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదు : చంద్రబాబు

కుప్పం పురపాలిక 5వ వార్డు తంబిగానిపల్లె కౌన్సిలర్‌ సెల్వం, తెదేపా కార్యకర్త అశోక్‌పై వైకాపా గూండాల దాడి అమానుషమని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం కౌన్సిలర్, తెదేపా కార్యకర్తపై జరిగిన దాడిపై నియోజకవర్గ తెదేపా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌లో అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయించి, బాధితులకు అండగా ఉండాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, పీఏ మనోహర్‌ తదితరులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు