logo

రైళ్ల నిరీక్షణ!

తిరుపతి రైల్వేస్టేషన్‌లో రైళ్ల తాకిడి, ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే  ప్రణాళికలు రూపొందించి తిరుచానూరు రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.

Published : 29 Nov 2022 02:16 IST

అందుబాటులోకి రాని తిరుచానూరు రైల్వేస్టేషన్‌

నిర్మించిన ప్లాట్‌ఫామ్‌

తిరుపతి రైల్వేస్టేషన్‌లో రైళ్ల తాకిడి, ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే  ప్రణాళికలు రూపొందించి తిరుచానూరు రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. స్టేషన్‌ అన్ని వసతులు పూర్తి చేసుకున్నా.. ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.

తిరుపతి (రైల్వే), న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో రైళ్లలో ప్రయాణించే వారే అధికం. రోజుకు 80 నుంచి 90 రైళ్లలో సుమారు 40 వేల మంది వస్తుంటారు. దీంతో స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లపై రైళ్ల నిలుపుదలకు ఆటంకం ఏర్పడుతుండటంతో కూతవేటు దూరంలో కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపివేయాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించేందుకు తిరుచానూరు రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది.

2016-17లో రూ.56.38 కోట్లు మంజూరు చేయగా.. రూ.36 కోట్లతో గుంతకల్‌ డివిజన్‌ నిర్మాణ సంస్థ నేతృత్వంలో తిరుచానూరు స్టేషన్‌ను బీ క్లాస్‌ స్టేషన్‌గా అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేపట్టింది. మూడు ప్లాట్‌ఫామ్‌లు, షెల్టర్లు, ప్ల్లాట్‌పామ్‌లపై ప్రయాణికులు వేచి ఉండటానికి బెంచీలు, నీటి సౌకర్యం, ఆహార కేంద్రాలు, వెయిటింగ్‌ హాళ్లు, సబ్‌వే, స్టేషన్‌ మేనేజర్‌ కార్యాలయం, వీఐపీ లాంజ్‌, మహిళలకు నిరీక్షణ గదులు, రిజర్వేషన్‌, బుకింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం పనులు పూర్తి చేశారు. విశాలవంతమైన పార్కింగ్‌తో పాటు టాక్సీస్టాండ్‌, బస్సులు నిలుపు స్థలం కేటాయించారు.

ప్రారంభిస్తే తీరనున్న సమస్యలు

తిరుపతికి రాకపోకలు సాగించడానికి అనుకూలంగా ఉన్న స్టేషన్లు తిరుపతి, రేణిగుంట. సాధారణంగా తిరుపతికి ఉదయం సమయంలో చేరుకునే రైళ్లు, సాయంత్రం బయలుదేరే రైళ్లు అధికంగా ఉంటాయి. ఆయా సమయాల్లో స్టేషన్‌ బయట ట్రాఫిక్‌, పార్కింగ్‌కు ఇబ్బందిగా ఉంటోంది. ఈ క్రమంలో తిరుచానూరు రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలకు చెక్‌ పెట్టడంతో పాటు ఎంచుకున్న రైలును నిర్దేశిత సమయంలో అందుకోవచ్చు. తిరుపతి- రేణిగుంట మధ్యలో తిరుచానూరు రైల్వేస్టేషన్‌ ప్రధాన రహదారికి పక్కనే ఉండటం, ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో ప్రయాణికులు  సులభంగా గమ్యానికి చేరుకోవచ్చు.

షెల్టర్ల నిర్మాణం జరుగుతోంది

ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రెండో ప్లాట్‌ఫామ్‌కు షెల్లర్లు లేవు. అందుకోసం ప్రదిపాదనలు పంపాం. అనుమతులు వచ్చాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం స్టేషన్‌లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

కె.సత్యనారాయణ, తిరుపతి రైల్వేస్టేషన్‌ డైరెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని