logo
Published : 29/11/2021 06:30 IST

గళం వినిపిస్తాం..నిధులు సాధిస్తాం

‘ఈనాడు’తో ఎంపీలు

ఈనాడు డిజిటల్‌, తిరుపతి, చిత్తూరు: నవంబరులో రెండు దఫాలుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. వరదలతో రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. 32వేల ఎకరాలకుపైగా పంట నష్టం జరిగింది. వరి, టమోటా సాగు చేస్తున్న రైతాంగానికి నష్టాలే మిగిలాయి. నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. జిల్లాకు చెందిన ఎంపీలు లోక్‌సభలో తమ గళాన్ని వినిపించడానికి సన్నద్ధమయ్యారు. వరద నష్టంపై ప్రస్తావించనున్న అంశాలపై ఆదివారం వారు ‘ఈనాడు’తో మాట్లాడారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం

వర్షాలతో జిల్లాకు ఎన్నడూ లేనంతగా నష్టం జరిగింది. జిల్లా యంత్రాంగం వేసిన ప్రాథమిక అంచనాల మేరకు తిరుపతి నగరంతోపాటు మిగతా అన్ని నియోజకవర్గాలతో కలిపి రూ.600 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. వరదలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని సోమవారమే లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం. రహదారులు, వంతెనల నిర్మాణం.. మరమ్మతులకు ఇతోధిక సాయం అందించాలని విన్నవిస్తాం. సంబంధిత మంత్రులనూ కలుస్తాం. పడమటి మండలాల్లో చెరువులూ దెబ్బతిన్నాయి. కేంద్రం నుంచి జిల్లాకు గరిష్ఠ సాయం అందేలా చూస్తాం. -మిథున్‌రెడ్డి, రాజంపేట ఎంపీ 

 

రహదారులకు నిధులు కోరుతా

చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వర్షాలకు గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోనే రూ.134 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సంబంధిత అధికారులు తెలిపారు. వీటి మరమ్మతులకు కేంద్రం సాయం అందించాలని లోక్‌సభలో డిమాండ్‌ చేస్తా. పేదల ఇళ్లు కూలిపోయాయి. వీటి నిర్మాణానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని విన్నవిస్తా. పంట నష్టంపై కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక త్వరితగతిన ఆమోదం తెలిపి.. అన్నదాతలకు సాయం చేయాలని పార్లమెంట్‌లో గళం వినిపిస్తా. - రెడ్డెప్ప, చిత్తూరు ఎంపీ

 

తూర్పున తీవ్ర నష్టం

భారీ వర్షాలు, వరదలతో తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. కేంద్ర బృందానికి నష్టాన్ని వివరించా. తక్షణ సాయంగా నిధులు మంజూరు చేయాలని కోరా. పార్లమెంట్‌లోనూ ప్రజల కష్టాలను వివరిస్తా. రేణిగుంట విమానాశ్రయంలో విమానాల మరమ్మతు కేంద్రానికి అనుమతులు వచ్చినా... పనులు ప్రారంభం కాలేదు. మొదటి దశలోనే ప్రాజెక్టు చేపట్టాలని కోరతా. తిరుపతి కేంద్రంగా పర్యాటక విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కోసం ప్రయత్నిస్తా. మన్నవరం ప్రాజెక్టే ప్రధాన అజెండాగా పార్లమెంట్‌లో పోరాడతా. ఈ మేరకు అధికారులతో ఇది వరకే సమీక్షించి నివేదిక తీసుకున్నాం. - గురుమూర్తి, ఎంపీ, తిరుపతి.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని